Godavarikhani | కోల్ సిటీ, జూన్ 25: రామగుండం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్‌పై బుధవారం తెలంగాణ రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది సింగం జనార్ధన్ తెలిపారు. నగర పాలక పరిధిలోని ఎన్టీపీసీ లక్ష్మీనరసింహా గార్డెన్ యజమాని చింతలపల్లి కిషన్ రావు మున్సిపల్ అనుమతులు లేకుండానే పార్కింగ్ స్థలంపై ఆక్రమంగా ప్రహరీ నిర్మించాడని, ఈ విషయమై ఆరు నెలల క్రితం నగర పాలక కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో అనేకమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ తన ఫిర్యాదులకు స్పందించడం లేదనీ, ఫంక్షన్ హాలు యజమానితో కుమ్మక్కై కావాలనే ఏలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నట్లు ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ద్వారా కూడా దరఖాస్తు చేసుకోగా, ప్రహరీ గోడకు ఏలాంటి అనుమతి ఇవ్వలేదని నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులే స్పష్టం చేశారని తెలిపారు. అనుమతులు లేనప్పుడు ఫంక్షన్ హాలు యజమానికి ఏలాంటి నోటీసులు కూడా జారీ చేయడం లేదన్నారు. అనేక సార్లు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా టీపీఓ నవీన్ అందుబాటులోకి రావడం లేదనీ, దీంతో బుధవారం తాను తెలంగాణ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే ఆ ప్రతులను పెద్దపల్లి జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ మంత్రి, సీఎం కార్యాలయం కు కూడా పంపించినట్లు తెలిపారు