నేను మీ కల్పతరువు కాళేశ్వరాన్ని.. అపర భగీరథుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే పూర్తయిన ఎత్తిపోతల పథకాన్ని.. ఉమ్మడి రాష్ట్రంలో కరువుతో అల్లాడిన తెలంగాణను సుభిక్షంగా మార్చిన జీవధారను.. మేడిగడ్డ నుంచి ఎదురెక్కి.. కొండపోచమ్మ సాగర్ వరకు తరలి బీడు భూములను సస్యశ్యామలం చేసిన నాపై కాంగ్రెస్‌కు ఎందుకింత కక్ష? లక్షలాది ఎకరాలకు నీళ్లందించి, వేలాది చెరువులను మత్తళ్లు దుంకించి..
సాగునీటి రంగ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన నాపై ఎందుకింత వివక్ష? బువ్వపెట్టిన నాపై ఎందుకింత దుష్ర్పచారం? మళ్లీ పుష్కరకాలం కిందటి పరిస్థితుల్లోకి ఎందుకు నెట్టాల్సి వస్తున్నది? మేడిగడ్డ వద్ద పిల్లర్‌కు చిన్న మరమ్మతుతో రిపేరు చేసి అందుబాటులోకి తేవచ్చని ఎన్డీఎస్ఏ చెబుతున్నా ఎందుకు చోద్యం చూస్తున్నది? నిజానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే మేడిగడ్డను ఏనాడో బాగు చేసి నీళ్లు ఎత్తిపోసేది. కానీ, ఇదంతా కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రగానే కనిపిస్తున్నది.
కరీంనగర్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాకముందు అంటే.. పుష్కరకాలం కిందట ఈ ప్రాంతం కరువుతో అల్లాడేది. సాగు, తాగునీటికి తండ్లాడేది. వానకాలం దాటితే చాలు తీవ్రంగా గోసపడేది. తలాపున గోదావరి పారుతున్నా భూములకు చుక్కనీరు అందేదికాదు. తెలంగాణ గడ్డమీదుగా మొత్తం 653కిలోమీటర్లు పారి సముద్రం పాలవడమే తప్ప ఎవరికీ అక్కరకు రాకపోయేది. ఏటా వందల టీఎంసీల నీళ్లు వృథాగాపోయినా పాలకులకు ధ్యాస ఉండేదికాదు. చుక్కనీరు లేక భూములు బీళ్లుగా మారినా.. పంటలు పండక రైతులు గోసపడుతున్నా, చివరకు ఆత్యహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదు. సముద్రంలో కలిసి వృథా అవుతున్న గోదావరి జలాలను కనీసం ఉపయోగించుకోవాలన్న ఆలోచన చేయలేదు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అపర భగీరథుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కలిసివచ్చింది. ఉద్యమ సమయంలో ఇక్కడి గోసలను కండ్లారా చూసిన ఆయన, అధికారంలోకి రాగానే సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టిసారించడంతో జలగోస తీరింది. రైతుల బాధను దూరం చేయాలంటే తలాపున పారుతున్న గోదారమ్మను ఎదురెక్కించాలని ఆనాడే నిర్ణయించిన కేసీఆర్, వ్యాప్కోస్ నివేదికలు, సీడబ్ల్యూసీ సూచనల మేరకు తెలంగాణకు అత్యావశ్యకమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.
2016 మే 2న మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసి, మూడేళ్లలోనే పూర్తి చేయించారు. 2021 జూన్ 21న జాతికి అంకితం చేసి, సాగునీటి రంగంలో సరికొత్త శకాన్ని ఆవిష్కరించారు. ‘ప్రాజెక్టులు కట్టాలంటే దశాబ్దాలు కావాలి’ అన్న మాటలను పక్కనపెట్టి, చిత్తశుద్ధి ఉంటే ఏ ప్రాజెక్టునైనా సరే సకాలంలో పూర్తి చేయచ్చని నిరూపించారు. ఆ తర్వాతి నుంచి ఎత్తిపోతలు ప్రారంభించారు. దాంతో కడలి వైపు పరుగులు తీసే గోదావరి, అపర భగీరథుడు కేసీఆర్ ప్రయత్నంతో ఎగువకు ఎగబాకింది.
మేడిగడ్డ నుంచి ఊర్థముఖంగా ప్రయాణం మొదలుపెట్టి, బరాజ్‌లు, పంప్‌హౌస్‌లు, సొరంగాలు, కాలువలు దాటి 253కిలోమీటర్లు ఎదురెక్కి, 618మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ జలాశయానికి చేరింది. శ్రీ రాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయాన్ని వాటర్హబ్లా మార్చి తెలంగాణ బతుకును మార్చింది. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసింది. మండువేసవిలో చెరువులు మత్తళ్లు దుంకాయి. సబ్బండవర్గాలు సంతోషపడ్డాయి. రైతులు, మత్స్యకారులు, ఇంకా అనేకవర్గాల్లో వెలుగులు నిండాయి. ఏడాదిన్నర కిందటి వరకు ఇదంతా కండ్ల ముందటి దృశ్యమే అయినా కాంగ్రెస్ నేతలకు మాత్రం కనిపించలేదు.
నిజానికి ఒక ప్రాజెక్టు కట్టాలంటే దశాబ్దాలు గడిచిపోతాయి. ఒక్కోసారి శతాబ్దం కూడా పట్టవచ్చు. కానీ, ‘కాళేశ్వర ప్రాజెక్టు’ కేవలం మూడేళ్ల వ్యవధిలోనే పూర్తయింది. దేశానికే దిక్సూచిలా నిలిచింది. ప్రపంచ సాగునీటి రంగ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణను సస్యశ్యామలంగా మార్చింది. సిరిసిల్ల లాంటి మెట్ట ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగి ఐఏఎస్‌లకు పాఠ్యాంశంగా మారింది. ఇటు ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరద కాలువ కూడా జీవనదిలా మారింది.
ఇదంతా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో సాధ్యమైంది. అయినా ఆయనపై కక్షతో కల్పతరువు కాళేళ్వరంపై కాంగ్రెస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ వద్ద ఒక్క పిల్లర్ కుంగితే మొత్తం ప్రాజెక్టే అక్కెర రాదని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అదే నిజమైతే ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని ఎలా ఎత్తిపోశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగానే నిర్మించిన జలాశాయాలు, పంప్‌హౌస్ ద్వారానే కదా ఎత్తిపోసిందనే విషయాన్ని మరిచిపోయారు. కాళేశ్వరం నుంచి చుక్క నీటిని ఎత్తిపోయకుండా బాగా పంట పండిందని చెబుతున్నారు. కానీ, కాలం కరుణించింది కాబట్టే ఇవాళ్ల ఇంత పంట పండిందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. అసలు కరువు పరిస్థితులు తలెత్తినప్పుడే నీటిని ఎత్తిపోసుకోవాలన్నది కాళేశ్వరం లక్ష్యం కదా! దీనిని పూర్తిగా విస్మరించి మాట్లాడుతున్నారు.
కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే మేడిగడ్డను బూచిగా చూపుతున్నారు. ఆ మేడిగడ్డ పిల్లర్‌ను చిన్న మరమ్మతుతో మంచిగా వాడుకోవచ్చని డ్యాం భద్రతకు సంబంధించి దేశంలోనే అత్యున్నత సంస్థ ఎన్డీఎస్ చెబుతున్నా వినిపించుకోవడం లేదు. అలా కాకున్నా ప్రత్యామ్నాయ మార్గాలతోనూ ఎత్తిపోసుకోవచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నా లెక్క చేయడం లేదు. ఫలితంగా ఇయాల చాలా ప్రాజెక్టులు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఏడాది పొడవునా నీళ్లతో కళకళలాడిన శ్రీ రాజరాజేశ్వర జలాశయం ఇప్పుడు వెలవెలబోతున్నా పాలకులకు పట్టడంలేదు.
నాడు ఉమ్మడి రాష్ట్రంలో తీరుగానే నేడు స్వరాష్ట్రంలో సాగుతున్న వివక్షపై రైతులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు ఆది నుంచీ తమపై కక్ష సాధిస్తూనే ఉందని ఆగ్రహిస్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న ప్రజాదరణను ఓర్వలేక తమపై సాధిస్తున్నదని వాపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయని వాపోతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ప్రాజెక్టు మొదలు పెట్టినా ఏండ్లపాటు సాగిందని, కొన్ని కొసెల్లకుండానే పోయాయని, కానీ, కేసీఆర్ కృషితో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మూడేళ్ల స్వల్ప కాలంలోనే పూర్తయిందని కొనియాడారు. వానకాలం తర్వాత ఎప్పుడు చూసినా వాగును తలపించే గోదావరి కాళేశ్వరంతో నిండుకుండలా మారిందని, చరిత్రలో ఎవరూ ఊహించని విధంగా పల్లం నుంచి ఎదురెక్కిందని చెబుతున్నారు.
ఆయన సంకల్పబలంతోనే కాళేశ్వరం సాగునీటి రంగ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిందని, లక్షలాది ఎకరాలకు నీరందిందని, వేలాది చెరువులు నిండాయని గుర్తు చేశారు. కానీ, మేడిగడ్డలో కుంగిన పిల్లర్‌ను సాకుగా చూపి ఎండబెట్ట వద్దని, రాజకీయాలు చేయొద్దని హితవు పలుకుతున్నారు. పిల్లర్‌ను చిన్న మరమ్మతుతో వినియోగంలోకి తేవచ్చని, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎత్తిపోతలను ఉపయోగించుకోవచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. తమపై చిత్తశుద్ధి ఉంటే స్వార్థపూరిత రాజకీయాలు పక్కన పెట్టాలని హితవు పలుకుతున్నారు. ప్రపంచమే కీర్తించిన కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని సూచిస్తున్నారు.