ఎల్లారెడ్డిపేట, మార్చి 15: కాంగ్రెస్ సర్కారు రైతులపై వివక్ష చూపతున్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిగిలిపోయిన సాగునీటి పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల రాయిని చెరువు ఆయకట్టు రైతులు ఆగ్రహించారు. మెట్ట ప్రాంత రైతుల కల నెరవేర్చేలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ కింద వీర్నపల్లి, కోనరావుపేట మండలాలకు నీరందించేందుకు చేపట్టిన పనులను పూర్తి చేయడం లేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా మద్దిమల్ల రాయిని చెరువుకు సంబంధించిన రెండు కిలోమీటర్ల పైప్‌లైన్‌ను కూడా చేయలేకపోతున్నదని ధ్వజమెత్తారు.
ఈ మేరకు కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ పనుల్లో భాగంగా మద్దిమల్ల రాయిని చెరువులో మిగిలిపోయిన పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల రాయిని చెరువులో నిరసన తెలిపారు. మెట్టప్రాంత రైతుల కోసం నాడు మంత్రి కేటీఆర్ చొరవతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి యజ్ఞం చేపట్టారని, మల్కపేట రిజర్వాయర్ ద్వారా నీరందించలేని ఎగువ ప్రాంతాలైన వీర్నపల్లి, కోనరావుపేట మండలాలకు సైతం నాలుగు లిఫ్టులతో నీటిని ఎత్తిపోయించేందుకు కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ కింద 166 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. అందులో భాగంగా అల్మాస్పూర్, శివంగాలపల్లి, మూలవాగు, హన్మాజీ చెరువులను, అలాగే వీర్నపల్లి మండలంలోని ఎనిమిది చెరువుల్లో నీళ్లు నింపేందుకు పనులు మొదలు పెట్టారని చెప్పారు.
అలాగే మద్దిమల్ల రాయిని చెరువును నింపి, కంచర్లలోని వెంకట్రాయని చెరువు, రేండ్ల కుంట, పోతరాయనికుంట, అల్మాస్పూర్ రంగం చెరువుల్లో నీళ్లు నింపేలా ప్రణాళికలు రూపొందించారని వివరించారు. 2023 ఫిబ్రవరిలో అల్మాస్పూర్ లిఫ్ట్ నుంచి రాయిని చెరువు నింపడానికి 15.716 కిలోమీటర్ల పొడవున పైప్‌లైన్ నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. అలాగే 375 మీటర్ల పొడవున కట్టను పునరుద్ధరించారని, మత్తడి మరమ్మతులు చేశారని, రెండు కొత్త తూములను నిర్మించారన్నారు. 13 కిలోమీటర్ల పైప్‌లైన్ పూర్తి చేశారని, అప్పుడు అటవీ శాఖ అనుమతుల కారణంగా మరో రెండు కిలోమీటర్లు ఆగిపోయిందన్నారు. తర్వాత ప్రభుత్వం మారిందని, రెండేండ్లయినా రెండు కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు పూర్తి చేయలేక పోయిందని మండిపడ్డారు.
15.716 కిలోమీటర్ల పైప్‌లైన్ పూర్తయితే 12 గ్రామాలకు నీళ్లందుతాయని, 13వేల ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు. రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పనులు పూర్తి చేసి, సాగునీరందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో సర్పంచులు ప్యాట్ల రవి, సామల్ల దేవరాజు, సుధాకర్, బట్టు కృష్ణ, గుగులోత్ రమేశ్, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, నాయకులు మల్లారపు అరుణ్, బోయిని రవి, గుగులోత్ సురేశ్, గుగులోత్ రవిలాల్, రఫీ, రైతులు పాల్గొన్నారు.
మల్కపేట కెనాల్ నుంచి సింగసముద్రం వరకు నీళ్లు వస్తున్నాయని, మా ప్రాంతానికి కూడా నీళ్లు కావాలని నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కోరినం. అప్పుడు ఆయన చొరవ తీసుకొని అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే 166 కోట్లు మంజూరు చేశారు. ఆయనకు రాయిని చెరువు ఆయకట్టు రైతులం ఎప్పటికీ రుణపడి ఉంటం. 9వ ప్యాకేజీ పనుల్లో 15 కిలోమీటర్లలో రెండు కిలోమీటర్ల పని మాత్రమే ఆగిపోయింది. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదు. పూర్తి చేసే వరకు ఉమ్మడి మద్దిమల్ల సర్పంచ్‌లు, వీర్నపల్లి, కంచర్ల సర్పంచులతో కలిసి పోరాటం చేస్తం. పైప్‌లైన్ పనులను చేసేంత వరకు పోరాడుతం.
-ఎండీ చాంద్‌పాషా, జడ్పీ కో-ఆప్షన్ మాజీ సభ్యుడు (మద్దిమల్ల)