Sircilla | కలెక్టరేట్, జూన్ 16 : సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ సేవలు పేద ప్రజలకు అందడం లేదని సీపీఎం పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ ఆరోపించారు. స్థానిక కార్మిక భవన్లో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పేదలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించేందుకు ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని విమర్శించారు. అత్యవసరంగా రక్తం అవసరమైన బాధితులు ఆసుపత్రికి వస్తే, మరో వ్యక్తి రక్తదానం చేస్తేనే రక్తం ఇస్తామని నిబంధనలు పెట్టడం వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
అలాగే, ఆసుపత్రిలో తాజా రక్తం అందుబాటులో లేదంటూ రోగులు, వారి కుటుంబ సభ్యులను భయాందోళనలకు గురిచేసి ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులను ఆశ్రయించాలని సూచిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో లభించాల్సిన సేవల కోసం ప్రజలు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ వెంటనే విచారణ జరిపి, బ్లడ్ బ్యాంక్ సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శ్రీరాములు, రమేష్ చంద్ర, అలువాల లక్ష్మణ్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.