Siricilla | కలెక్టరేట్, జూన్ 30 : ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సీపీఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియ వల్ల పేదలు, వలస కార్మికులు, గిరిజనులు, దళితులు, మైనారిటీల ఓటు హక్కులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల పేర్ల తొలగింపులో పారదర్శకత పాటించాలని, ప్రతీ ఓటరికి ముందస్తు సమాచారమిచ్చి అభ్యంతరాలు తెలిపే అవకాశం కల్పించాలని కోరారు.
చదువురాని ఓటర్లకు బీఎల్వోలు ఫారాలు నింపడంలో సహాయం చేయాలని, ఆధార్ ఒక్కటే గుర్తింపు పత్రంగా పరిగణించకుండా చట్టబద్ధమైన ఇతర పత్రాలను కూడా స్వీకరించాలని సూచించారు. ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించే విధంగా సవరణలు జరిగితే సీపీఐ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు.