కమాన్‌చౌరస్తా, జనవరి 8: ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో రేకుర్తి, కేశవపట్నం, హుజూరాబాద్‌లో జరిగే జాతరకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకానున్నందున పక్కా ప్రణాళికతో పనులు చేపట్టాలని సూచించారు.
కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో జాతర ఏర్పాట్లపై సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతర ప్రాంతాల్లో తాగునీరు, టాయిలెట్, శానిటేషన్ తదితర సౌకర్యాలు కల్పించాని, క్యూలైన్ల కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలని, వేడుకల టైంలో కెనాల్లో స్నానాల కోసం నీటిని విడుదల చేయాలన్నారు.
గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, జిల్లా ఆబారి శాఖ అధికారి శ్రీనివాసరావు, మిషన్ భగీరథ సీఈ అమరేందర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రామ్‌కుమార్, అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న, డీఎంఅండ్‌హెచ్‌వో లలితాదేవి పాల్గొన్నారు.