Sircilla| రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 17( నమస్తే తెలంగాణ) : దేవాలయం లాంటి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అబద్ధాలు మాట్లాడాలని, తమపై నిరాహారమైన ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు పార్టీ నేతలతో కలిసి గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు మాట్లాడారు. అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని, తమ కుటుంబానికి స్వాతంత్ర్యం రాక ముందు నుంచే భూములు ఉన్నాయని వివరించారు.1980 లోనే తమ నాన్న కు జీపు, కారు ఉన్నాయని, తాను కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడినేనని, కాంగ్రెస్ అంటే ఎంతో గౌరవం ఉన్నవాడినని చెప్పారు. ఎన్టీఆర్ మినహా అందరి ముఖ్యమంత్రులతో కలిసి పని చేసిన,సన్నిహితంగా ఉన్నామన్నారు. తన రాజకీయ చరిత్ర లో ఇంత దిగజారుడు ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. జూబ్లిహిల్స్ సొసైటీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి యువకుడని సఫోర్ట్ చేశానని, తన బిడ్డకు రూ.3 లక్షల గజం చొప్పున కొని, రూ.కోట్లు పెట్టీ ఇల్లు కట్టిస్తున్నావని, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ లోకి కేసీఆర్ పిలిస్తే, కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని, ప్రజలకి మేలు చేద్దామని బీఆర్ఎస్లో చేరానని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు, అధికారం వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో తన పాస్ బుక్ లో ఒక గుంట కూడా ఎక్కలేదని, ఎకరం కూడా పెరగలేదని స్పష్టం చేశారు. ఈ విషయం మీ కాంగ్రెస్ లో అయినా ఎవరిని అడిగిన చెప్తారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పేర్లు చదువుతుండగా పక్కన మంత్రి శ్రీధర్ బాబు సైతం పేపర్లు చూస్తున్నాడని, ఆయన కూడా చెప్పేటివి అబద్ధాలని తెలుసని పేర్కొన్నారు. అసెంబ్లీలో తమ పేర్లు చదివి ఆరోపించిన ఆరోపణలన్నీ ఆ వాస్తవమని దీని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తానని, అవసరమైతే పరువు నష్టం దావా వేసి కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. అదేవిధంగా సిరిసిల్లలో 8000 ఎకరాలు కబ్జా చేశారని, దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ పై రాజకీయంగా ఎదుర్కోవాలని, తమను పావులుగా వాడుకొని కేసీఆర్, కేటీఆర్‌ను బదనాం చేయడానికి చూస్తున్నారని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్లి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ అసెంబ్లీ లో రేవంత్ రెడ్డి సిరిసిల్ల లో 8 వేల ఎకరాలు బీఆర్ఎస్ నేతలకు కట్టబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారాని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎలాగూ సిరిసిల్లకు వస్తానంటున్న రేవంత్ రెడ్డి, ఎనిమిది వేల ఎకరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 8 వేల ఎకరాల్లో ఎంతమందికి ఇచ్చారని, పేర్లతో సహా అధికారులు తీసుకున్న వారి పేర్లను విడుదల చేయాలని అన్నారు. 8000 ఎకరాలు బీఆర్ఎస్ నేతలకు కట్టబెట్టినట్లు నిరూపిస్తే అంబేద్కర్ ఎదుట ముక్కు నెలకు రాస్తా అని, లేకుంటే సిరిసిల్ల వచ్చే ముందు సిరిసిల్ల అంబేద్కర్ ఎదుట రేవంత్ రెడ్డి ముక్కు నెలకు రాయాలని సవాల్ విసిరారు. 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు అనుగుణంగా అసైన్మెంట్ కమిటీ చైర్మన్‌గా భూమి లేని వాళ్లకు నిరుపేదలకు చట్టబద్ధంగా భూములు కేటాయించారని, అవన్నీ కలిపితే 1500 ఎకరాలు కూడా దాటవు, మరి 8000 వేల ఎకరాలు ఎక్కడివని ప్రశ్నించారు. అసెంబ్లీలో తాను కూడా కబ్జాలు చేసినట్టు రేవంత్ రెడ్డి పేర్లను చదివారని, తనకు 26 ఏళ్ల కిందట మాజీ నక్సలైట్ కింద, పునరావాసం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం మూడున్నర ఎకరాలు భూమి ఇచ్చిందని చెప్పారు.
పునరావసం కింద ఎల్లారెడ్డిపేటలోనే అప్పటి అధికారులు టెంట్ వేసి భూ పట్టాలను అందించారని గుర్తు చేశారు. 26 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినంక ఇక్కడ కొందరు చోటమోటా నాయకుల ఫిర్యాదు చేయించి, కక్ష సాధింపుగా అప్పటి కలెక్టర్ ను అడ్డం పెట్టుకొని ఇచ్చిన భూమిని లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ భూమిపై తన పై చేసిన ఆరోపణలు పై న్యాయస్థాన ఆశ్రయించి పోరాటం చేస్తానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా చౌకబారు ఆరోపణలు మానుకొవాలని హెచ్చరించారు. సిరిసిల్లకు వచ్చే ముందు 8 వేల ఎకరాలను బీఆర్ఎస్ నేతలకు కట్టబెట్టినట్టు నిరూపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ సవాల్ ను స్వీకరించి, సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం ఎదుట ముక్కు నేలకు రాయాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య, కుంభాల మల్లారెడ్డి, బొల్లి రామ్మోహన్, గుండ్లపల్లి పూర్ణచందర్, కౌన్సిలర్లు, బీఆర్ ఎస్ నేతలు ఉన్నారు.