కరీంనగర్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : నిలదీతలు.. అధికారుల దాటవేతలతో గ్రామ సభలు గందరగోళంగా జరిగాయి. పేరుకే సర్వే.. జాబితాలో పేర్లు గల్లంతయ్యాయని ప్రజలు ఎక్కడికక్కడ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల జాబితాల్లో అధికార పార్టీ నేతలు చెప్పినోళ్ల అనర్హుల పేర్లే చేర్చారంటూ మండిపడ్డారు. జాబితాలలో తమ పేర్లు ఎలా గల్లంతాయంటూ ప్రశ్నించారు. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో నాలుగు పథకాల అమలుపై గ్రామ సభలు నిర్వహించి, లబ్ధిదారుల జాబితాలను అధికారులు చదివి వినిపించగా, తమ పేర్లు లేవంటూ ప్రజలు వాగ్వాదానికి దిగారు.
ఇంటింటికీ తిరిగి చేసిన సర్వేలో తమ పేర్లు మరీ చెప్పి రాయించుకున్నామని, ఎలా తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు అన్యాయం చేశారంటూ, అనర్హులను ఎంపిక చేశారంటూ విరుచుకుపడ్డారు. దాంతో అధికారులు తలలు పట్టుకున్నారు. చాలాచోట్ల పోలీస్ పహారా మధ్యన తూతూ మంత్రంగా సభలు నిర్వహించి, చేతులు దులుపుకున్నారు. మరోవైపు చాలాచోట్ల సభల్లో కాంగ్రెస్ నాయకులదే హవా కనిపించింది. అధికారిక కార్యక్రమాల వేదికలపై కూర్చోవడం విమర్శలకు తావిచ్చింది. కాగా, జాబితాలో అర్హులు పేర్లు లేకపోతే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించడంతో పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయారు.
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని బట్టపల్లిలో ఆత్మీయ భరోసాలో ఒక్కో కుటుంబానికి చెందిన వారి పేర్లే అధికంగా ఉన్నాయని గ్రామస్తులు, కూలీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన భార్యభర్తలు పుట్టపాక స్వామి-మైత, వెంగలదాసు లక్ష్మి-శంకరయ్య, పెళ్లి అయి వెళ్లిపోయిన అక్కాచెల్లెండ్లు ప్రత్యూష, లావణ్య, కల్లపెల్లి రమాదేవి, తిరుపెల్లి సాగరిక, వ్యవసాయ భూమి ఉన్న వెంకటన్న, శ్రీనివాస్, ఏడాది క్రితం మృతి చెందిన మాదాసు వెంకట్ రాజం పేర్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో రావడంతో అభ్యంతరం తెలిపారు.
కోనరావుపేట మండలలోని ఊరుతండాలో మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించాల్సిన గ్రామసభకు అధికారులు సరైన సమయానికి హాజరుకాలేదు. దీంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. లబ్ధిదారులు, తండావాసులు తమ కాగితాలతో అధికారులు ఎప్పుడు వస్తారని నిరీక్షించారు. కోనరావుపేట గ్రామపంచాయతీ ఆవరణలో సభకు వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్ హాజరవగా.. గ్రామస్తులు కుర్చీలు, మంచినీరు, మైకు సరిగా లేకపోవడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించలేదని వాపోయారు.
ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి?
పెద్దపల్లి రూరల్, జనవరి 21: పెద్దపల్లి మండలం బొంపల్లిలో గ్రామసభ గందరగోళంగా మారింది. అధికారులు పథకాల గురించి వివరిస్తుండగానే, గ్రామానికి చెందిన అరికిల్ల మల్లేశం, అరికిల్ల ప్రశాంత్, అరికిల్ల ప్రవీణ్, బండారి రమేశ్ రేషన్ కార్డులు, రైతు భరోసా ఎవరికి ఇచ్చారు? ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోమంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుడు గుర్రాల రాజు కలుగజేసుకోవడంతో ఇరువురి మధ్య వాదన జరిగింది. ప్రత్యేకాధికారి ఏపీడీ సత్యనారాయణ, వ్యవసాయశాఖ అధికారి కాంతాల అలివేణి జోక్యం చేసుకుని ఇరువురికి నచ్చచెప్పడంతో గ్రామసభ సజావుగా సాగింది.
తిరగబడ్డ జనం
వీర్నపల్లి, జనవరి 21: వీర్నపల్లి సభలో గ్రామస్తులు తిరగబడ్డారు. జాబితాలో పేర్లను అధికారులు చదువుతుండగా, తప్పుల తడకగా ఉందని ఆందోళన చేశారు. డబుల్ రోడ్డు విస్తరణలో 24 మంది ఇండ్లు కోల్పోతే ఏడుగురికే పరిహారం వచ్చిందని, మిగిలిన 17 మంది పేర్లు ఏవని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు మద్దతు తెలిపారు. దీంతో అధికారులు సమాధానం చెప్పలేక దాటవేసే ప్రయత్నం చేశారు. ఇండ్లు కోల్పోయిన వారి పేర్లు జాబితాలో ఎందుకు రాలేదంటూ సభకు హాజరైన అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్ను చుట్టుముట్టారు. దీంతో ఆయన న్యాయం జరిగేలా చూస్తానంటూ తిరిగి వెళ్లిపోయారు.
కాల్మొక్తా మేడం.. ఇల్లు ఇవ్వండి
ఈ చిత్రంలో కమాన్‌పూర్ ఎంపీడీవో లలిత కాళ్లపై పడి ఇల్లు కావాలని వేడుకుంటున్న మహిళ పేరు గెళ్లెన లావణ్య. ఊరు పెంచికల్‌పేట. పేద కుటుంబం. భర్త శేఖర్, లావణ్య కూలీ పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు. గ్రామంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న రేకుల షెడ్డులో ఉంటున్నది. వానకాలం వస్తే చాలు వీరికి జాగారమే. ఇంట్లోకి నీళ్లు చేరుతయి. దీంతో గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో తల దాచుకుంటరు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంది. ఇల్లు వస్తదని సంబురపడ్డది. కానీ జాబితాలో ఆమె పేరు రాకపోవడంతో కన్నీరుమున్నీరైంది. తనకు ఎలాగైనా ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని ఎంపీడీవోకు దండం పెట్టుకున్నది. కాళ్లపై పడి వేడుకున్నది.
– కమాన్‌పూర్ , జనవరి 21
లిస్ట్ చింపేయండి
కరీంనగర్ రూరల్, జనవరి 21: కరీంనగర్ మండలంలోని నగునూర్‌లో అధికారులు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలోని పేర్లు చదువుతుంటే దానిని చింపివేయాలని గ్రామస్తులు ఎంపీడీవో సంజీవరావును నిలదీశారు. భవంతులు, ఇండ్లు, వ్యవసాయ పొలాలు, ఎకరాలకు ఎకరాలు ఉన్నవారిని ఎలా ఎంపిక చేశారని, అసలు సర్వే చేసిన వారిని పిలిపించాలని పట్టుపట్టారు. స్థలం లేని వారికంటే స్థలం ఉన్నవారు నిరుపేదలు అవుతారా..? అని మహిళలు ప్రశ్నించారు. భూమి అమ్మిన వారికి రైతు భరోసా ఎలా నమోదు చేస్తారని, పంటల నమోదులో పూర్తి స్థాయిలో తప్పులు ఉన్నాయని మండిపడ్డారు. సర్వేలు తప్పుల తడకగా జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అభిప్రాయం తర్వాతే జాబితాను విడుదల చేస్తామని అధికారులు చెప్పడంతో అసలు జాబితా లేకుండా గ్రామసభ ఎలా నిర్వహిస్తారని నిలదీశారు.
పోలీస్ పహారా..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామసభలను పోలీస్పహారా మధ్యన నిర్వహించారు. ఆయాచోట్ల ప్రజలు నిరసన తెలిపిన సందర్భాల్లో పెద్ద ఎత్తున చుట్టుముట్టారు.
అబ్బాపూర్‌లో ఆగ్రహం
జూలపల్లి, జనవరి 21: జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామ సభ రసాభాసగా మారింది. అధికారులు అర్హుల జాబితా చదువుతుండగా, గ్రామస్తులు అభ్యంతరం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రేషన్ కార్డులు ఎలా మంజూరు చేస్తారని నిలదీశారు. అనర్హులను జాబితాలో ఎలా చేరుస్తారని వాగ్వాదానికి దిగడంతో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నది. ఇక తమకు వ్యవసాయ భూములు లేవని, కూలీ పనిచేస్తేనే పూట గడిచే తమను ఇందిరమ్మ రైతు భరోసా పథకంలో ఎందుకు ఎంపిక చేయలేదని మహిళలు మండిపడ్డారు. ఇచ్చేదీ లేదు, సచ్చేదీ లేని గ్రామ సభలు ఎందుకు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేయగా, అధికారులు అక్కడి నుంచి నిష్క్రమించారు.
సతులకు బదులు పతులు
కోల్‌సిటీ, జనవరి 21: అంతా అనుకున్నట్టే వార్డు సభలు మళ్లీ కాంగ్రెస్ సభలుగానే మారిపోయాయి. ఆ పార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. మంగళవారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. అధికారిక వేదికపై కార్పొరేటర్లే గాకుండా వారి భర్తలు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కూర్చోవడం విమర్శలకు తావిచ్చింది.
ఎంపికలో అవకతవకలు
శంకరపట్నం మండలం కరీంపేట్లో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని తహసీల్దార్ భాస్కర్‌తో వాగ్వాదానికి దిగారు. వనపర్తి సుగుణ, మొలంగూరి శిరీష, కాంరంకంటి మల్లమ్మ, సోని, వనపర్తి రజని, మేడిచలిమెల సుగుణ నిరసన తెలిపారు. గద్దపాకలో పోతర్ల లింగయ్య, ఆర్ శ్రీనివాస్ తమకు గుంట భూమి లేదని, ఉపాధిహామీ పనులకు వెళ్తేనే ఎంపిక చేస్తామన్న నిబంధనతో తమలాంటి ఇతర పనులు చేసుకునే నిరుపేద కుటుంబాలు ఆత్మీయ భరోసా పథకానికి దూరం అవుతున్నట్టు వాపోయారు. తాడికల్‌లో రేషన్ కార్డుల ఎంపికలో అవకతవకలు చోటు చేసుకున్నాయని యువకులు ఎంపీవో ప్రభాకర్‌తో వాదనకు దిగారు.
కిరాయికి ఉంటున్న వారిని వదిలేసిన్రు
ఇందిరమ్మ ఇండ్ల సర్వే లిస్టులో 349 మంది ప్రకటించి ఇది ఫైనల్ కాదని చెప్తున్నరు. ఫైనల్ కానప్పుడు ఎందుకు చింపేయండి. సర్వే చేసిన అధికారులను చూపించుమంటే చూపించడం లేదు. స్థలం ఉండి, భవనాలు, ఇండ్లు, భూములు ఉన్నవారి పేరు సర్వేలో నమోదు చేసిన్రు. అడుగు భూమి లేని వాళ్ల పేర్లు లేవు. ఏండ్ల నుంచి కిరాయికి ఉంటున్న వారిని వదిలేసిన్రు. సర్వే చేసిన అధికారులను నిలదీస్తామంటే తప్పులు దాచేందుకు ఇది ఫైనల్ లిస్టు కాదని బుకాయిస్తున్నరు. ఫైనల్ లిస్టు బహిరంగంగా పంచాయతీ నోటీస్ బోర్డుపై అంటించాలి. అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల అందించాలి.
-ధర్మయ్య, నగునూర్, కరీంనగర్‌రూరల్
వెయ్యికి 24 మందికే కార్డులు వచ్చినయ్
మా వార్డులో వెయ్యి మంది ఉంటే 24 మందికే రేషన్ కార్డులు వచ్చినయ్. ఇందిరమ్మ ఇండ్లు ఒకే ఇంటి నుంచి ఇద్దరికి వచ్చినయ్. ఒంటరి మహిళకు ఇందిరమ్మ ఇల్లు అందలేదు. లిస్టులో లేని వారి పేర్లు తర్వాత వస్తాయనడం కరెక్ట్ కాదు. నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు.
– పుష్పలత, కాంగ్రెస్ మహిళా నాయకురాలు (హుజూరాబాద్)
ఏం సర్వే చేసిన్రో ఏమో..
నేను మధురానగర్ చౌరస్తాలో పాన్‌షాప్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న. నాకు సొంత ఇల్లు లేదు.. గుంట భూమి లేదు.. రేషన్ కార్డు లేదు. గతంలో గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన సభలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న. ఇవ్వాళ గ్రామ పంచాయతీ వద్ద అధికారులు గ్రామసభలో చదివిన జాబితాల్లో నా పేరు లేదు. సగం కంటే ఎక్కువ మంది భూములు, ఇండ్లు ఉన్నోళ్ల్లే ఉన్నరు. ఇంటికి వచ్చి నా కుటుంబ పరిస్థితిని కళ్లారా చూసిన అధికారులే ఇప్పుడు నేను అర్హుడిని కాదని తేల్చడం బాధగా ఉంది. వాళ్లు ఏం సర్వే చేసిన్రో ఏమో తెలుస్తలేదు. సార్లను అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నరు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకుంటే అర్హుడిని అయితనో తెలుస్తలేదు. అధికారులు మంచిగ సర్వే చేసి నిజమైన నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతున్నం.
– సాదుల కృష్ణ, గంగాధర
అద్దె ఇంట్లో ఉన్న..
మేం పెంచికల్‌పేటలో 14 ఏండ్ల నుంచి అద్దె ఇంట్లో ఉంటున్న. నాకు 3 గుంటల జాగ ఉంది. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న. సార్లు మా ఇంటికి వచ్చి ఫొటోలు తీసుకుని వెళ్లారు. ఈ రోజు మా ఊళ్లో గ్రామ సభ ఉందంటే సంబురపడ్డా. ఇల్లు వస్తది ఆశ పడ్డా. కానీ జాబితాలో నా పేరే లేదు. ఇప్పటికైనా అధికారులు దయచూపి మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
– గడ్డం స్వరూప, పెంచికల్‌పేట (కమాన్‌పూర్ మండలం)
నాకు గుంట భూమిలేదు
మాది నిరుపేద కుటుంబం. నా భర్త పదేండ్ల కిందట చనిపోయిండు. ఉండడానికి ఇల్లు లేదు. కిరాయి ఇంట్లో ఉండి, వంద రోజుల పనికి రోజు పోయి బతుకుతున్న. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం జాబితాలో నా పేరు రాలేదు. నాకు అన్యాయం చేయొద్దు. అధికారులు స్పందించి నా పేరు పథకంలో చేర్చాలి.
– దాసరి శ్యామల, పందిల్ల (కాల్వశ్రీరాంపూర్)