చొప్పదండి, మార్చి 20 : ‘పొలాలకు నీళ్లు లేక.. కరెంట్ రాక పంటలు ఎండుతున్నా కనిపించడం లేదా..? రైతులు గోస పడుతున్నా సీఎం రేవంత్‌రెడ్డికి పట్టదా?’ అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. గురువారం చొప్పదండి మండలం మల్లన్నపల్లిలో ఎండిన పొలాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ పంటల పరిస్థితులను వివరించారు. రైతు బండారు స్వామి మాట్లాడుతూ నీళ్లు లేక పొట్టకొచ్చిన ఎకరంన్నర పొలం ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 20 వేలు ఖర్చుపెట్టి బావిలో పూడిక తీసినా నీళ్లు రావడం లేదని వాపోయాడు. అనంతరం సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నదని విమర్శించారు. పంట చేతికొచ్చే సమయంలో రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కెనాల్లో 24 గంటలు నీళ్లు, కరెంట్ ఉండేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక వారబంధీ పద్ధతిన అది కూడా పదిరోజులకు ఒకసారి కెనాల్‌కు నీరు విడుదల చేస్తున్నారని, దానివల్ల అవి చివరి ఆయకట్టుకు అందడం లేదని వాపోయారు. పదెకరాలు ఉంటే సగం ఎండిపోతున్నదని తెలిపారు. ఎండిన పంటలకు ఎకరాకు 25 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మినుపాల తిరుపతిరావు, మాచర్ల వినయ్, చీకట్ల రాజశేఖర్, గన్ను శ్రీనివాస్‌రెడ్డి, గాండ్ల లక్ష్మణ్, వడ్లూరి భూమయ్య, జహీర్, బీసవేణి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆరు లక్షలు పెట్టి తవ్వినా నీళ్లు లేవు
నాకు మూడెకరాల పొలం ఉన్నది. ఇప్పుడు రెండెకరాలు ఎండిపోయింది. రూ. ఆరు లక్షలు ఖర్చుపెట్టి బావి తవ్వించిన. అయినా నీళ్లు ఎల్లకపోవడంతో ఐదు సైడ్ బోర్లు వేయించిన. బావిల నీళ్లు పంటకు సరిపడా వెళ్తలేవు. కరెంట్ గడిగడికి పోవడంవల్ల ఉన్న నీళ్లు కూడా సక్కగ పారుతలేవు. మడి మడికి పైపులైను వేసి నీళ్లు పెడుతున్న. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ పుష్కలంగా నీళ్లు వచ్చేవి. పంటలు బాగా పండించుకున్నం. అప్పుడు కెనాల్ల నీళ్లు ఉండడం వల్ల బావిల ఊట వచ్చి ఫుల్లు నీళ్లు ఉండేవి. ఇప్పుడు కెనాల నీళ్లు లేక భూగర్భ జలాలు ఇంకి పోయినయ్. పంటలు ఎండిపోయిన రైతులను సర్కారు ఆదుకోవాలె.
-బండారు తిరుపతి, మల్లన్నపల్లె
ఎప్పుడూ ఇసొంటి పరిస్థితి రాలే..
నేను ఎకరంన్నర వరి వేస్తే నీళ్లు లేక ఎండిపోయింది. పొట్ట కొచ్చినంక ఎండిపోతున్నదని 20 వేలు ఖర్చుపెట్టి బావి పూడిక తీసిన. అయినా నీళ్లు రాలే. బావిల నీళ్లు అడుగంటినయ్. కరెంట్ సమస్యతో సతమతమవుతున్నం. 50 వేల దాకా పెట్టుబడి పెట్టిన. పొలం మొత్తం ఎండిపోయింది. కేసీఆర్ సారు ఉన్నప్పుడు పదేండ్ల బీఆర్ఎస్ పాలనల ఎప్పుడూ ఇంతటి పరిస్థితి రాలే. కాంగ్రెస్ సరార్ రైతులను మస్తు తిప్పలు పెడుతంది.
– బండారు స్వామి, మల్లన్నపల్లె