అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నవి. ఇన్నాళ్లూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రాజెక్టుపై అర్థం, పర్థం లేని ఆరోపణలు చేస్తూ.. పబ్బం గడుపు కొంటున్న ఆ పార్టీ నాయకులకు సుప్రీంకోర్టు చెంప చెల్లుమనిపించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అంటూ గొప్పతనాన్ని, రాష్ట్రంలో మారిన సాగు ముఖచిత్రాన్ని వివరించి చెప్పిన నేపథ్యంలో.. పలువురు నేతల్లో అంతర్మథనం మొదలైంది.
గత ఎన్నికల సమయంలో ప్రాజెక్టుపై విషం చిమ్మి విజయం సాధించడమే కాదు, నేటికీ అదే పంథాను అనుసరిస్తున్న ఆ పార్టీ.. ప్రస్తుతం ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఎత్తిపోతల పథకం ప్రాధాన్యతను సర్కారు గుర్తించాలని నిపుణులు సూచిస్తుండగా, ఇప్పటికైనా కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, ప్రాజెక్టును వినియోగంలోకి తెచ్చి రైతాంగానికి అండగా నిలువాలన్న డిమాండ్ వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 మే 2న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. కేవలం మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రాజెక్టు పనులను పూర్తి చేసి, 2019 జూన్ 21న జాతికి అంకితం చేశారు. సాగునీటిరంగ చరిత్రలో ఇదో రికార్డు! నిజానికి గత పాలనలో ఏదైనా ఒక ప్రాజెక్టు పనులకు ఒకరు శంకుస్థాపన చేస్తే.. అది ఏండ్ల పాటు కొనసాగేది. ప్రభుత్వాలు మారి ఆ ప్రాజెక్టును మరొకరు ప్రారంభించే పరిస్థితి ఉండేది. కానీ, కాళేశ్వరం విషయంలో మాత్రం అలా జరుగలేదు. వాస్తవానికి కేసీఆర్ ఈ ప్రాజెక్టును ఆషామాషీగా చేపట్టలేదు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికే సాగునీటి రంగాన్ని ఔపోసన పట్టిన ఆయన, రైతాంగాన్ని ఆదుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు ఎంతో కసరత్తు చేసినట్టు అనేక ఆధారాలు చెబుతున్నాయి. నిజానికి 1,465 కిలోమీటర్ల పొడువున్న గోదావరి.. తెలంగాణలో సుమారు 750 కిలోమీటర్ల ప్రవహిస్తుంది. ఇటు గోదావరి, అటు కృష్ట రెండు నదుల మెజార్టీ పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే ఉన్నా.. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇక్కడి ప్రాజెక్టులకు అన్యాయమే జరిగింది. తెలంగాణ బేసిన్ల నుంచి నీటిని కోస్తాంధ్రకు మళ్లించి, అక్కడ రెండు పంటలకు నీరిచ్చి ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేశారు.
ఈ పరిస్థితుల్లో గోదావరి, కృష్ణా నదుల్లోని నికర, మిగులు జలాలను సమర్థవంతంగా వినియోగించుకొని కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఆనాటి తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది. అందుకోసమే నూత జల విధానం (రీడిజైనింగ్)కు శ్రీకారం చుట్టింది. ఈ స్వప్నంలో మొదటి భాగం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం! గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఆధారంగా విశ్వసనీయత కలిగిన నికర జలాల కేటాయింపులు 1,489 టీఎంసీలుంటాయని లెక్క గట్టి.. అందులో 954 టీఎంసీలను తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపులు కాగితాలకే పరిమితం కాగా, వాస్తవ వినియోగం ఏనాడూ 400 టీఎంసీలకు మించి లేదు. ఈ విషయాలను అధ్యయనం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, గోదావరి జలాల గరిష్ఠ వినియోగం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే సాధ్యం అవుతుందని భావించి ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.
నాటి సమైక్య ప్రభుత్వాలు ఆదిలాబాద్ జిల్లా తుమ్డిహట్టి వద్ద ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అందులో కుట్ర దాగి ఉందని ఉద్యమ నాయకుడిగా ఉన్న సమయం నుంచి వాదిస్తూ వచ్చిన కేసీఆర్.. స్వరాష్ట్రం వచ్చాక అందులోని లోటుపాట్లపై ఆరా తీశారు. లోపాలను బహిర్గతం చేశారు. అంతేకాదు, ఈ ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న కుట్రను అసెంబ్లీ సాక్షిగా గణాంకాలతో సహా కళ్లకు కట్టినట్టు వివరించారు. మేడిగడ్డ, తుమ్డిహట్టి వద్ద 47 ఏళ్ల నీటి లెక్కలను ఆధారంగా చేసుకొని, ఆ వాస్తవాలను శాసనసభ ముందు పెట్టారు.
తుమ్డిహట్టి నీటి లభ్యత తక్కువగా ఉందని చెప్పడంతోపాటు ప్రాణహిత కలిసిన తదుపరి కాళేశ్వరం వద్ద 1,651 టీఎంసీల లభ్యత ఉందని, అలాగే గోదావరిలో ఇంద్రావతి కలిసే పేరూర్ వద్ద సరాసరి 2,430 టీఎంసీల లభ్యత ఉందని శాసనసభా సాక్షిగా వివరించారు. గోదావరిలో ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాకుల గూడెం ప్రాజెక్టు చేపడుతామని, మేడిగడ్డ వద్ద భవిష్యత్‌లో ఎప్పుడైనా కొరత ఏర్పడినా ఇంద్రావతి నీటిని తీసుకునే అవకాశం ఉందటుందని, భవిష్యత్ అవసరాలకు ఇంద్రావతి, ప్రాణహిత నీళ్లే ఆధారమంటూ వివరించిన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి.. అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని ఎగువకు మళ్లించారు.
రాష్ట్ర సాగునీటి రంగ ముఖచిత్రాన్నే మార్చివేసిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసింది. మేడిగడ్డ వద్ద జరిగిన చిన్న సంఘటనను పెద్దదిగా చూపుతూ అబద్ధాలు ప్రచారం చేసి ఎన్నికల్లో విజయం సాధించిన ఆ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తదుపరి కూడా అదే పంథాను అనుసరిస్తున్నది. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతకు అద్దం పడుతున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విచారణ సందర్భంగా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ చేసిన వ్యాఖ్యలు కాళేశ్వరం గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ‘తెలంగాణలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేశారు. దీనివల్ల కొన్ని వేల ఎకరాల్లో సాగు జరుగుతున్నది. తెలంగాణ వరి సాగులో ఎంతో పురోభివృద్ధి సాధించింది’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్ కాగా, కాంగ్రెస్ నాయకులను మాత్రం అంతర్మమథనంలో పడేశాయి.
నిజానికి ప్రాజెక్టు జాతికి అంకితం చేసిన 2019-20లోనే 61.66 టీఎంసీల నీటిని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తిపోసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే.. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా సుమారు 190 టీంఎసీలకు పైగా ఎత్తిపోశారు. దాని ఫలితంగానే రాష్ట్రంలో సాగునీటి ముఖచిత్రం మారింది. ఈ నేపథ్యంలో ఇకనైనా విమర్శలు మానుకొని, మేడిగడ్డకు పూర్వవైభవం తెచ్చి ప్రాజెక్టును రైతులకు అందుబాటులోకి తేవాలన్న డిమాండ్ రైతుల నుంచి వస్తున్నది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత కొంతమంది కాంగ్రెస్ నాయకుల్లో అంతర్మథనం కనిపిస్తున్నా.. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయాలు ప్రస్తుతం ఆ పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సర్కారు పరిగణలోకి తీసుకోవాలి. రాజకీయ ప్రయోజనాలకన్నా రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా చేసుకొని ప్రాజెక్టును వెంటనే పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టాలి. విమర్శలు, నోటీసుల వంటివి మానుకొని ప్రపంచ గుర్తింపు పొందిన ప్రాజెక్టుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నిజానికి కాళేశ్వరం నీళ్లతో సిరిసిల్ల, వేములవాడ లాంటి మెట్టప్రాంతాలు సస్యశామలం అయ్యా యి.
ఇప్పుడు కాళేశ్వరం జలాలు రాకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. సాగుభూములు బీడుగా మారుతున్నాయి. మళ్లీ సమైక్య కాలం నాటి పరిస్థితులు రాక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ నుంచి ఎగువ ప్రాంతానికి నీటిని ఎత్తిపోసే కార్యక్రమం చేపట్టాలి. రైతులకు అండగా నిలువాలి. నోటీసులు, విమర్శలను ఇటు రాజకీయ పరంగా, అటు చట్టపరంగా ఎదుర్కొనే సత్తా సామర్థ్యం బీఆర్ఎస్కు ఉన్నాయి. అయితే మా పార్టీ తపన, పోరాటం అంతా కాళేశ్వరానికి పూర్వవైభం తెచ్చి.. రైతులకు అండగా నిలువడమే. అందుకోసం ఏ పోరాటానికైనా సిద్ధమే.