కలెక్టరేట్, మార్చి 5: ప్రజాపాలన దరఖాస్తులపై జిల్లాలో నిశిత పరిశీలన చేపడుతున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఏర్పాటు చేసిన సేవా కేంద్రాల్లో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం జరుగకుండా తగిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అర్హులకు అన్యాయం జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే సంబంధిత కేంద్రాల సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలనపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సబ్సిడీ, గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ అమలుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం సమష్టిగా చేస్తున్న కృషితో అర్హులకు సంక్షేమ ఫలాలు అందబోతున్నాయన్నారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఓటరు జాబితాల్లో లోటుపాట్ల సవరణ పూర్తయినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఓటరు జాబితాపై సంబంధితాధికారులతో కలిసి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటరు జాబితాల్లో జరిగిన పొరపాట్లపై కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో వచ్చిన పలు ఫిర్యాదుల మేరకు పకడ్బందీగా సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. సమీక్షలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి డిప్యూటీ సీఈవో హరిసింగ్‌తో పాటు అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీవో కే మహేశ్వర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వేసవి నేపథ్యంలో జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా జిల్లాలో తాగునీటి సమస్య, ప్రజాపాలన కేంద్రాల పనితీరు, ఈజీఎస్ కార్యక్రమాలపై సంబంధితాధికారులతో మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా అంశాలకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీపీవో రవీందర్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అంగవైకల్యంతో ఏపని చేయలేని దివ్యాంగులకు ఆర్థిక ఎదుగుదలతో జీవితంపై భరోసా లభిస్తుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళా సాధికారత పథకంలో భాగంగా యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో నగరానికి చెందిన తోట సుజాత అనే దివ్యాంగురాలికి మంజూరైన జిరాక్స్ యంత్రాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మెప్మా ఆధ్వర్యంలో ఆదర్శ సంఘం సభ్యురాలుగా కొనసాగుతున్న సుజాత, ఆత్మవిశ్వాసంతో జిరాక్స్ యంత్రం తీసుకోవడం ఆమె మొదటి విజయానికి నాంది అన్నారు. దివ్యాంగ మహిళల సాధికారత కోసం బ్యాంకర్లు మేము సైతం అంటూ ముందుకు రావడం సమాజంలో పెరుగుతున్న మానవతకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మెప్మా పీడీ రవీందర్, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, యూనియన్ బ్యాంకు ప్రాంతీయ అధికారి అపర్ణరెడ్డి పాల్గొన్నారు.