దళితబంధు రెండో విడుత నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కి పెడుతున్నది. దళితుల ఖాతాను ఫ్రీజ్ చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నది. కేసీఆర్ సర్కారు చేసిన ఆర్థిక సహాయాన్ని విడిపించుకోకుండా ఆంక్షలు విధించగా, హుజూరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులు ఆగ్రహిస్తున్నారు. రెండో విడుత డబ్బులు వస్తాయనే నమ్మకంతో అప్పులు తెచ్చి వ్యాపారాలు విస్తరించుకున్నామని, ఇప్పుడు ప్రభుత్వ వైఖరితో చిక్కుల్లో పడ్డామని ఆవేదన చెందుతున్నారు.
తమ ఖాతాల్లో ఉన్న నగదును విడిపించుకోలేక, వ్యాపారాలు నిర్వహించుకోలేక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. శుక్రవారం మరోసారి హుజూరాబాద్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితుల నోటికాడి బుక్కను రేవంత్‌రెడ్డి లాక్కోడానికి చూస్తున్నాడని తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు. తమ డబ్బులు ఇవ్వకుండా ఆంక్షలు ఎందుకు విధించారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నారు.
కరీంనగర్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గొప్ప ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మొదట ఇక్కడ అమలు చేశారు. 2021 ఆగస్టులో ఈ పథకాన్ని హుజూరాబాద్‌లోనే ప్రారంభించారు. అధికారులు సర్వే చేసి 18,021 కుటుంబాలను గుర్తించారు. ఈ కుటుంబాలన్నింటికీ 10 లక్షలు మంజూరు చేసి, 10 వేలు దళిత సంక్షేమ నిధికి జమచేసి మిగతా 9.90 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు.
అయితే, లబ్ధిదారులు ఇచ్చిన కొటేషన్ ప్రకారంగా వారి వ్యాపార అవసరాలను బట్టి ఆర్థిక సహాయం అందిస్తూ వచ్చారు. కొందరికి పూర్తి స్థాయిలో మరి కొందరికి 5 లక్షలు, ఇంకొందరికి 2.50 లక్షలు ఇలా ఎవరి అవసరాలను బట్టి వారు తమ బ్యాంకు ఖాతాల నుంచి విడిపించుకునే వెసులుబాటును అప్పటి ప్రభుత్వం కల్పించింది. కొందరికి ఒకేసారి పూర్తి స్థాయిలో, మరి కొందరికి రెండు విడుతల్లో వారి అవసరాన్ని బట్టి ఇస్తూ వచ్చింది.
ఈ ప్రకారంగా గత అసెంబ్లీ ఎన్నికల వరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో 9,873 మందికి పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం అందింది. ఇంకా 8,148 మందికి వివిధ స్థాయిలో ఆర్థిక సహాయం అందాల్సి ఉన్నది. రెండో విడుత ఆర్థిక సహాయం అందించేందుకు అధికారులు అవసరమైన కసరత్తు చేస్తుండగానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఆగిపోయింది. ఆందోళన చెందిన దళితులు అధికారుల వద్దకు వెళ్లి ప్రశ్నించగా ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పారు. అదే విషయాన్ని నమ్మిన దళితులకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపుతున్నది.
బ్యాంకు ఖాతాలపై ఆంక్షలు
కేసీఆర్ ప్రభుత్వంలో అమలైన దళితబంధు పథకంపై ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని చూపుతున్నది. లబ్ధిదారుల ఖాతాల్లో జమైన డబ్బును విడిపించుకోకుండా బ్యాంకుల ఖాతాలపై ఫ్రీజింగ్ పెట్టింది. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో 6,868 మందికి సంబంధించిన 256.76 కోట్లు, హన్మకొండ జిల్లా పరిధిలోని కమలాపూర్‌లో 1,280 మందికి 14.83 కోట్లు, మొత్తం 8,148 మంది లబ్ధిదారులకు 271.60 కోట్లపై ఆంక్షలు విధించింది.
బ్యాంక్ ఖాతాల నుంచి నగదు విడిపించుకోకుండా ఫ్రీజింగ్ విధించింది. దీంతో దళితులైన లబ్ధిదారులు బ్యాంకులు, అధికారుల చుట్టూ నిత్య ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ రావాల్సిన రెండో విడుత దళితబంధు ఆర్థిక సహాయాన్ని అందించాలని వేడుకుంటున్నారు. అయినా, ఎవరూ పట్టించుకోవడం లేదు. దళితబంధు ఖాతాలపై ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించిందని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే గానీ తామేమీ చేయలేమని అధికారులు, బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు.
ఆందోళనలో దళితులు
దళితబంధు రెండో విడుత ఆర్థికసాయం అందుతుందన్న నమ్మకంతో చాలా దళితబిడ్డలు తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు మంది అప్పులు చేశారు. కానీ, ఎనిమిది నెలలుగా నగదు విడిపించుకునే అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని, దుకాణాల అద్దెలు, కరెంట్ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. మరో పక్క వ్యాపారాలు నడవక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అనేక సార్లు కరీంనగర్‌లోని కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణిలో విజ్ఞప్తులు చేశారు. నేరుగా కలెక్టరేట్ ఎదుట పలుమార్లు ధర్నాలు చేశారు. తమ చేతిలో ఏమీ లేదని, ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతుండగా, రాజకీయంగా ఒత్తిడి పెంచే లక్ష్యంతో లబ్ధిదారులు పలువురు మంత్రులను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. అయినా, ఫలితం కనిపించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండో విడుత ఆర్థిక సహాయం అందే వరకు నిత్యం పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
హుజూరాబాద్‌లో ధర్నా
హుజూరాబాద్, ఆగస్టు 1: ‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మేమంటే ఎందుకంత కక్ష. మా అకౌంట్లు ఎందుకు ఫ్రీజ్ చేసిన్రు. దళితబంధు రెండో విడుత డబ్బులు రాక, వ్యాపారాలు సాగక మా కుటుంబాలు ఆగమైతున్నయి. ఎప్పుడిస్తరో చెప్పాలి’ అని హుజూరాబాద్‌లో దళితబంధు లబ్ధిదారులు ఆందోళన చేశారు. దళితబంధు రెండో విడుత బాధిత సాధన సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా పెండింగ్‌లో ఉన్న రెండో విడుత డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తొలి విడుత వచ్చిన డబ్బులతో పలువురం వ్యాపారాలు పెట్టుకున్నామని, మిగతా డబ్బులు రాకపోవడంతో పెట్టుబడి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి డబ్బులు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్’, ‘దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోగా, పోలీసులు వచ్చి బలవంతంగా విరమింపజేసి, అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వదిలిపెట్టారు. ఇక్కడ దళితబంధు రెండో విడుత సాధన సమితి సభ్యులు కోలుగూరి సురేశ్, కోలుగూరి నరేశ్, అకినపల్లి ఆకాశ్, ఇనుగాల బిక్షపతి, కోడెపాక రక్షిత్, దాసారపు నాగరాజు, మందవేణు, రామంచ శ్రీకాంత్, పాత రాజేశ్, గాజుల కుమార్, మహంకాళి రమేశ్, విజయ్, సరిత, కుమార్ ఉన్నారు.
దళితులపై కక్షగట్టింది
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మా దళితులపై కక్షగట్టింది. మేం ఆర్థికంగా ఎదగడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేనట్టుంది. అందుకే రెండో విడుత ఇస్తలేదు. నేను మొదటి విడుత వచ్చిన రూ.5 లక్షలతో ఫొటో స్టూడియో పెట్టుకున్న. మిగతా డబ్బులు వస్తాయనే ఆశతో అప్పుతెచ్చి రూ.2 లక్షలతో కొత్త మోడల్ కెమెరా కొన్న. ఇప్పుడు అప్పు కడుదామంటే రెండో విడుత డబ్బులు రావడం లేదు. ఎట్ల కట్టాలో తెలియడం లేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే మా సమస్య పరిష్కరించాలి.
– కోలుగూరి నరేశ్, జమ్మికుంట
వెంటనే విడుదల చేయాలి
ఎన్నికలప్పుడు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు దళితులను మోసం చేస్తున్నది. దళితులను చిన్నచూపు చూస్తున్న రేవంత్‌రెడ్డికి మా ప్రతాపం చూపెడుతం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండో విడుత డబ్బులు వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తం.
– దాసారపు నాగరాజు, వీణవంక