సిరిసిల్ల టౌన్, ఆగస్టు 5: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరాకూ సాగునీరందిందని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడారు. కానీ, కాంగ్రెస్ పాలనలో పంటలకు సాగునీరందక రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన చెందారు. కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి నీళ్లిస్తే కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందన్న కారణంతోనే నీళ్లియ్యకుండా విషప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన ప్రజంటేషన్ను సిరిసిల్ల బీఆర్ఎస్ భవన్లో పార్టీ నాయకులతో కలిసి ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సాగునీటి కోసం తెలంగాణ ప్రజలు పడుతున్న గోసను చూసే కేసీఆర్ కాళేశ్వరం నిర్మాణానికి సంకల్పించారని గుర్తు చేశారు. అన్ని అనుమతులు తెచ్చి, అంతరాష్ట్ర వివాదాలు రాకుండా చేసి ప్రాజెక్టును నిర్మిస్తే కాంగ్రెస్ నాయకులు నానా యాగి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో నిర్మించిందే కాళేశ్వరం ప్రాజెక్టు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కమిషన్లు, కమిటీలు, నివేదికల పేరిట కేసీఆర్‌పై చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కాళేశ్వరంపై చేసిన ఆరోపణలనే నేడు ఘోష్ కమిషన్ నివేదికగా మార్చిందని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మొత్తం రిపోర్టును పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కమిషన్ రిపోర్టు ఫైనల్ కాదని, అవసరమైతే కోర్టుకు వెళ్తామని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, అర్బన్ బ్యాంకు వైస్ చైర్మన్ అడ్డగట్ల మురళి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, గజభీంకార్ రాజన్న, కుంబాల మల్లారెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.