మంథని, ఫిబ్రవరి 5: రాష్ట్రంలోని బీసీ వర్గాలను అవమానపర్చేలా కులగణన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. బీసీలకు స్థానికసంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని మోసం చేయడంతోపాటు బీసీల సంఖ్యను తగ్గించి అసెంబ్లీలో ఎలాంటి చట్టబద్ధత లేని కులగణన నివేదిక ప్రవేశపెట్టడంపై మండిపడ్డారు. బీసీ వర్గాలను అవమానిస్తూ అసెంబ్లీలో కులగణన రిపోర్ట్‌ను ప్రవేశపెట్టిన ఫిబ్రవరి 4ను చీకటి రోజుగా గుర్తించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం మంథని గాంధీచౌక్‌లో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడారు. దేశంలో ఏ ఉత్పత్తి జరగాలన్నా అది బీసీ వర్గాలతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అలాంటి బీసీలపై రేవంత్ సరారు నిర్ణయం సరికాదని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను ఎన్నికల మేనిఫెస్టోలో గొప్పగా చెప్పి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు జనాభా లెకలు చెప్పి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు.
బీసీలు, ఎస్సీల సంఖ్యను తక్కువగా చూపించి.. ఓసీల సంఖ్య పెంచి చూపించడం విడ్డూరంగా ఉందనన్నారు. ఈడబ్ల్యూసీలో ఓసీలకు సమాన హకులు రావడానికి రిజర్వేషన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారని ఆరోపించారు. బీసీల్లో చైతన్యం రాదనే అహంకారంతోనే సీఎం అసెంబ్లీలో రిపోర్ట్‌ను ప్రవేశపెట్టి బీసీ వర్గాలను అవమానించారన్నారు. ముఖ్యమంత్రి చేయించిన కులగణన సర్వే పత్రాలను కొన్ని ప్రాంతాల్లో బీసీ వర్గాలు చించిపడ వేశాయంటే బీసీల్లో చైతన్యం వచ్చిందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చదని, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మంథని ఎమ్మెల్యే తయారు చేసిన మేనిఫెస్టో దేశానికి మచ్చగా మారిందన్నారు. మంథని ఎమ్మెల్యే నాయకత్వంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యంతోపాటు తాజాగా కులగణన కూడా ఖూనీ అయిందని విమర్శించారు. హడావుడిగా ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతోనే సీఎం అసెంబ్లీలో కులాల గురించి చర్చ పెట్టి వెళ్లిపోయాడన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేను కూడా వెబ్సైట్ నుంచి తొలగించారన్నారు. రాహుల్‌గాంధీ ఎన్ని రాజ్యాంగం పుస్తకాలు పట్టుకొని తిరిగినా కాంగ్రెస్ పార్టీని ఈ సమాజం నమ్మదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, ఆరెపల్లి కుమార్, మాచిడి రాజుగౌడ్, కాయితి సమ్మయ్య, శంకెసి రవీందర్, ఆకుల రాజబాపు పాల్గొన్నారు.