కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడి గాడి తప్పుతున్నది. పాఠశాల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి అమ్మ ఆదర్శ పాఠశాలలని పేరు మార్చిన కాంగ్రెస్ సర్కారు.. కొత్తగా నిధులు సమకూర్చడం అటుంచితే ఉన్న నిధులను కూడా ఖర్చు చేయలేకపోతున్నది. దీంతో అమ్మ ఆదర్శ పాఠశాలలు అధ్వానంగా మారాయి. మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. అటు చాలాచోట్ల బోధనా పద్ధతులు కూడా సరిగ్గా లేక పిల్లలు చదువుల్లో వెనుకబడి పోతుండగా, సర్కారు తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 2022 మార్చిలో ‘మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి’ కార్యక్రమాన్ని దూరదృష్టితో ప్రారంభించింది. నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి అవసరమైన ఫర్నిచర్, పాఠశాల మొత్తానికి రంగులు వేయడం, మేజర్, మైనర్ రిపేర్లు చేసుకోవడం, గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రహరీలు, కిచెన్ షెడ్లు, శిథిలావస్థలో ఉన్న గదుల స్థానంలో కొత్త తరగతి గదులు, ఎక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు నిర్మించడం, డిజిటల్ విద్యను అమలు చేయడం వంటి 12 కాంపోనెంట్స్ తీసుకుని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనులు చేపట్టారు. ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంగా పనులు చేపట్టి, మూడేళ్లలో అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్యను అందించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం.
ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలిక వసతులు, మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోతున్నది. 2024లో ఈ కార్యక్రమం పేరును అమ్మ ఆదర్శ పాఠశాలలుగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం, మహిళా స్వశక్తి సంఘాలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. కానీ, ‘మన ఊరు – మన బడి’ కింద చేపట్టి అర్ధాంతంగా నిలిచిపోయిన పనుల్లో ఒక్కదానిని కూడా కొనసాగించడం లేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైనది డిజిటల్ విద్య. అందులో భాగంగా ప్రతి పాఠశాలకు కంప్యూటర్లు అందించి విద్యార్థులకు దృశ్య రూపకంలో బోధనలు జరిపే అవకాశం ఉంటుంది. పనులు పూర్తయిన కొన్ని పాఠశాలలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కంప్యూటర్లు అందించారు. అప్పటి ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే ఇప్పుడు మరి కొన్ని పాఠశాలలకు కంప్యూటర్లు అందుతున్నాయి. అయితే, ఇవి కొన్ని పాఠశాలలకే పరిమితం కావడంతో చాలా పాఠశాలల విద్యార్థులు డిజిటల్ విద్యకు దూరంగా ఉండాల్సి వస్తున్నది. అంతే కాకుండా, పాఠశాలల్లో అకాడమిక్ దిశగా ఎలాంటి మార్పులూ రాలేదు. పాఠాల బోధనకే పరిమితం కావాల్సిన ఉపాధ్యాయులతో ప్రస్తుత ప్రభుత్వం అనేక ఇతర పనులు చేయిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సరైన బోధనలు జరగక విద్యార్థులు నష్టపోతున్నారు. టీషాట్ ద్వారా జరిగే పాఠాల ద్వారా కూడా విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. పది పదిహేను పీరియడ్స్‌లో చెప్పాల్సిన పాఠాలను గంటా రెండు గంటల్లో పూర్తి చేస్తున్నట్టు తెలిసింది. పాఠాలు అర్థం కాక విద్యార్థులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. మొత్తానికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పూర్తిగా అస్తవ్యస్తంగా తయారయ్యాయని స్పష్టంగా తెలుస్తున్నది.

‘మన ఊరు – మనబడి’లో భాగంగా కరీంనగర్ జిల్లాలో మొత్తం 651 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా మొదటి దశలో 230 పాఠశాలలను తీసుకున్నారు. అందులో 120 ప్రాథమిక, 16 ప్రాథమికోన్నత, 94 ఉన్నత పాఠశాలకు 31 కోట్లు కేటాయించారు. 5 కోట్లతో 52 పాఠశాల్లో 2022-23 విద్యా సంవత్సరం నాటికే వివిధ పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత 30 పాఠశాలలను పైలెట్‌గా ఎంపిక చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమలవుతున్న తరుణంలోనే 2023లో ఎన్నికలు రావడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ కార్యక్రమానికి విఘాతం ఏర్పడింది. పైలెట్‌గా తీసుకున్న పాఠశాలలో ఏ ఒక్కచోట కూడా పనులు ముందుకు సాగడం లేదు. కొన్ని చోట్ల నిధులు ఉన్న వరకు పనులు పూర్తి చేసినా ఇంకా చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయి. వీటికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. మరి కొన్ని చోట్ల నిధులున్నా అందులో నుంచి నయాపైసా ఖర్చు చేయని పరిస్థితి కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన పనులు అర్ధాంతరంగా నిలిచి పోవడంతో కోట్ల నిధులు వృథా అయ్యే దుస్థితి దాపురించింది.
జగిత్యాల జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద 820 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో గత ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు – మన బడి’కి సంబంధించి తొలి దశలో 277 పాఠశాలలను ఎంపిక చేశారు. 148 ప్రాథమిక, 24 మాధ్యమిక, 105 ఉన్నత పాఠశాలలు ఇందులో ఉన్నాయి. వీటిల్లో వివిధ కాంపోనెట్ల కింద 1087 పనులు చేయాలని సంకల్పించారు. దీనికి 119 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కాగా, ఇందులో 275 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. 446 పనులు పూర్తి చేశారు. దాదాపు 70 కోట్లతో నిర్మాణాలు జరిగాయి. 20 కోట్ల వరకు నిధుల చెల్లింపులు జరిగాయి. అయితే, అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ‘మన ఊరు – మన బడి’ని నిలిపివేసింది. దీంతో 17 నెలలుగా నిధులు రావడం లేదు. ఇంకా 50 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. నిధులు రాకపోవడం, భవిష్యత్తులో వస్తాయన్న నమ్మకం లేకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్మాణాలు నిలిపేశారు. దీంతో దాదాపు 650 కాంపోనెట్ల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. పాఠశాలల్లో చిన్నారులు, ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడే దుస్థితి నెలకొన్నది. చాలా పాఠశాలల్లో తరగతి గదులు, మూత్రశాలలు లేవు. కాంపౌండ్ వాల్స్ లేవు. విద్యుదీకరణ జరగలేదు. ఆరుబయట చెట్ల కింద పాఠాలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘మన ఊరు – మన బడి’ లాంటి మంచి పథకాన్ని నిలిపేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.