న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సుంకాల విషయంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వం విధించిన విస్తృతమైన ప్రపంచ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఆయన తన అధికార పరిధిని దాటి టారిఫ్‌లను విధించారని ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. వైట్ హౌస్ అగ్ర విధాన ప్రాధాన్యతలలో ఒకటైన భారీ సుంకాలు నిరుడు ప్రపంచ వాణిజ్యంలో కొత్త అనిశ్చితిని ప్రవేశపెట్టాయి. ట్రంప్ తన అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యతలలో ఒకటైన సుంకాలను విధించడానికి ఉపయోగించిన చట్టం ఆయనకు ఆ అధికారాన్ని ఇవ్వలేదని 6-3 మెజారిటీ తీర్పులో అమెరికా అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
పన్నులు విధించే అధికారాన్ని ఏ కార్య నిర్వాహక విభాగానికీ అప్పగించలేదని సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ అన్నారు. సుంకాలు, పన్నులు విధించే అధికారం దేశ అత్యున్నత చట్ట సభ అయిన యూఎస్ కాంగ్రెస్‌కే ఉంటుందని దేశ రాజ్యాంగంలో పేర్కొన్న విషయాన్ని బెంచ్ గుర్తు చేసింది. జాతీయ అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందించడానికి అధ్యక్షుడికి అధికారం ఇచ్చే చట్టం ప్రకారం సుంకాల విధింపు సమర్థనీయమేనని ట్రంప్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వాదించింది.
అధ్యక్షుడు సుంకాలు విధించడానికి ఉపయోగించిన చట్టంలో సుంకాలు అనే పదం గురించి ప్రస్తావించలేదని ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేసిన రాష్ర్టాలు, ప్రైవేట్ సంస్థల తరఫు న్యాయవాదులు వాదించారు. పన్ను విధించే తన అధికారాలను కాంగ్రెస్ అప్పగించలేదని, లేదా ఇతర వాణిజ్య ఒప్పందాలు, సుంకాల నిబంధనలను పక్కనపెట్టడానికి అధ్యక్షుడికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని ఉద్దేశించలేదని వారు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జిలు దేశాధ్యక్షుడి నిర్ణయం చట్ట విరుద్ధమని సుంకాలను కొట్టేసింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పు గత సంవత్సరం ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశం నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ విధించిన సుంకాలకు వర్తిస్తుంది.
ఇతర దేశాలకు విస్తరించే ముందు మొదట మెక్సికో, కెనడా, చైనాలను లక్ష్యంగా చేసుకుని ఏప్రిల్‌లో విముక్తి దినోత్సవం నాడు సుంకాల విధింపునకు ట్రంప్ శ్రీకారం చుట్టారు. అత్యవసర పరిస్థితికి ప్రతిస్పందనగా వాణిజ్యాన్ని నియంత్రించే అధికారాన్ని అధ్యక్షుడికి ఇచ్చే 1977 చట్టం అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ) ఉపయోగించి ఈ సుంకాలు సమర్థనీయమేనని ట్రంప్ వాదిస్తూ వచ్చారు.
తాను విదేశాల ఉత్పత్తులపై విధించిన టారిఫ్‌లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ‘అవమానకరం’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై తనకు ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉన్నట్టు ఆయన తెలిపారు. కాగా, వివిధ దేశాలకు ట్రంప్ విధించిన అదనపు సుంకాల ద్వారా అమెరికాకు నిరుడు డిసెంబర్ నాటికి 133 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరినట్టు సమాచారం.
ఈ తీర్పు ట్రంప్ బాధితులైన వివిధ దేశాలకు వేల కోట్ల డాలర్ల సుంకాల వాపసుకు తలుపులు తెరుస్తుంది. ఈ తీర్పు అమలైతే భారత్‌కు పెద్ద ఉపశమనం కలుగుతుందనడంతో సందేహం లేదు. ముఖ్యంగా దీని ప్రభావం వల్ల యూఎస్ మార్కెట్లో మన వస్తువులకు అడ్డంకులు తొలగవచ్చు. వస్త్ర పరిశ్రమ, ఐటీ, ఇంజనీరింగ్ గూడ్స్, వ్యవసాయ ఉత్పత్తులు, ఆటో కాంపొనెంట్స్, వజ్రాల పరిశ్రమ, ఫార్మా, స్టీల్, కెమికల్స్‌కు ఆర్డర్లు పెరుగుతాయి. విదేశీ పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ట్రేడ్ అనిశ్చితి తగ్గితే మార్కెట్లు స్థిరంగా ఉంటాయి.
సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ ఉపాధ్యక్షుడు, మైక్ పెన్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై సంతోషాన్ని ప్రకటించిన ఆయన ‘ట్రంప్ విధించిన టారిఫ్‌లను విదేశాలు కాదు.. అమెరికా కుటుంబాలు, అమెరికా వ్యాపారాలు చెల్లిస్తున్నాయి. ఈ నిర్ణయంతో అమెరికా కుటుంబాలు, వ్యాపారులు తేలిగ్గా ఊపిరి పీల్చుకోవచ్చు’ అని ఆయన సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యానించారు. ఈ తీర్పు వల్ల ట్రంప్ ఆర్థిక ఎజెండాకు ముఖ్యమైన అంశంపై గణనీయమైన నష్టాన్ని కలిగించిందని పలువురు ఆర్థిక వేత్తలు వ్యాఖ్యానించారు.