కరీంనగర్ కార్పొరేషన్, మే 26: అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. పాలనలో పూర్తిగా విఫలమైందని, రేవంత్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి రగులుతున్నదని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ధ్వజమెత్తారు. కానీ, బీఆర్ఎస్కు రోజురోజుకూ మద్దతు పెరుగుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదులో కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని, పార్టీపై ప్రేమ ఉండి పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించి సభ్యత్వం అందించాలని సూచించారు. సభ్యత్వ నమోదుపై కరీంనగర్ జిల్లాకేంద్రంలోని శ్వేత హోటల్లో మంగళవారం కరీంనగర్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు. డిజిటల్ యాప్‌పై శిక్షణ తర్వాత సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. యువతను పార్టీలోకి ఎక్కువగా తీసుకురావాల్సినా అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో అసంతృప్తి రగులుతున్నదన్నారు. ధాన్యం కోనుగోలు చేయాలని మాట్లాడిన ఓ ఆర్డీసీ డ్రైవర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్‌పై 35 శాతం పన్నులు ఉన్నయి. ప్రజలపై పెట్రోల్ ధరల భారం తగ్గాలన్న ఆలోచన కాంగ్రెస్‌కు ఉంటే ఈ పన్నుల శాతం తగ్గించాలి. ధాన్యం సేకరణను పక్కదారి పట్టించాలనే ధరలపై కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నది. కేసీఆర్ హయాంలోఉన్న సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో అమలయ్యేవి. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ఏం పరిస్థితులు ఉన్నాయో..? అందరికీ తెలుసు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతుబంధు పేరుతో కేసీఆర్ ఎకరానికి రూ.10వేలు పెట్టుబడి సాయం అందించిండు. అధికారంలోకి వస్తే రూ.12 వేలు ఇస్తామన్న కాంగ్రెస్ అసలు పది వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు.
పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగే విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు బాధ్యత లేదా? ఇప్పుడు తాత్కాలికంగా ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌ను సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ ఉద్యోగిగా తీసుకుంటం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నాలుగుసార్లు గెలిచింది కేటీఆర్, గంగుల కమలాకర్ మాత్రమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రత్యక్షంగా ఓటరును కలుసుకొని పార్టీ విధానాలను వివరించి సభ్యత్వం తీసుకోవాలి.
– తాటిపర్తి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకుంటున్నది. కాంగ్రెస్ సర్కారు పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ సీఎం అవుతరు. గులాబీ బాస్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదులో కరీంనగర్ నియోజకవర్గాన్ని తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలపాలి. ఈ సారి సభ్యత్వ నమోదు డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నరు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా అన్ని గ్రామాల్లో ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రజలందరినీ సభ్యత్వ నమోదులో భాగస్వాములను చేసేందుకు కృషిచేయాలి.
– గంగుల కమలాకర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే