Indiramma indlu | చిగురుమామిడి, ఆగస్టు 5: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు నిరుపేద కుటుంబాలకు మంజూరు చేస్తామని చెప్పి, ఇందిరమ్మ కమిటీ అనర్హులను ఎంపిక చేస్తున్నారని, గ్రామంలో అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులు అర్హులైన వారికి ఎంపిక చేయడంలో విఫలమయ్యారని బాధ్యత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన వంతడుపుల శ్రీనివాస్, సృజన దంపతులు చాలా కాలంగా సొంత ఇల్లు లేక కిరాయి ఇంట్లో ఉంటున్నారు.
ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రామంలో ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో అధికారులను, కాంగ్రెస్ నాయకులను ఇల్లు మంజూరు చేయాలని వేడుకున్నారు. ఇందిరమ్మ కమిటీకి పలుమార్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ లబ్ధిదారుల ఎంపికలో తమ పేరు లేకపోవడంతో వారు అవాక్కయ్యారు. అనర్హులను ఇందిరమ్మ ఇళ్లలో ఎంపిక చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, కాంగ్రెస్ నాయకుల తీరుతో మనస్థాపం చెంది బాధిత దంపతులు మంగళవారం సుందరగిరి చౌరస్తా వద్ద రోడ్డుపై పెట్రోల్ బాటిల్ తో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అర్హులైన తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంలో ఇందిరమ్మ కమిటీ, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారని వారు ఆరోపించారు.
రెండో విడతలో సైతం తమకు పేరు లేకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. కాంగ్రెస్ నాయకులు సైతం ఇస్తానుసారంగా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన వద్ద స్థానికులు విరమింపజేసేందుకు ప్రయత్నించగా శ్రీనివాస్ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. కొంత పెట్రోల్ తాగడంతో స్థానికులు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని వెంటనే 108 వాహనంలో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా స్థానిక కాంగ్రెస్ నాయకుల ఒంటెద్దు పోకడలతో అర్హుడు నైనా తనకు న్యాయం జరగడం లేదని, పంచాయతీ కార్యదర్శి, అధికారులు సైతం కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కయ్యారని డిఎస్పి జిల్లా అధ్యక్షుడు తాళ్ల నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎంపిక విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.