UREA | చిగురుమామిడి, ఆగస్టు 20: రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోలి బాపురెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయం ఎదుట రైతులతో కలిసి బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం యూరియా బస్తాలు రైతులకు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమన్వయం లేక యూరియా కష్టాలు తీవ్రం అయ్యాయని, ప్రతీరోజు యూరియా కోసం రైతులు తెల్లవారుజామున క్యూలో నిల్చో వలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ యూరియా పంపిణీ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ప్రతిరోజు సహకార కేంద్రం వద్ద రైతులు బారులు తీరుతూ చెప్పులు పెట్టి గంటల తరబడి లైన్లో నిలుచున్నప్పటికీ స్థానిక మంత్రి కనీసం స్పందించకపోవడం విడ్డూరమన్నారు. రైతులను గోస పెట్టిన ఏ ప్రభుత్వం కూడా నిలవదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాదారు పాసుబుక్కు, ఆధార్ కార్డు ఉంటేనే యూరియా ఇస్తున్నారని ఇది చాలా దుర్మార్గమైన చర్య అని వారన్నారు.కొందరు కృత్రిమ కోరత సృష్టించి బయట విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వాటిని అడ్డుకట్ట వేసేందుకు సింగిల్ విండో కార్యాలయ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
రైతులకు యూరియా సకాలంలో అందని యెడల రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ ముద్రకోల రాజయ్య, మనోజ్, మహేందర్ రెడ్డి, ఐలయ్య, గంగారెడ్డి, మల్లారెడ్డి, రామస్వామి, పోచయ్య, స్వామి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.