కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు యూరియా కోసం రైతులు తల్లడిల్లుతుంటే.. మరోవైపు గ్రామాల్లో నీటి కోసం అల్లాడుతున్నారు. రోజుల కొద్దీ తాగునీరు రాక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాగునీరు మహాప్రభో అంటూ రోడ్డెక్కుతున్నారు.
ఇల్లంతకుంట, సెప్టెంబర్ 17: వారం నుంచి మిషన్ భగీరథ నీరు రాక తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని వంతడుపుల గ్రామపంచాయతీ పరిధిలోని నారెడ్డిపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వంతడుపుల గ్రామంలోని ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే వంతడుపుల మీదుగా నారెడ్డిపల్లికి, అక్కడి నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయమైందని, గ్రామానికి వచ్చే ఆర్టీసీ బస్సు, వాహనాలు బురదలో దిగబడుతున్నాయని వాపోయారు. ఎమ్మెల్యే తమ గ్రామాన్ని సందర్శించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
రాయికల్, సెప్టెంబర్ 17: ‘పైప్లైన్లు పగిలి పదిహేను రోజులైంది. బోర్లు, వ్యవసాయ బావుల నుంచి తాగునీరు తెచ్చుకునేందుకు గోసపడుతున్నం. ఇప్పటికైనా తాగునీళ్లు ఇప్పించండి’ అంటూ రాయికల్ మండలం వీరాపూర్ గ్రామ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులు, నాయకులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకు వచ్చి, సమస్యను పరిషరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.