విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తున్నది. పేద పిల్లలు చదివే సర్కారు బడులపై చిన్నచూపు చూస్తున్నది. పాఠశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నామని గొప్పలు చెప్పుకొనే ప్రభుత్వం, ప్రగతిపై నిర్లక్ష్యం చేస్తున్నది. విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించి, శిథిలమైన గదుల స్థానంలో కొత్తవి నిర్మించి ఆధునికంగా తీర్చిదిద్దాలని గత బీఆర్ఎస్ సర్కారు పల్లెల్లో ‘మన ఊరు.. మన బడి’, పట్టణాల్లో ‘మన ఊరు.. మన బస్తీ’ పథకాన్ని చేపట్టగా, అధికారంలోకి రాగానే నిలిపివేసింది. పలుచోట్ల పాత భవనాలు కూల్చడం, కొత్త నిర్మాణాలు ప్రారంభించడం, అంతలోనే నిధులను ఆపివేయడంతో ఎక్కడికక్కడే పనులకు బ్రేక్ పడింది. అందుకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐదు దశాబ్దాల చరిత కలిగిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరిస్థితే నిదర్శనంగా నిలుస్తుండగా, అక్కడి పిల్లలు, ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒకే గదిలో ఓ పక్క పది, మరో పక్క తొమ్మిదో తరగతి పిల్లలకు క్లాసులు చెప్పాల్సిన దుస్థితిరావడం పరిస్థితికి అద్దంపడుతున్నది.
జగిత్యాల జిల్లా కేంద్రంలో అతి పెద్ద బడుల్లో ఒకటి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ఏర్పాటైంది. సార్గమ్మ వీధిలో ఉండే ఈ విద్యాలయాన్ని దాదాపు నలభై ఏండ్ల క్రితం మినీస్టేడియం ముందున్న ఎస్కెఎన్ఆర్ డిగ్రీ కాలేజీ పూర్వ క్యాంపస్ పరిధిలోకి మార్చారు. ఆపై మరో రెండు అంతస్తుల్లో ఐదు తరగతి గదులు నిర్మించారు. స్కూల్లో దాదాపు 400 మంది విద్యార్థులు అభ్యసిస్తుండగా, 25 మంది ఉపాధ్యాయులు, ఒక హెచ్ఎం ఉన్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియాల్లో 13 తరగతులకు బోధన చేస్తున్నారు. ఆరు నుంచి పదో తరగతి దాకా తెలుగు, ఇంగ్లిష్, 8 నుంచి పదో తరగతి వరకు ఊర్ద్దూమీడియంలో బోధిస్తుండగా, ఉన్నంతలో సరైన వసతులతోనే పాఠశాల నడుస్తూ వచ్చింది. అయితే కాలేజీకి సంబంధించిన క్లాస్ రూమ్స్ అరవై ఏండ్ల క్రితం నిర్మించినవి కావడంతో అవి కొంత శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో ‘మన బస్తీ – మన బడి’ పథకంలో భాగంగా పది కొత్త తరగతి గదులను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. 2.33 కోట్లు మంజూరు చేశారు. నిర్మాణ పనుల బాధ్యతలను నీటిపారుదలశాఖ ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించగా, 2023 ఏప్రిల్ 13న పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. దీంతో పాత తరగతి గదులను కూల్చివేసి, కొత్త పనులను చకచకా చేపట్టారు. పిల్లర్లు వేసి, బేస్మెంట్ వరకు నిర్మించారు.
నిధులు మంజూరు కాకపోవడం, అంతలోనే 2023 అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ పథకాన్ని నిలిపివేసింది. దీంతో ఎక్కడిపనులు అక్కడే ఉండిపోగా, విద్యార్థులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పాత గదులను కూల్చివేయడంతో భవనంలో కేవలం ఆరు తరగతి గదులు మాత్రమే మిగిలాయి. అందులో ఒక తరగతి గదిని హెచ్ఎం, ఉపాధ్యాయులు స్టాఫ్ రూమ్‌గా వాడుకుంటున్నారు. మిగిలిన ఐదు గదుల్లోనే అన్ని తరగతులకు బోధన చేస్తున్నారు. దీంతో భవనం పై అంతస్తులో ఉన్న వరండాను, కింది భాగంలో ఉన్న వరండాలను సైతం తరగతి గదులుగా వినియోగిస్తున్నారు. విధి లేని పరిస్థితుల్లో శిథిలావస్థకు చేరిన ఒక పాత తరగతిగదిలో 6, 7 తరగతి విద్యార్థులను ఒకే గదిలో కూర్చొబెట్టి బోధన సాగిస్తున్నారు. ఇక ఉర్దూ మీడియానికి సంబంధించి 9వ తరగతి విద్యార్థులకు, 10 తరగతి విద్యార్థులకు ఒకే గదిలో బోధన చేస్తున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఒక మహిళ ఉపాధ్యాయురాలు, తన తల్లిదండ్రుల స్మారకార్థం పాఠశాలలో దాదాపు లక్ష వెచ్చించి షెడ్డు నిర్మించారు. ఆ షెడ్డులో ఇంగ్లిష్ మీడియం ఆరు, ఏడో తరగతులకు క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి దుస్థితి నెలకొనగా, ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి ఇటు వచ్చి చూసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఈ విషయమై విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మన ఊరు, మన బడి కింద నిధులు వస్తాయని అనుకుంటే దాన్ని సర్కార్ నిలిపివేయడం సరికాదంటున్నారు.
జగిత్యాల, జూలై 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు- మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ పథకాన్ని రేవంత్ సర్కార్ కక్షపూరితంగా నిలిపివేసింది. ఇదివరకే చేపట్టిన పనులకు సైతం నిధులను ఆపివేయగా, సర్కారు పాఠశాలలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నది. జగిత్యాల జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద 820 ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతుండగా, బీఆర్ఎస్ సర్కారు హయాంలో ‘మన ఊరు.. మన బడి పథకం కింద తొలి విడత 277 స్కూళ్లను ఎంపిక చేశారు. ఇందులో 148 ప్రాథమిక, 24 మాధ్యమిక, 105 ఉన్నత పాఠశాలలుండగా, వివిధ కాంపోనెట్ల కింద 1087 పనులు చేయాలని సంకల్పించారు. ఇందుకు 119 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ క్రమంలో 275 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. దాదాపు 70 కోట్లతో 446 పనులు చేపట్టగా, 20 కోట్ల దాకా చెల్లింపులు జరిగాయి. అంతలోనే ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ కొలువుదీరడంతో పథకాన్ని నిలిపివేసింది. ఇంకా 50 కోట్ల వరకు బకాయిలను చెల్లించాల్సి ఉండగా, 17 నెలలుగా ఒక్క రూపాయి ఇవ్వలేదు. నిధులు రాకపోవడం, భవిష్యత్తులో వస్తాయన్న నమ్మకం లేకపోవడంతో దాదాపు 650 కాంపోనెట్ల పనులను కాంట్రాక్టర్లు అర్ధంతరంగా నిలిపివేసి వెళ్లిపోయారు. దీంతో సదరు స్కూళ్లలోని చిన్నారులు, ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడే దుస్థితి నెలకొంది. చాలా పాఠశాలల్లో తరగతి గదులు, మూత్రశాలలు లేవు. కాంపౌండ్ వాల్స్ లేవు. విద్యుద్ధీకరణ జరగలేదు. ఆరుబయట చెట్ల కింద పాఠాలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఊరు.. మన బడి లాంటి మంచి పథకాన్ని నిలిపివేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఇది సారంగాపూర్ మండలం పెంబట్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. కేసీఆర్ సర్కార్ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పథకం తొలి విడుతలోనే ఈ స్కూల్‌ను ఎంపిక చేశారు. విద్యుద్దీకరణ కేటగిరీలో 25,560 వెచ్చించి పాఠశాలలోని అన్ని గదుల్లోను ఫ్యాన్లు, ట్యూబ్‌లు బిగించారు. తాగునీటి సౌకర్యం కోసం స్కూల్లో బోరు వేయించారు. నీటి ట్యాంకును నిర్మించి, నల్లాలు బిగించారు. ఇందుకు 19,498 వ్యయం చేశారు. ఇక మేజర్, మైనర్ రిపేరింగ్ కేటగిరీలో భాగంగా పాఠశాల తలుపులు, కిటికీలను రిపేర్ చేయించారు. టాయిలెట్స్ల్లో ఫ్లోరింగ్ చేయించి కొత్త బేసిన్లను ఏర్పాటు చేశారు. మూత్రశాలలు, మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించారు. ఇందుకు 1,26,052 లక్షలు వ్యయం చేశారు. మధ్యాహ్న భోజనం తయారీకి వంటగది లేకపోవడంతో 4.10 లక్షలతో నిర్మించారు. పాఠశాలకు రక్షణ లేకుండా పోవడంతో మరో 4.10లక్షలు వెచ్చించి చుట్టూ ప్రహరీ, గేట్ ఏర్పాటు చేశారు. 1.20 లక్షలు వెచ్చించి రంగులు వేయించారు. మొత్తంగా పెంబట్ల ప్రాథమిక పాఠశాలకు 11 లక్షలకు పైగా వెచ్చించి సకల సౌకర్యాల విద్యాలయంగా తీర్చిదిద్దారు. మొన్నటిదాకా కళావిహీనంగా కనిపించిన, పాఠశాల నేడు కొత్త శోభతో కనిపిస్తున్నది.