రాష్ట్రం ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలు గందరగోళంగా సాగాయి. జాబితాల్లో అనర్హుల పేర్లు రావడం.. అర్హులను విస్మరించడంపై పలుచోట్ల గ్రామస్తులు అధికారులను నిలదీశారు. వారు సర్దిచెప్పి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించగా, బారులు తీరారు.
కార్పొరేషన్, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం చేపట్టిన వార్డు సభలు మంగళవారం నగరపాలక సంస్థలోని 30 డివిజన్లలో కొనసాగాయి. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు 15 డివిజన్లల్లో, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు మరో 15 డివిజన్లలో అధికారులు వార్డు సభలను కొనసాగించారు. కాగా, అన్ని డివిజన్లల్లోనూ రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. 3వ డివిజన్లో జరిగిన వార్డు సభలో కొందరు.. ఇటీవల జరిగిన సర్వేలో తమ పేర్లు ఎంపిక అయ్యాయా? లేదా? అని ప్రశ్నించగా, జాబితా త్వరలోనే వస్తుందని అధికారులు చెప్పడం గమనార్హం. పలు వార్డు సభలను నగర కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. మిగిలిన ప్రాంతాల్లో ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
వార్డు సభల్లో మొదటిరోజు భారీగా దరఖాస్తులు
కరీంనగర్ నగర పాలక సంస్థలో మొదటి రోజు నగర వ్యాప్తంగా 30 డివిజన్లలో సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులకు 9699, ఇందిరమ్మ ఇండ్ల కోసం 4412 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
కరీంనగర్ రూరల్, జనవరి 21: ఇంటి జాగ లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నగునూర్ గ్రామంలోని నిరుపేద మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థలం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామనడమేమిటని ప్రజాపాలనలో ప్రశ్నించారు. అసలు ఇంటి స్థలం ఉంటే, నిరుపేదలు ఎలా అవుతారని నిలదీశారు.
అద్దె ఇళ్లల్లో జీవిస్తున్న తమను ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇంటి స్థలం ఇచ్చి, మొదటి విడుతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల జాబితా వివరాలను అధికారులు వెల్లడిస్తుండగా, అనర్హులతో రూపొందించిన లిస్టును చించివేయండంటూ స్థానికులు మండిపడ్డారు. లబ్ధిదారుల జాబితా నోటిస్ బోర్డుపైన ప్రకటించాలని సూచించారు. ఎంపీడీవో సంజీవరావు కల్పించుకుని అసలు జాబితా పూర్తి కాలేదని, ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, అసలు జాబితా ప్రకటించకుండా నామమాత్రంగా జాబితాతో గ్రామ సభ ఎలా నిర్వహిస్తారని అధికారులను నిలదీశారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక సర్వేలో చాలా పొరపాట్లు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.
హుజూరాబాద్, జనవరి 21: మండలంలోని పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం నిర్వహించిన గ్రామసభ వెలవెలబోయింది. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా చదువుతుండగానే గ్రామస్తులు సభ నుంచి వెళ్లిపోయారు. అధికారులు వారించినా గ్రామస్తులు కుర్చీల్లో కూర్చోలేదు. దాదాపు సగానికన్నా ఎకువగా గ్రామస్తులు సభ నుంచి మధ్యలోనే నిష్రమించారు.
హుజూరాబాద్ టౌన్, జనవరి 21: పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన వార్డు సభలు గందరగోళంగా మారాయి. ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల లిస్టుల్లో అవకతవకలు జరిగాయని అధికారులను నిలదీశారు. పలు వార్డుల్లో సరిపడా స్టేషనరీ సామాను లేదని, అప్లికేషన్లు పెట్టుకునేందుకు కనీసం తెల్లపేపర్లు సైతం లేవని వాపోతున్నారు. తూతూమంత్రంగా కొద్ది సంఖ్యలోనే అప్లికేషన్లు పెట్టుకునేందుకు తెల్ల పేపర్లు అందుబాటులో ఉంచారన్నారు. పట్టణంలోని ఇందిరానగర్‌లో ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకే ఇచ్చారని వార్డు ప్రజలతో పాటు కాంగ్రెస్ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ప్రజలను సముదాయించారు. అయినా.. ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన వారి లిస్టును రద్దు చేసే వరకు కొత్త అప్లికేషన్లు పెట్టుకోబోమని తేల్చిచెప్పడంతో అధికారులు చేసేదేంలేక అక్కడినుంచి వెళ్లిపోయారు.
హుజూరాబాద్ రూరల్, జనవరి 21: హుజూరాబాద్ మండలంలో కందుగుల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పగా, మీరు మాత్రం తమ గ్రామానికి 480 మందిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారని ఎంపీడీవో సునీతను గ్రామస్తులు నిలదీశారు. చెల్పూర్లో పెన్షన్, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆర్డీవో రమేశ్, తహసీల్దార్ కనకయ్యతో వాగ్వాదానికి దిగారు. సింగాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక జాబితాలో అర్హుల పేర్లు లేవంటూ మహిళలు ఒక్కసారిగా అధికారులపై విరుచుకుపడ్డారు. ప్రతి సంక్షేమ పథకం విషయంలో అవకతవకలపై గ్రామస్తులు నిలదీయడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. పోలీసుల పహారాలో నామ మాత్రంగా సభలు నిర్వహించి చేతులు దులుపుకొని వెళ్లిపోయారు.
జమ్మికుంట, జనవరి 21: పట్టణంలో 30 వార్డులు ఉండగా, మంగళవారం మొదటి రోజు 16 వార్డుల్లో ప్రజాపాలన వార్డు సభలు నిర్వహించారు. ఆయా వార్డు సభల్లో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, కమిషనర్ ఎండీ ఆయాజ్, పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, వార్డు కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. మండలంలో 20 గ్రామాలు ఉండగా, మొదటి రోజు 6 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. అధికారులు పాల్గొన్నారు.
సైదాపూర్, జనవరి 21: మండలంలోని దుద్దనపల్లి, ఎలబోతారంతో పాటు వివిధ గ్రామాల్లో పథకాల లబ్ధిదారుల ఎంపికపై అధికారులను గ్రామస్తులు నిలదీశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని పేదవాళ్లకు ఇస్తామని చెప్పి మరలా ఉపాధిహామీ పనితో లింకు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఉపాధిపనితో పాటు వ్యవసాయకూలీలు, వివిధ కులవృత్తులు చేసుకునే పేదలందరికీ ఎందుకివ్వరని ప్రశ్నించారు. రైతుభరోసాలో తీసివేసిన భూమిపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండాలనే లిస్టులు తయారు చేశారని, మరలా సర్వేచేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. రేషన్‌కార్డుల ఎంపికపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు అందించాలని కోరారు. కాగా, అధికారులు ప్రజలతో మాట్లాడారు. లిస్టుల్లో పేర్లు లేని వారు మరలా దరఖాస్తు చేసుకుంటే రేషన్‌కార్డులు, రైతుభరోసా, ఆత్మీయభరోసా, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని తెలిపారు.
ఇల్లందకుంట, జనవరి 21: మండలంలోని బుజూనూర్, పాతర్లపల్లి, బోగంపాడు, కనగర్తి, లక్ష్మాజీపల్లి, చిన్నకోమటిపల్లి, టేకుర్తి గ్రామాల్లో ప్రజాపాలనలో భాగంగా అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. బుజూనూర్ గ్రామంలో అధికారులు పథకాలకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా చదువుతుండగా, గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని నిలదీశారు. ఎంపీడీవో పుల్లయ్య కలుగజేసుకొని జాబితాల్లో పేర్లు రాని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు.
వీణవంక, జనవరి 21: రెడ్డిపల్లిలో, రామకృష్ణాపూర్ గ్రామసభల్లో ఎంపిక జాబితాలో అవకతవకలు జరిగాయంటూ మహిళలు అధికారులను నిలదీశారు. వాగ్వాదానికి దిగారు. రామకృష్ణాపూర్లో ప్రతి ఇంటికి రేషన్‌కార్డు ఎందుకు రాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజయ్య అధికారులను నిలదీశారు. ఓ లబ్ధిదారుడు దరఖాస్తు ఇవ్వడానికి అధికారుల దగ్గరికి వెళ్తుండగా, అక్కడే ఉన్న కానిస్టేబుల్ వెనక్కి తోసివేసి అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. మొదటి రోజు గ్రామసభలు ఏర్పాటు చేసిన ప్రతి చోట లబ్దిదారులు ప్రశ్నలతో అధికారులను నిలదీశారు.
మానకొండూర్ రూరల్, జనవరి 21: మండలంలోని లింగాపూర్, వేగురుపల్లి, అన్నారం, దేవంపల్లి, కేల్లేడు, మద్దికుంట, చెంజర్ల, గట్టుదుద్దెనపల్లి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. అధికారులు అర్హుల జాబితాను చదివి వినిపించారు. కాగా, లిస్టుల్లో అర్హులు కాని వారి పేర్లు ఎలా చేర్చారని వివిధ గ్రామాల్లో గ్రామస్తులు అధికారులను నిలదీశారు. అర్హుల పేర్లను కూడా నమోదు చేసుకుంటామని, ఇదే ఫైనల్ లిస్టు కాదని అధికారులు సర్దిచెప్పారు. వేగురుపల్లి గ్రామ సభ రసాభాసగా మారింది. ఎంపీడీవో వరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించగా, పథకాల లబ్ధిదారుల జాబితాలో అనర్హులను చేర్చారంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. పేదలను విస్మరించి భూములు ఉన్న వారికి పథకాలు ఎలా వర్తింపజేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ఓ లీడర్ చెప్పినట్లుగా అధికారులు లిస్ట్‌ను తయారు చేశారని మండిపడ్డారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే బాజాప్తా కాంగ్రెస్‌కు ఓటేసిన వారికే పథకాలు వర్తింపజేస్తామంటూ ఓ కాంగ్రెస్ నాయకుడు గ్రామస్తుల ముందు అనడం పెద్ద దుమారమే రేపింది. మరింత ఉద్రిక్తతకు దారితీసింది. అయితే జాబితాను రద్దు చేసి, గ్రామంలో మరోసారి సర్వే చేపడతామని అధికారులు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
తిమ్మాపూర్ రూరల్, జనవరి 21: మండలంలోని నల్లగొండలో లబ్ధిదారుల ఎంపిక సరిగా లేదని బీజేపీ మండల ఉపాధ్యక్షుడు మార హరికృష్ణ గౌడ్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ నిరసన వ్యక్తం చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ భరోసా పథకం వర్తింపజేయాలని తహసీల్దార్ విజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రామకృష్ణ కాలనీలో బీజేపీ మండలాధ్యక్షుడు జగదీశ్వరాచారి పథకాల అమలుపై ప్రశ్నించగా, కాంగ్రెస్ నాయకులు ఆయనతో వాగ్వాదానికి దిగడంతో గ్రామస్తులు కూడా కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది, దీంతో అధికారులు జోక్యం చేసుకొని సభ నిర్వహించారు.
చిగురుమామిడి, జనవరి 21: మండలంలోని చిగురుమామిడి, ఇందుర్తి, సుందరగిరి, రేకొండ గ్రామాల్లోని రైతు వేదికలు, గ్రామపంచాయతీల వద్ద మంగళవారం గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభల్లో అనర్హులను ఎంపిక చేశారని అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం చేశారు. రేషన్ కార్డులు అర్హులకు రాలేదని, రిటైర్ ఉద్యోగులకు వచ్చాయంటూ నిలదీశారు. పలు గ్రామ సభలో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అర్హులైన వారందరి నుంచి దరఖాస్తులు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
గన్నేరువరం, జనవరి 21: మండలంలోని మైలారం గ్రామసభలో లబ్ధిదారుల ఎంపిక సరిగా లేదంటూ గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. చాకలివాని పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అర్హుల పేర్లు లేవని బీఆర్ఎస్ నాయకులు అధికారులను ప్రశ్నించగా, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. చొకారావుపల్లిలో గ్రామసభలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతుండగా, మహిళలు రుణమాఫీ ఎప్పుడు అవుతుందని ప్రశ్నించారు. త్వరలోనే చేస్తామని, దాటవేసి సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చొప్పదండి, జనవరి 21: మండలంలోని వెదురుగట్ట గ్రామసభలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో గుంట భూమి లేని తమను విస్మరించి, భూమి ఉన్నవారిని ఎంపిక చేశారంటూ పలువురు అధికారులను ప్రశ్నించారు. గ్రామంలో ఎలాంటి సర్వే చేయకుండా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు ఇస్టానుసారంగా వారికి కావాల్సిన వారినే ఎంపిక చేశారని ఆందోళన చేశారు. గ్రామాల్లో ఇప్పటి వరకు ఇంకా కొంతమందికి రైతులకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎలాంటి అవగాహన లేకుండా గ్రామ సభలకు రావడమే కాకుండా, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ప్రజలకు నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని ఆరోపించారు.
గంగాధర, జనవరి 21: మండలంలోని గంగాధర, మధురానగర్, బూరుగుపల్లి, లింగంపల్లి, చెర్లపల్లి(ఆర్), కొండాయపల్లి, ముప్పిడినర్సయ్యపల్లి, నర్సింహుపల్లి గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలు రసాభాసగా మారాయి. సంక్షేమ పథకాలను అధికారుల నిర్లక్ష్యంతో అనర్హుల పాలవుతున్నాయని గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. సర్వే సమయంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించడంతోనే అర్హులకు అన్యాయం జరుగుతోందని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామసభలో ప్రశ్నించిన వారిని పోలీసులు సభ నుంచి పక్కకు తీసుకువెళ్లారు. అధికారుల తప్పులను ఎత్తిచూపుతున్న తమను పోలీసులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.
రైతు భరోసా జాబితా తప్పుల తడక
రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక జాబితా తప్పల తడకగా మారింది. అధికారులు భూములు అమ్ముకున్నవారి పేర్లు నమోదు చేశారు. గ్రామంలో సాగుకు యోగ్యం కాని భూములు చాలా ఉన్నా అధికారులు సక్రమంగా సర్వే నిర్వహించలేదు. రైతు భరోసాలో రైతులకు అన్యాయం జరుగుతున్నది. సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని, సాగుకు పనికి రాని భూములు కూడా నమోదు చేశారు. రైతు భరోసా పెద్ద బోగస్‌గా సర్వే చేశారు.
మహేందర్ (నగునూర్, కరీంనగర్)
జానెడు భూమి కూడా లేదు
నేను కూలి పని చేసుకుని బతుకుతున్న. నాకు జానెడు భూమి కూడా లేదు. కరువు పనికి పోతున్న. మాలాంటి నిరుపేదలకు సర్కారు రూ.12 వేలు ఇత్తుందని తెలిసి సంబురపడ్డ. ఇయ్యాళ గ్రామ పంచాయతీ దగ్గర పైసలు అచ్చెటోళ్ల పేర్లు చదువుతరని చెప్పితె పోయిన. నా పేరు రాలేదని సార్లు చెప్పిన్రు. నా పేరెందుకు రాలేదని సార్లను అడిగితే సమాధానం చెప్పుతలేరు. పేరు రాకుంటే మళ్ల దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన్రు. ఇంటికచ్చి ఫోటువలు తీసుకుని, నాకు అత్తయని చెప్పిన సార్లు ఇప్పుడు రాలేదని చెబుతున్నరు. పెద్దసార్లు మళ్ల సర్వే చేయించి మా అసోంటోళ్లకు న్యాయం చేయాలె.
– ప్యాట దుర్గయ్య, గంగాధర