తిమ్మాపూర్, ఏప్రిల్ 15 : రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి వేచి చూస్తున్నా ప్రభుత్వం ఇంకా ఎందుకు కొనుగోళ్లు ప్రారంభించలేదని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. తిమ్మాపూర్ కొనుగోలు కేంద్రంలోని వడ్ల రాశుల వద్ద సీపీఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిలూరి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో ‘వడ్లు కొనుర్రహో..’ అంటూ డప్పు చాటింపు చేస్తూ నిరసన తెలిపారు. పదిహేను రోజుల నుంచి వరి కోతలు మొదలైనా కేంద్రాలను ప్రారంభించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
జిల్లావ్యాప్తంగా కనీసం 20 కేంద్రాలు కూడా ప్రారంభించలేదన్నారు. కేంద్రాలను ప్రారంభించినా.. తూకం వేయడం లేదన్నారు. వాతావరణంలో మార్పులతో రైతులు తకువ ధరలకు దళారులకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు సుంకరి సంపత్, మాతంగి శంకర్, వెంకటస్వామి, కుమార్, నాగరాజు, వేల్పుల కుమార్, ఆడిచర్ల వెంకటేష్, బోళ్ల మొగిలి, గడ్డి రాజయ్య, మాతంగి వెంకటేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.