వీణవంక, జనవరి 05 ఇసుక క్వారీల వద్ద ఇసుక లోడింగ్ చేసే సమయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని టీఎస్ఎండీసీ సిబ్బందిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. మండలంలోని చల్లూరు శివారులో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును, ఇసుక క్వారీలను కలెక్టర్, సీపీ గౌస్ ఆలం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇసుక లారీల లోడింగ్, వేబ్రిడ్జి పనితీరు, వేబిల్లు డీడీలు, రికార్డులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి క్వారీ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రతి లారీ ఇసుక లోడింగ్‌కు వచ్చే సమయంలో వెయిట్ చూడాలని, ఇసుక రవాణా చేసే ప్రతీ లారీ ఎంట్రీ, ఎగ్జిట్ వివరాలను సాండ్ ఆడిట్ యాప్‌లో కచ్చితంగా నమోదు చేయాలని కల్టెక్టర్, సీపీ సిబ్బందిక సూచించారు. రికార్డుల్లో ఎలాంటి తేడాలున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇసుకను తరలించే సమయంలో లారీ డ్రైవర్లు టార్పాలిన్ కవర్లను ఇసుకపై కప్పాలని వారు సూచించారు. కస్టమర్లు డీడీ చెల్లించిన ప్రకారం ఇసుక లోడింగ్ చేయాలని, ఎక్కడైనా తేడాలు వస్తే కేసులు నమోదు చేస్తామని కలెక్టర్, సీపీ స్పష్టం చేశారు.
రికార్డులు పరిశీలిస్తున్న కలెక్టర్, సీపీ
లోడింగ్ తూకం వేసే దృశ్యాలు రికార్డు అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని క్వారీ నిర్వాహకులకు సూచించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అక్రమ ఇసుక రవాణా, అక్రమ ఇసుక నిల్వలను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐసీఎస్ సోహాం సునీల్, హుజూరాబాద్ ఏసీపీ మాధవి, తహసీల్దార్ అనుపమరావు, టీఎస్ ఎండీసీ ప్రాజెక్ట్ అధికారి వినయ్ కుమార్, ఎస్ఐ ఆవుల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.