అండగా బీఆర్ఎస్
సమైక్య రాష్ట్రంలో 58 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ రైతన్నను దగా చేశాయి. వ్యవసాయం కుదేలైనా.. రైతన్న అప్పులపాలై ఆత్మహత్యల బాటపట్టినా చోద్యం చూశాయి. అందులో హస్తం పార్టీ అయితే ఏకంగా అన్నదాతల జీవితాలతో చెలగాటమాడింది.
- స్వరాష్ట్రంలో బాసటగా ముఖ్యమంత్రి కేసీఆర్
- 24గంటల కరెంట్, సాగునీటితో పండుగలా ఎవుసం
- రైతుబంధుతో తొలిగిన పెట్టుబడి ఇబ్బందులు
- నాడు చనిపోతే 1.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికే ముప్పుతిప్పులు
- నేడు ఇంటికే వస్తున్న 5 లక్షల బీమా
- జీర్ణించుకోలేకపోతున్న హస్తం పార్టీ
- నాటి నుంచి నేటి వరకు అన్నదాతలపై అక్కసు
- సమైక్య రాష్ట్రంలో కరెంటు, సాగునీరు ఇవ్వలేక చేతులెత్తేసిన దుస్థితి
- వేలాది మంది ఆత్మహత్యలకు కారణం
- తాజాగా ఎన్నికల వేళ రైతులపై మళ్లీ కుట్రలు
- ఫిర్యాదులతో బయపడుతున్న కుటిలబుద్ధి
- భగ్గుమంటున్న రైతులు
సమైక్య రాష్ట్రంలో 58 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ రైతన్నను దగా చేశాయి. వ్యవసాయం కుదేలైనా.. రైతన్న అప్పులపాలై ఆత్మహత్యల బాటపట్టినా చోద్యం చూశాయి. అందులో హస్తం పార్టీ అయితే ఏకంగా అన్నదాతల జీవితాలతో చెలగాటమాడింది. 49 ఏండ్ల పాటు పాలించినా కనీస భరోసా ఇవ్వలేకపోయింది. నాడే కాదు, నేడు కూడా అదే తీరుతో ముందుకెళ్తున్నది. ఎన్నికల వేళ రైతుల ప్రయోజనాలకు అడ్డుపుల్లలు వేస్తూ, రైతు వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుంటున్నది.
కొద్దిరోజుల క్రితం 24 గంటల కరెంటు ఇవ్వడం వృథా.. మూడు గంటలే సరిపోతుందంటూ స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేంవత్‌రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై అన్నదాత కోపాగ్ని చల్లారక ముందే.. అదే పార్టీ మరో కుట్రకు తెరలేపింది.
రైతుబంధును ఆపాలని ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే లేఖ రాసి, హస్తం పార్టీ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. రెండు రోజులుగా రైతుల్లో ఆగ్రహం పెల్లుబికుతుండగా, ఇదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ‘రైతుబంధు దుబారా ఖర్చు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒకరి తర్వాత మరొకరు కాంగ్రెస్ అసలు రంగును బయటపెడుతుండగా, కర్షకలోకం భగ్గుమంటున్నది. నాడు ఎకరమన్నా పారిందా..? నాది జవహర్ నాయక్ తండా. నాకు నాలుగెకరాల భూమి ఉన్నది. ఏండ్ల సంది మా తాతలు, తండ్రులు సాగు చేసిన భూమిని ఇపుడు నేను చేసుకుంటున్న. వరి ఏసిన.
పదేండ్ల కింద ఎవుసం అంటే ఆ బాధలు చెప్పరాదు. కాలం కాక, కరెంటు లేక, నీళ్లు లేక గోసగోసయింది. తండాలో ఉన్న మాకు ఎవుసం మీదనే బతుకాయే. వచ్చిరాని కరెంటు, నీళ్లు లేని బోర్లతో ఏసిన ఎకరం పొలం మడి పారలేదు. అద్ద ఎకరంలో వచ్చిన పంటకు గిట్టుబాటు రాలే. అన్ని అప్పులే. దిక్కులేక గీయవుసం జేసుకుంటూ తండ్లాడినం. అయినా అప్పటి కాంగ్రెసోళ్లు పట్టించుకోలె. కానీ, తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సారు రైతుబిడ్డ కాబట్టే మా బాధలు అర్థం చేసుకున్నడు. పెట్టుబడి కోసం బాకీలు చేసే బాధ లేకుండా రైతుబంధు ఇచ్చిండు. కాలం మంచిగైతంది. ఉన్న నాలుగెకరాలు సాగు చేసిన. దిగుబడి మంచిగచ్చింది. మొన్ననే మిషన్ తెచ్చి వరి కోసినం. అమ్మేందుకు మార్కెట్ కమిటీకి తీసుకుని పోవాలని తాలు తీత్తున్న. కేసీఆర్ ఉండవట్టే మాలాంటి రైతులకు మేలు జరుగుతుంది. మా ఊరికి కాలువొత్తదని చెప్పిన్రు. మల్కపేట ప్రాజెక్టు నుంచి నర్మాల దాక కాలువు తవ్విన్రు. మున్ముందు మాకు సాగునీటి గోసుండదు. నీల్లు ఫుల్ ఉంటయ్. కరెంటుకు ఢోకా ఉండదు. ఇంత మంచిగా చేస్తున్న కేసీఆర్ సార్ మల్ల రాకుంటే మా రైతులకు ఉరే. మళ్లీ కాంగ్రోసోళ్లను నమ్మి మోసపోవద్దు.

– భూక్య గంగదాస్, జవహర్ నాయక్ తండా (వీర్నపల్లి)
వాళ్లకు చేతగాదు చేసేటోళ్లకు అడ్డంపడతరు..
నాది మంథని మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామం. నాకు ఐదెకరాల ఎవుసం భూమి ఉన్నది. తెలంగాణ రాకముందు మా ఊరికి కాల్వనీళ్లు వచ్చేవి కాదు. మూడెకరాల్ల పొలం నాటేస్తే సక్కగా పండక పోయేది. కాంగ్రెసోళ్లు అధికారంల ఉన్నప్పుడు రైతుల కోసం చేసిందేమీలేదు. నీళ్లు, కరెంట్ సరిగా ఇయ్యలేదు. నకిలీ విత్తనాలు, ఎరువులతో నిండా మునిగేది. కానీ కేసీఆర్ సారు సీఎం అయినంక రైతుల కోసం అంతా మంచిగ జేత్తున్నడు. ఏటా రెండుసార్లు రైతుబంధు ఇస్తున్నడు. ఎరువులు, విత్తనాలు టైంకు అందుబాటులో ఉంచుతున్నడు. రైతులకు మంచి జరిగితే కాంగ్రెసోళ్ల కండ్లు మండుతున్నవి. అందుకే రైతుబంధు ఇవ్వద్దని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన్రు. రైతులకు మంచిజేసుడు వాళ్లకు చేతకాదు. చేసేవాళ్లకు అడ్డంపడతరు. అందుకే వచ్చే ఎన్నికల్ల వారికి తగిన గుణపాఠం చెబుతం.
– శీలం విష్ణువర్ధన్‌రెడ్డి, ఎక్లాస్పూర్ గ్రామం (మంథని మండలం)
కరీంనగర్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సమైక్య రాష్ర్టాన్ని 58 ఏళ్లు కాంగ్రెస్, టీడీపీలు పాలించాయి. ఇందులో టీడీపీ తొమ్మిదేళ్లు ఉంటే.. కాంగ్రెస్ 49 ఏండ్ల పాటు అధికారంలో ఉంది. దశాబ్దాల పాటు పాలించిన తెలంగాణ అన్నదాతల కష్టాలు, కన్నీళ్లను దూరం చేయకపోగా.. వారి భవిష్యత్, సంక్షేమం కోసం ఏనాడూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రాజెక్టులు మొదలు పెట్టినా.. దశాబ్ధాలు గడిచినా వాటిని పూర్తి చేయలేదు. దీనికి నిలువెత్తు నిదర్శనం నాటి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతోపాటు వదరకాలువ కూడా ఒక సజీవ సాక్ష్యమే.
ఉత్తర తెలంగాణలో 14 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన శ్రీరాంసాగర్ సమైక్య రాష్ట్రంలో ఏనాడూ నాలుగు నుంచి ఆరు లక్షల ఎకరాలకు మించి నీరు ఇవ్వలేని దుస్థితి ఉండేది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాగుకోసం అల్లాడింది. నీళ్లులేక.. బోర్లు పడక రూ.లక్షల్లో అప్పుల పాలై అన్నదాతలు అష్టకష్టాలు పడ్డారు. కరెంటు విషయానికి వస్తే.. అత్యధికంగా మోటర్లపై ఆధారపడిన జిల్లాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉండేది. కానీ, ఏనాడూ నాలుగైదు గంటలకు మించి ఉండేది కాదు. అది కూడా.. రావడం.. పోవడం తప్ప. కంటిన్యూగా ఉండేది కాదు. ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెలియని దుస్థితి ఉండేది. ఇవేకాదు అన్నదాతను ఆదుకోవడానికి ఆనాటి పార్టీలు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలనూ అమలు చేయలేదు. విత్తనాల నుంచి మొదలు ధాన్యం విక్రయం వరకు.. అష్టకష్టాలు పెట్టి అన్నదాతల ఆత్మహత్యలకు ఆనాటి పార్టీలు కారణమయ్యాయి. కానీ, స్వరాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే.. రైతాంగ సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. నాటికీ.. నేటికి అన్నదాతల విషయంలో నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దీనికి నిలువెత్తు నిదర్శనాలు ఇవే.
ఆగంచేసిన హస్తం పార్టీ

ఇంతకు ముందు ఐదు దశాబ్ధాలు పాలించిన కాంగ్రెస్ తెలంగాణ రైతాంగాన్ని పట్టించుకోలేదు. ప్రాజెక్టుల పేరుతో కాలయాపన చేయడం తప్ప.. పకడ్బందీగా ఏ పనులూ చేయలేదు.
కరెంటు కోతలతో ఆనాడు రైతాంగం అల్లాడింది. కటిక చీకటిలో మోటర్ల వద్దకు వెళ్లిన ఎంతో మంది రైతులు పాముకాటుకు గురై చనిపోయారు. కనీసం ఆనాడు నాలుగైదు గంటలు కూడా కరెంటు రాలేని దుస్థితి
సమైక్యరాష్ట్రంలో అత్యధికంగా మోటర్లపై ఆధారపడిన జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్ ప్రథమ స్థానంలో ఉండేది. లో వోల్టేజీ వల్ల.. పసలుకు మూడు నాలుగు సార్లు మోటర్లు కాలిపోయి అన్నదాతలపై ఆర్థిక భారం పడి
అవస్థలు పడ్డారు.
ఉమ్మడి జిల్లాలో మూడు పంటలు పండించే బంగారు భూములున్నా.. నీరు లేక 3.38 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేది. అది కూడా పంట చేతికి వచ్చే వరకు నమ్మకం లేకపోయేది.
ఆనాడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం 13.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే దిగుబడి వచ్చేది.
2014 వరకు ఉమ్మడి జిల్లాలో కేవలం 66 మంది మాత్రమే వ్యవసాయ విస్తరణ అధికారులుండేవారు. వారి సూచనలు, సలహాలు రైతులకు అందేవి కావు. కనీసం వారు ఒక చోట సమూహం కావడానికి ప్రభుత్వం ఏ
చర్యలూ తీసుకోలేదు.
- కరెంటు లేక, సాగునీరు అందక, కుంటలు చెరువుల బాగుచేసే వారు లేక.. భూములన్నా.. వాటిని కాదని బతుకుదెరువుకోసం దుబాయి వెళ్లిన సంఖ్య ఆనాడు ఉమ్మడి జిల్లాలో అధికంగా ఉండేది. ఆనాడు 4.57 లక్షల మంది మాత్రమే వ్యవసాయం చేసినట్లుగా రికార్డులు వెల్లడి చేస్తున్నాయి.
- బతుకులు ఆగమై వేలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నా కాంగ్రెస్ స్పందించేది కాదు. చివరకు ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి పెరగడంతో 2004 జూన్1 న 421 జీవోను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ జీవో ప్రకారం రైతు కుటుంబానికి రూ.1.50 లక్షలు మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అందులోనూ రూ.లక్ష కుటుంబ సభ్యులపై డిపాజిట్ చేయడం, మిగతా రూ.50 వేలు అప్పులు చెల్లించేందుకు వెసులు బాటు కల్పించింది. దీనికి మండల, డివిజన్ స్థాయిలో త్రిసభ్య కమిటీ వేయడం, వారు ధ్రువీకరిస్తే తప్ప ఎక్స్‌గ్రేషియా వచ్చేది కాదు. దీంతో కాలయాపన తప్ప.. న్యాయం జరిగిన సందర్భాలు చాలా తక్కువ.
- అన్నదాతను ఆదుకునేందుకు ఏనాడూ పెట్టుబడి సహాయం చేయలేదు. కనీసం ఆ దిశగా ఆలోచన చేయలేదు. ఇప్పుడు మాత్రం తాము అధికారంలో వస్తే ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ హామీలు గుప్పిస్తున్నారు.
- రైతులకు మూడు గంటల కరెంటు చాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, రైతుబంధు ఆపాలని మాణిక్‌రావు ఠాక్రే, రైతు బంధు కింద ఇస్తున్న పెట్టుబడిసాయం దుబారా ఖర్చు అంటూ ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెపుతున్న తీరు ఆ పార్టీకి రైతులపై ఉన్న ప్రేమను తెలుపుతోంది.
కాంగ్రెస్ అత్తే యాభై ఏండ్లు ఎనక్కి పోతం
మాది హరిదాస్‌నగర్. నాకు ఆరెకరాల పొలం ఉన్నది. కాంగ్రెస్ పాలనలో అంతా కరువే ఉండె. కాలం కాక బోర్లమీదనే ఎవుసం జేసినం. బోర్లు ఏసిఏసి దమ్ముకొచ్చింది. ఎనిమిది బోర్లు ఏత్తే అండ్ల ఒక్క బోర్ల నీళ్లచ్చినయ్. అప్పులు చేసి బోర్లు ఏసినా నీళ్లచ్చిన సంతోషమే లేదు. సక్కగ రాని కరెంటుతోటి రామగోసయ్యింది. కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌లో 39వేలు పెట్టి జనరేటర్ కొన్న. డుక్కుడుక్కని నడిత్తే అడ్డగోలు డిజిల్ తాగుతుండె. అచ్చిన పంట పైసల్లో సగం డిజిల్‌కే పోయినయి. పేరుకే ఆరెకరాలు కానీ మూడెకరాలే సాగు చేసేది. మడి పారక మూడెకరాలు ఇడిచిపెట్టిన. అచ్చిన పంట అమ్మితే అప్పలకే పాయె. మళ్ల పంటకు చేయిచాపుడే అయితుండె.
పంట వచ్చిన సంబురమే ఉండకపోతుండె. నాడు పంట అమ్మితే 40వేలు అత్తుండె. ఇయ్యాల 3.40లక్షలు అచ్చినయి. పుష్కలంగా నీళ్లున్నయి. వద్దన్నా మస్తు కరెంటు ఉంటంది. పంట పెట్టుబడికి రైతుబంధు కింద ఎకరానికి పది వేల చొప్పున వస్తున్నయి. లాగోడికి తిప్పలు లేదు. కాలం కూడ కలిసొచ్చింది. పంటలు బాగా పండుతున్నయి. ఎరువులు, విత్తనాలు అన్ని సౌలతులు చేసిండు. అనుభవమున్న కేసీఆర్ సారు చెయ్యవట్టి ఎవుసం మంచిగా నడుత్తంది. ఇంత మంచిగ ఉంటే కాంగ్రెసోళ్లు ఇప్పుడచ్చి మాయమాటలు చెబుతన్రు. వాళ్ల మాటలు నమ్మితే మళ్లీ గోసపడుతం. కాంగ్రెస్ అత్తే యాభై ఏండ్లు ఎనక్కి పోతం.
– మానుక మల్లయ్య, రైతు, హరిదాస్‌నగర్ (ఎల్లారెడ్డిపేట మండలం)
కేసీఆర్ సార్ వచ్చినంకనే నీళ్లు వచ్చినయి
మాది హరిదాస్‌నగర్. నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పద్దెనిమిదేండ్ల ఏండ్ల కిత్రం ఇక్కడ పొలాలకు నీళ్లు లేక బీడు వడ్డయి. పెండ్లి అయినాక కుటుంబాన్ని వెల్లదీయలంటే పొలం చేసేతందుకు నీళ్లు లేవు. ఏం చేయాలో తోచలేదు. అప్పుడు కాంగ్రెసొళ్లు ఉండిరి. చేసేదేంలేక బతకడానికి గల్ప్ దేశాలకు వెళ్లిన. నా లెక్కనే మా ఊళ్లో చాలా మంది నాడు నీళ్లు లేక దేశాలు పట్టుకొని పోయిన్రు. తెలంగాణ వచ్చినంక ఇంటిబాట పట్టిన. కేసీఆర్ సార్ వచ్చినంకనే నీళ్లు వచ్చినయి. ఎక్కడి నుంచో కాళేశ్వరం జలాలు తెచ్చి ఇక్కడ పోస్తున్నడు. మా ఊరి మానేరు వాగులో చెక్‌డ్యాంలు కూడా కట్టిన్రు. దీంతో చెరువులల్ల, కుంటలల్ల నీళ్లు ఎప్పుడు ఉంటున్నయి. మా పొలం దగ్గర ఉన్న పెద్ద చెరువు కూడా మంచిగా చేయించిండు. అప్పడి సంది పంటలు పుష్కలంగా పండుతున్నయి. ఎనిమిదేండ్ల నుంచి ఏ దేశం పోకుండా పంటలు పండించుకుంట కొడుకులు ఇద్దరిని మంచిగ చదివిస్తున్న. కేసీఆర్ సారు వస్తేనే మా రైతులకు మంచి భరోసా ఉంటుంది. మా కుటుంబమంతా రుణపడి ఉంటం.
– అదరవేని ఎల్లయ్య, హరిదాస్‌నగర్(ఎల్లారెడ్డిపేట)
తినే కంచంలో మట్టిపోస్తున్రు

కాంగ్రెస్, బీజేపోళ్లు రైతుల కోసం చేసిందేమీ లేదు కానీ, తినే కంచంలో మట్టిపోస్తున్రు. నేను ఇరవై ఐదేండ్ల సంది ఎవుసం చేస్తున్న. ఎన్నడూ ఏ ప్రభుత్వం రైతుకు ఉచితంగా ఏ పథకం ఇయ్యలే. నాకున్న నాలుగెకరాల్లో పొలం ఏస్తే గలుమ పారకముందే కరెంటు పోయేది. పొలం కోతకు వచ్చేవరకు రెండు ఎకరాల పంటనే చేతికి వచ్చేది. గిట్ల పంట పెట్టుబడి రాక అరిగోస ఎల్లదీసినం. సావుకారి దగ్గర తెచ్చిన మందుల పైసలకు మిత్తిలకు కూడా సరిపోయేది కాదు. కొట్లాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ సారూ అడగకుండానే రైతులకు కావాల్సినవి ఇస్తన్రు. రైతుబంధు, రైతు బీమాలాంటి పథకాలు ఇచ్చి అప్పుల నుంచి బయట పడగొట్టిండు. గిప్పుడు మల్ల కాంగ్రెసోళ్లు రైతుబంధు అద్దని, కరెంటు వద్దని అంటున్నరు. ఇగ మళ్ల ఎనకటిలెక్క అయతట్లే ఉంది. ఎన్నికలొస్తే ఎవుసం చేయద్దు అన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. రైతుల కష్టాల తీర్చిన కాంగ్రెసోళ్లకు రైతుబంధు ఆపే హక్కు లేదు. రైతుబంధు ఆపితే ఊళ్లల్ల తిరుగనియ్యం.
-దాదె మల్లేశం, రైతు, వట్టిమల్ల(కోనరావుపేట)
ఒకప్పుడు జనరేటర్‌తో నీళ్లు పెట్టుకున్నం
పదేండ్ల కింద మా ఊళ్లె నీళ్లు లేక ఏసిన పంటలు ఎండిపోతుంటే ఒక్కొక్క మడికి ట్యాంకర్ తెచ్చి పారిచ్చుకునెటోళ్లం. అప్పుడు 800 నుంచి 900 ఫీట్లు బోరేసినా నీళ్లు రాకపోయేది. పంటలు పండుతయన్న ఆశ లేకుండేది. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతో మా ఊరికి గోదావరి నీళ్లచ్చినయ్. ఇప్పుడు రెండు పంటలు పుషలంగా పండించుకుంటన్నం. పదేండ్ల కింద ఒక్క ఎకురం ఏస్తమంటెనే భయమయ్యేది. అసోంటిది ఇప్పుడు ఐదెకరాలకు మీద వరి ఏస్తున్న. ఊళ్లెనే వడ్లు అమ్ముకుంటన్న. కాంగ్రెస్ పాలనల గిట్లుండెనా.. కరెంటు సంగతి దేవుడెరుగు.. అసలు మాకు నీళ్లే ఉండకపోయేవి. ఇపుడు మా ఒక్క ఊళ్లెనే గాదు మా చుట్టుపక్కల ఊళ్లకు సుతం కాలువలు వచ్చినయ్. బోరు మొత్తానికే ఎత్తేసిన. కాలువ నీళ్లతోనే పొలాలు పారిచ్చుకుంటన్న. యాసంగికి ఎకరానికి 50 వేల లాభమస్తంది. అప్పులన్నీ తీరినయ్. కేసీఆర్ దయతోని ఇల్లు మంచిగ గడుస్తంది.
– పెసరి రాజేశం, రైతు, ములనూరు(చిగురుమామిడి)
కాంగ్రెసోళ్లకు రైతుల ఉసురు తగుల్తది
రైతుల నోటి కాడ కూడు లాక్కున్న కాంగ్రెసోళ్లకు రైతుల ఉసురు తగుల్తది. రైతులు మంచిగుంటే ఓర్వలేక రైతుబంధును అడ్టుకుంటుంది. కాంగ్రెస్ పాలనలో మస్తు ఇబ్బందులు పడ్డం. అపుడు బోర్లు వేసిన పడకపోగా చేతికొచ్చిన పంట సైతం ఎండిపోయేది. అంతో ఇంతో పండితే కొనేటోళ్లు గూడ లేకుండ్రి. ఇపుడు కేసీఆర్ సారు మల్యాల మండలంలోని పోతారం గ్రామ పెద్ద చెరువును నింపేందుకు రామన్నపేట శివారులో వరద కాలువ వద్ద తూము కట్టిండు. ఆ నీళ్లను పోతారం చెరువులోకి వదులుతుండ్రు. దీంతో పోతారం పెద్ద చెరువుతో పాటు రాజారం, మోతే చెరువులు కూడా నిండుతున్నాయి. ఈ ప్రాంత భూగర్భ జలాలు మరింత పెరుగుతున్నాయి. పునర్జీవ పంప్ హౌస్ నిర్మాణంతో మస్తు పంటలు పండుతున్నయి. కేసీఆర్ సారే లేకుంటే మా బతుకులు ఆగమయిటేయి.
– కొండ పలుకల ఉమాపతిరావు, రైతు, పోతారం (మల్యాల మండలం)
అండగా నిలుస్తున్న బీఆర్ఎస్
- అన్నదాతల కష్టాలను సమైక్య రాష్ట్రంలో కళ్లారా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉమ్మడి జిల్లాలో మిషన్‌కాకతీయ కింద 900కు పైగా చెరువులను పునరుద్ధరించారు. ఫలితంగా 2.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా చేశారు. కాంగ్రెస్ హయాంలో మధ్యలోనే ఆగిపోయిన మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తిచేసి నీటి హబ్‌గా మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రూపురేఖలను మార్చేశారు. వరదకాలువను బలోపేతం చేసి నాలుగు సజీవ జలధారలుగా మార్చారు. ఎగువమానేరు నుంచి గోదావరి వరకు సజీవ జల దృశ్యాన్ని తలపించేలా తీర్చి దిద్దారు. రూ.వెయ్యి కోట్లతో ఎస్పారెస్పీ ప్రాజెక్టు కాలువలను ఆధునీకరించి.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు. దీని వల్ల ఉమ్మడి జిల్లా అత్యధికంగా లబ్ధి పొందుతోంది.
- ఆనాడు కరెంటు కోతలతో రైతాంగం అల్లాడింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి 24 గంటల కరెంటు ఇస్తున్నారు. రాష్ట్రం అవతరించిన తర్వాత సీఎం కేసీఆర్ కరెంట్ సమస్యలపై దృష్టి పెట్టి.. ముందుగా పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నాలుగైదు గంటలు మాత్రమే కరెంట్ ఇవ్వగా, తెలంగాణ వచ్చిన తర్వాత ముందుగా 7 గంటలు, అనంతరం 9 గంటలు, 2018 జనవరి 1 నుంచి 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యుత్ రంగాన్ని మెరుగు పర్చేందుకు రూ.650 కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఫలితంగా లో వోల్టేజీ లేకుండా పోయింది. మోటర్లు కాలిపోయే పరిస్థితి దాదాపు దూరమైంది. అన్నదాతపై ఆర్థిక భారం పడకుండా అయింది.
- అనాడు కేవలం 3.83 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైతే.. నేడు ఆ విస్తీర్ణం 12.35 లక్షలకు పెరిగింది. పెరిగిన సాగు విస్తీర్ణమే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను తెలుపుతోంది.
- ఆనాడు ఉమ్మడి జిల్లాలో 13.97 లక్షల మెట్రిక్ ధాన్యం ఉత్పత్తి కాగా, ఇప్పుడు 28.60 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది.
t2014 వరకు ఉమ్మడి జిల్లాలో కేవలం 66 మంది మాత్రమే వ్యవసాయ విస్తరణ అధికారులుండగా ఆ సంఖ్యను 258కి పెంచిన కేసీఆర్ ప్రభుత్వం.. రైతులకు అన్ని సూచనలు, సలహాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకున్నది. - ఆనాడు కరెంటు, సాగునీరు, ఇతర సౌకర్యాలు లేక కేవలం 4.57 లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 9.25,343 మందికి చేరింది. గల్ఫ్‌కు వెళ్లిన వారు వచ్చి సాగుచేసుకునే పరిస్థితికి ఉమ్మడి జిల్లా చేరింది.
- చనిపోయిన రైతుకు.. కేవలం రూ.1.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులోనే సవాలక్ష కొర్రీలు వేసి రాకుండా చూసింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. 173 జీవోను అమల్లోకి తెచ్చి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని నిర్ణయించి అమలు చేసింది. అంతే కాదు.. ఈ సమస్యకు శాశ్వత ముగింపు పలుకడంతోపాటు గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా ఆ కుటుంబాకి అండగా నిలువాలని భావించి.. 2018 ఆగస్టు 15 నుంచి రైతు బీమాను అమల్లోకి తెచ్చింది. రైతు ఏకారణంతో చనిపోయినా బీమా వర్తించే విధంగా ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోంది. దీని కింద ఇప్పటికే 9,151 రైతు కుటుంబాలకు రూ.356.94 కోట్లను నేరుగా సదరు కుటుంబాలకు చెల్లించింది. ఇప్పుడు కేవలం ఒక్క వ్యవసాయ విస్తరణ అధికారి ధ్రువీకరించినా.. ధరణిలో ఉన్నా సరే సదరు రైతుకు బీమా పరిహారం అందుతుంది. అంతేకాదు.. చనిపోయిన వారం పది రోజుల్లోనే ఈ బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకొని కేసీఆర్ అండగా నిలుస్తున్నారు.
- ప్రపంచ చరిత్రలో ఎవరూ తీసుకోని నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకొని.. రాష్ట్రంలో రైతుబంధు అమలు చేస్తున్నారు. ఈ పథకాన్ని 2018 మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభిచిన ముఖ్యమంత్రి.. ఇప్పటి వరకు 11 విడుతల పెట్టుబడి సహాయాన్ని అందిచారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం చూస్తే.. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 9.25,343 మంది రైతులు సాగు చేస్తుండగా వీరికి గడిచిన 11 విడుతల్లో రూ.7,750.68 కోట్ల పైచిలుకు మొత్తాన్ని పెట్టుబడి కింద బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. ఈ లెక్కన ఒక సీజన్లో చూస్తే రమారమి రూ.700 కోట్ల నుంచి 800ల కోట్ల వరకు అన్నదాతలకు పెట్టుబడి సహాయం అందుతోంది. అదే ఏడాదికి రూ.1400 కోట్ల నుంచి రూ.1600 కోట్ల వరకు వస్తున్నది. తాజా, మ్యానిఫెస్టోలో ఈ పెట్టుబడి సాయాన్ని రూ.16 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది.
- రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే.. తద్వారా రైతులకు ఇబ్బంది అవుతుందని, అడ్డుకోవద్దని బీఆర్ఎస్ కోరుతోంది. మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ అంటుంటే.. ఐదు దశాబ్ధాలుగా అన్నదాతలు ఆగచాట్లు పడ్డారు. వారి భవిష్యత్ బంగారం చేయాలంటే 24 గంటల కరెంటు ఇచ్చి తీరుతామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది. పెట్టుబడి సహాయం వృథా ఖర్చు అంటూ కాంగ్రెస్ ప్రేలాపణలు చేస్తుంటే.. అది వాస్తవం కాదని, అన్నదాతలు ఆర్థికంగా బలపడేందుకు అది ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ వాదిస్తోంది.
- ఇవి మచ్చుకు మాత్రమే.. విత్తనాలు, ఎరువులు, నకిలీ విత్తనాల ఆటకట్టు వంటి విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనేకం ఉన్నాయి. గ్రామానికో కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసి అన్నదాతలకు అండగా నిలుస్తోంది. అందుకే.. రైతుల పాలిట బీఆర్ఎస్ కల్పవృక్షంగా మారగా, కాంగ్రెస్ మాత్రం కపట కుట్రలు పన్నుతుందన్న విమర్శలు వస్తున్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

