2
Chada Venkata Reddy | చిగురుమామిడి, సెప్టెంబర్ 15: ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటాలు చేసి అసువులు బాసిన అమరుల ఆశయాల కోసం కామ్రేడ్లు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మండలంలోని ఇందుర్తి గ్రామంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం గాగిరెడ్డిపల్లి, సుందరగిరి, చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాలలో అమరులైన ముసుకు రాజిరెడ్డి, కూన ముత్యాలు, అందే మైసయ్య, గురుకుల జనార్దన్ రెడ్డి, గునుకుల రామ్ రెడ్డి, సింగిరెడ్డి బాల్ రెడ్డి, దొడ్ల మల్లయ్య, నీల మొగిలయ్య, చాడ ప్రభాకర్ రెడ్డి స్తూపాల వద్ద సోమవారం పార్టీ జెండాలను ఎగరవేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ కమ్యూనిస్టులు పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారని, నైజాం నిరంకుశ పరిపాలన విధానాన్ని ఎండగట్టిన ఘనత కామ్రేడ్లకు ఉందన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టులు చేసిన ఉద్యమాల పోరాటాల పాత్ర మరువలేమన్నారు. ఎందరో కమ్యూనిస్టు నాయకులు ప్రజా సమస్యలపై పోరాటాలు చేసి అసువులు బాసారని అన్నారు. నైజాం పాలననుఎదిరించిన ఘనత కమ్యూనిస్టులదేనన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కంకణబద్దుడై పార్టీ బలోపితం కోసం కృషి చేయాలన్నారు. పార్టీకి పూర్వవైవం తీసుకురావాలని కోరారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టులు తమ సత్తా చాటాల్సిన అవసరం ఉందన్నారు. యువత ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందే స్వామి, మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, నాయకులు గూడెం లక్ష్మి, బోయిని అశోక్, బూడిద సదాశివ, కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, గోలి బాపురెడ్డి, చాడ శ్రీధర్ రెడ్డి, ముద్రకోల రాజయ్య, తే రాల సత్యనారాయణ, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, కూన లెనిన్, అందే చిన్నస్వామి వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో బైక్ ర్యాలీలు..
తెలంగాణసాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా మండలంలోని ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, సుందరగిరి, చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల మీదుగా కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాలను పట్టుకొని తరలి వెళ్లారు. రోడ్లన్నీ ఎర్రజెండాలతో ఎరుపుమయమయ్యాయి. యువకులు నృత్యాలు చేశారు. బొమ్మనపల్లి నుండి హుస్నాబాద్ మండలంలోని మాందాపూర్ కు బైక్ ర్యాలీగా బయలుదేరారు.