రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ)/గన్నేరువరం : అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కండగండ్లు మిగిల్చింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పడిన వానకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల పంట చేతికందే దశలో నేలపాలైంది. సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు గంభీరావుపేట, ఇల్లంతకుంట, కోనరావుపేట, వేములవాడరూరల్, ఇల్లంతకుంట మండలం అనంతగిరి, వేములవాడ రూరల్ మండలంలోని బొల్లారం, లింగంపల్లిలో వరిపంట దెబ్బతిన్నది.
కోనరావుపేట మండలం మంగళంపల్లిలో మక్క నేలకొరిగింది. వడగండ్ల వానకు వందల ఎకరాలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మాదాపూర్, పీచుపల్లి, జంగపల్లి గ్రామాల్లో వడగండ్ల వర్షానికి వరి, మక్క, మామిడి రైతులకు అపార నష్టం జరిగింది. మాదాపూర్లో రైతులు మాడుగుల మహేశ్, గొడుగు స్వామికి చెందిన మక్క పంట నేలకొరిగింది. పొలాల్లో వడ్లు, మామిడి తోటల్లో కాయలు నేలరాలిపోయాయి. ఈ మూడు గ్రామాల్లో 40మంది రైతులకు చెందిన 126 ఎకరాల వరి, ఆరుగురు రైతులకు చెందిన మక్క పంటకు నష్టం వాటిల్లినట్లు కలెక్టర్కు అధికారులు ప్రాథమిక నివేదిక అందించారు.
నిర్లక్ష్యానికి తడిసిన ధాన్యం
కొనుగోలు కేంద్రాలకు చేర్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. రాత్రి వేళ వాన పడడడంతో ధాన్యం కుప్పల వద్దకు రైతులు చేరుకోలేక పోయారు. అయితే కొనుగోళ్లలో జాప్యం, రోజుల తరబడి కేంద్రాల్లోనే పేరుకుపోవడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆరురోజుల కిందట ధాన్యం తెస్తే ఇంత వరకు ఏఅధికారి తమను పట్టించుకోలేదని ఎర్రం ఎల్లయ్య అనే రైతు ఆవేదన వ్యక్ంత చేశాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వెంట వెంట కొనుగోలు చేయాలని కోరుతున్నారు.