ఇల్లంతకుంట రూరల్, మే 21: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో 2వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగవుతున్నది. ఈ యేడాది అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా నీళ్లు విడుదల చేయడంతో పత్తికుంటపల్లి, కేశన్నపల్లి, జవారిపేట, గాలిపల్లి, తాళ్లపల్లి గ్రామాల రైతులు సాగు చేశారు. రెండు నెలల క్రితమే పంటను కోసి ఇల్లంతకుంటలోని ఏఎంసీ కొనుగోలు కేంద్రంలో కుప్పలుగా పోశారు. కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 2,883 క్వింటాళ్లే కొని చేతులెత్తేసింది. దీంతో నెల రోజుల నుంచి కాంటా నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడు కొంటుందో తెలియకపోవడం, ఎవరూ పట్టించుకోకపోవడంతో వారం క్రితం రైతులు రాస్తారోకో చేశారు. మార్క్‌ఫెడ్ డీఎం అబీబుల్లా రైతుల దగ్గరకు వచ్చి ‘ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. కొనుగోలు చేస్తాం’ అని హామీ ఇచ్చారే తప్ప ఇప్పటి వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు.
దీంతో ఇల్లంతకుంట కేంద్రంలో మరో 5వేల క్వింటాళ్ల పొద్దుతిరుగుడు గింజలను రైతులు బస్తాల్లో నింపి భద్రపరిచారు. ఇవిగాక కల్లాల్లో మరో 3వేల క్వింటాళ్ల గింజలు ఉన్నాయి. పంటమార్పిడి చేస్తే లాభపడతారన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నమ్మి సాగు చేస్తే, ఇప్పుడు తమ పొట్టపై కొట్టడం భావ్యమేనా..? అని రైతులు ఆగ్రహిస్తున్నారు. అయితే క్వింటాల్ మద్దతు ధర రూ.7700 ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు క్వింటాల్ రూ.5500 నుంచి రూ.6200కు తెగనమ్ముతున్నారు. ఒక్కో క్వింటాలుపై రూ.1500 నుంచి రూ.2200 వరకు నష్టపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇంత పగబడుతోందని అనుకోలేదని, గింజలు కుప్పపోసి రెండు నెలలు దగ్గరపడుతున్నా కొనడం లేదని, ఇలా అయితే ఆత్మహత్యలే శరణ్యమని కన్నీరు పెడుతున్నారు.
ఉమ్మడి జిల్లాతోపాటు సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి, చిన్నకోడూర్, కోహెడ మండలాల పొద్దుతిరుగుడు రైతులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను కలిసి గోడు వెల్లబోసుకోవడంతోపాటు సెక్రటేరియట్ ముట్టడికి రైతులు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వమే పంటమార్పిడి చేయమని చెప్పి, తీరా పంట చేతికొచ్చాక మొండిచేయి చూపడాన్ని తట్టుకోలేక తిరుగుబాటు చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం దిగొచ్చి పొద్దుతిరుగుడు గింజలు కొనేదాక కొట్లాడుతామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
నాకున్న ఏడెకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగు చేసిన. 55 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. నలభై ఐదు రోజుల క్రితం ఇల్లంతకుంటలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి పొద్దుతిరుగుడు గింజలు తెచ్చిన. చెత్తాచెదారం లేకుండా పట్టించి కుప్పపోసిన. కానీ, కొనెటోళ్లే లేరు. చూసీ చూసీ విసిగిపోయిన. ఏం చేయాలో తెలియక లాస్ అని తెలిసినా ప్రైవేట్ వ్యాపారికి క్వింటాల్‌కు రూ.6200 చొప్పున గురువారం అమ్మిన. పంట మార్పిడి చేయాలని చెప్పిన సర్కారు మాట నమ్మి, ఇప్పుడు అడ్డికిపావుసేరు అమ్ముకుని నష్టపోయినం. దీనికి బాధ్యులెవరు? వడ్లు కొనరు.. వాణిజ్య పంటలు కొనరు? రైతు ఏం చేయాలి? ఏ పంట వేయాలి? మీరే చెప్పాలి కదా?
– కొమ్మరెడ్డి కిశోర్‌రెడ్డి, రైతు, బాలనగర్ (వేములవాడ మండలం)
నాకున్న ఐదెకరాల భూమితో పాటు, మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని పొద్దుతిరుగుడు వేసిన. 70 క్వింటాళ్ల దిగుబడి వస్తే నెల రోజుల కింద ఇల్లంతకుంట మార్కెట్ యార్డులో కుప్పపోసిన. అయితే సెంటర్‌కు ప్రభుత్వం 2883 క్వింటాళ్లు మాత్రమే అలాట్మెంట్ చేసిందని, మిగతావి కొనేది లేదని అధికారులు అంటున్నరు. మేం పంట సాగు చేసినప్పుడే ఆన్లైన్ చేయించిన. నా పంట ఎందుకు కొనరు? ఇక్కడ కాదని దళారులకు అమ్ముకుంటే లక్ష వరకు నష్టం వస్తుంది. దీన్ని ఎట్ల భరించాలి? మేం ఎట్ల బతకాలి? ఏం చేయాలో తెలుస్తలేదు. వందలాది మంది కలిసి ఎర్రటి ఎండ ఆందోళన చేసినా పట్టించుకుంటలేరు. మా రైతులంటే సర్కారుకు ఇంత అలుసా?