కరీంనగర్ తెలంగాణ చౌక్, జూలై 5: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశీయ బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టి విదేశాలలో జల్సాలు చేస్తున్న విజయ్ మాల్యా, నీరజ్ మోదీలను దేశానికి రప్పించడంలో ప్రధాని విఫలమయ్యారన్నారు. కరీంనగర్లోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పంజాల శ్రీనివాస్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. శత్రుదేశం పాకిస్తాన్తో చర్చలు జరిపిన కేంద్ర ప్రభుత్వం.. మావోయిస్టులతో ఎందుకు చర్చలు జడపడం లేదో సమాధానం చెప్పాలన్నారు. విలువైన అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పథకాలు అందించాలని కోరుతూ ఈ నెల 15 నుంచి 20 వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు తమ పార్టీ తరపున వినతి పత్రం అందిస్తామన్నారు. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులపైన ప్రభుత్వం దృష్టి సారించి నిర్మాణాలను పూర్తిచేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నాయకులు బోయిని అశోక్, పైడిపల్లిరాజు పాల్గొన్నారు.