పేదల సొంతింటి కల చెదురుతున్నది. పెరిగిన ధరలతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం భారంగా మారుతున్నది. ఇసుక, మొరం, సిమెంట్, కంకర, సలాక ఇలా ప్రతిదాని రేటూ అమాంతం పెరగడంతో నిర్మాణ వ్యయం తడిసిమోపెడవుతున్నది. సర్కారు ఇచ్చే 5లక్షలు ఏ మూలకూ సరిపోక ఇల్లు పూర్తి చేసేందుకు అరిగోస పడాల్సి వస్తున్నది.
కొందరు అప్పో సప్పో చేసి కడుతున్నా.. మరెంతో మంది మధ్యలోనే వదిలేయాల్సి వస్తున్నదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణంపై 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల అదనపు భారం పడుతున్నదని ఆవేదన చెందుతున్నారు. ఇల్లు వచ్చిందన్న సంబురం ఏమో గానీ, లేని అప్పుల పాలు కావాల్సి వస్తున్నదని వాపోతున్నారు. వెనువెంటనే బిల్లులు విడుదల చేయడంతోపాటు ధరలు నియంత్రించాలని వేడుకుంటున్నారు.
పెద్దపల్లి, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. నిర్మాణాలకు వినియోగించే మెటీరియల్ ధరలు భారీగా పెరగడంతో అదనపు భారం పడుతున్నది. గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభమైన తర్వాత నుంచి విపరీతంగా పెరిగిపోయాయి. మొరం, ఇసుక, కంకర, స్టీల్, ఇటుక, మార్బుల్ ఇలా ప్రతిదీ భగ్గుమంటున్నాయి. చాలా వరకు రెట్టింపుకంటే ఎక్కువే పెరిగాయి. ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ధరలు కూడా ఆకాశాన్నంటుత్నునాయి. రెండేళ్ల క్రితం ఒక ఇటుక ధర 5 నుంచి 6మధ్యలో ఉండగా, నేడు 9 నుంచి 12కు చేరింది. అలాగే ట్రాక్టర్ మొరం ధర గతంలో 1500 ఉండగా, నేడు 3వేలకు చేరింది.
ఇసుక ట్రాక్టర్ ధర 1400 నుంచి 1600 ఉండగా, నేడు 3వేలకుపైనే చేరింది. కంకర ట్రిప్పు ధర 1,800 నుంచి 2,400కి చేరింది. డస్ట్ ట్రిప్పు 1400 నుంచి 3500కి చేరింది. దీనికి తోడు మేస్త్రీలు, సుతార్లు, కూలీలు సైతం రేట్లు పెంచారు. ఇలా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ధరలతో ఇందిరమ్మ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇందిరమ్మ ఇల్లచ్చిందని సంబురపడి ముందరవడ్డందుకు అరిగోస పడుతున్నారు. సర్కారు ఇచ్చే 5లక్షలు ఏ మూలకూ సరిపోక.. అప్పులు తేలేక తండ్లాడుతున్నారు. బంగారం ఉన్నోళ్లు తనఖా పెట్టో.. అమ్మేసో వచ్చిన పైసలతో ఇండ్లను పూర్తి చేస్తుంటే.. ఏమీ లేనోళ్లు అప్పుల బాట పడుతున్నారు. బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడంతో ప్రైవేట్‌గా రెండు మూడు చొప్పున వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. అవీ పుట్టకుంటే నిర్మాణాలను మధ్యలోనే ఆపివేస్తున్నారు.
దీనికి తోడు సర్కారు సవాలక్ష కొర్రీలతో బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తుండగా.. లబ్ధిదారులు నిర్మాణాల కోసం తెచ్చిన అప్పుల వడ్డీలు పెరిగి ఆర్థికంగా చితికిపోతున్నారు. పెరిగిన ధరలతో ఒక్కో ఇంటిపై అదనంగా 2లక్షల నుంచి 3 లక్షల వరకు అదనపు భారం పడుతున్నదని వాపోతున్నారు. పాతిండ్లు కూల్చివేసి కొత్తిండ్లు ముందట పెట్టుకున్నామని, ఇవి ఆగిపోతే తాము ఎక్కడ ఉండాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెనువెంటనే బిల్లులు చెల్లించాలని, అలాగే ధరలను నియంత్రించి ఆదుకోవాలని, సబ్సిడీపై సిమెంట్, స్టీల్, ఇసుక ఇప్పించాలని వేడుకుంటున్నారు.