నేతన్నకు చేతినిండా పని కల్పించాలన్న ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరెల ఆర్డర్లు ఇచ్చింది. ఏటా 350కోట్ల మేర ఆర్డర్లతో కార్మికులకు అన్నివిధాలా అండగా నిలిచింది. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లకు స్వస్తి పలికింది. దీంతో వస్త్ర పరిశ్రమ ఎనిమిది నెలలుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. నాడు ఉపాధి కోసం ఇక్కడికి వలసవచ్చిన కార్మికులతో కిటకిటలాడిన పరిశ్రమ.. నేడు స్థానిక కార్మికుల వలసలతో వెలవెలబోతున్నది. ఈ క్రమంలో పని లేక పస్తులుంటున్న నేతన్నలకు తమిళనాడు ప్రభుత్వం చీరెల ఆర్డర్లతో కాస్త ఊరట కలిగింది. ఈ పొంగల్ కానుకగా ఇచ్చే చీరెల తయారీతో సుమారు వెయ్యి మంది కార్మికులకు ఉపాధి లభించనున్నది.
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గత కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు కానుకలు ఇచ్చినట్టే.. తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి (పొంగల్)కి మహిళలకు చీరలు, పురుషులకు లుంగీలు పంపిణీ చేస్తున్నది. సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం, చీరల, లుంగీల తయారీ ఆర్డర్లను దాదాపు పదేళ్లుగా సిరిసిల్లకు ఇస్తూ వస్తున్నది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఇచ్చింది. దాదాపు 30లక్షల చీరెల తయారీకి రెండు నెలల క్రితమే ఆర్డర్లు ఇచ్చింది. ఆంధ్రాకు చెందిన వ్యాపారి రామారావు ఆర్డర్లు తీసుకుని ఇక్కడి కార్మికులు, ఆసాములకు ఉపాధి కల్పిస్తున్నారు.
దాదాపు వెయ్యి సాంచాలపై 5.50మీటర్లు ఉన్న చీరలు 150 రంగుల్లో తయారు చేస్తున్నారు. ప్రతిరోజూ 2లక్షల మీటర్ల వస్ర్తాలు తయారు చేస్తూ.. ఎప్పటికప్పుడు తమిళనాడుకు తరలిస్తున్నారు. అక్కడే ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ చీరెల తయారీతో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుండగా, ఈ ఆర్డర్లతో ఒక్కొక్కరికి 12వేల నుంచి 15వేల వరకు కూలీ వస్తున్నట్టు కార్మికులు తెలిపారు. ఉపాధిలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో పొంగల్ చీరలు అండగా నిలిచాయని చెబుతున్నారు.
కేసీఆర్ సర్కారే బాగుండె
కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడే సిరిసిల్లలో సాంచాలు మంచిగ నడిచినయ్. బతుకమ్మ చీరలే మాకు బతుకునిచ్చినయ్. చేతినిండా పనితో నెలకు మంచి కూలీ గిట్టుబాటయ్యింది. బట్టా పొట్టకు కొదువలేకుండే. సర్కారు పోయినంక బతుకుదెరువు భారమైంది. బతుకమ్మ చీరల ఆర్డర్లు రాక గోసపడుతున్నం. ఇప్పుడు ఆసాములు, సేట్లు అందరికీ పని లేకుండాపోయింది. పప్పులు, బియ్యం, కూరగాయలు కొనేందుకు ఇబ్బందిపడుతున్నాం. చిన్నప్పటి నుంచి సాంచాల పని జేసినోళ్లం. మరో పనిరాదాయే. కేసీఆర్ సార్ మళ్లీ వస్తనే మా బతుకులు బాగుపడతయి.
– వండ్లకొండ శ్రీనివాస్, మరమగ్గాల కార్మికుడు
సర్కారు మారింది.. మా బతుకులు ఆగమైనయ్
ఇన్నేళ్లు బతుకమ్మ చీరల పుణ్యమా.. అని చేతినిండా పని.. పనికి తగ్గట్టు కూలీ వచ్చేది. కేటీఆర్ సారు రకరకాల పథకాలు అమలుచేసి మాగోస తీర్చిండు. సర్కారు మారింది. మా బతుకులు ఆగమైనయ్.. బతుకమ్మ చీరలు బంద్ కావడంతో రోడ్డు మీద పడ్డం. ఇక్కడ పనిలేక చాలా మంది భీవండి బాట పడుతున్నరు. నెల రోజుల నుంచి తమిళనాడు చీరల ఆర్డర్లతో కాస్త ఉపాధి దొరికింది. మాకు శాశ్వత పరిష్కారం ఎవరు చూపిస్తలేరు. తమిళనాడులో సర్కారు చీరలు ఇచ్చినట్టే.. ఇక్కడ కూడా ఇయ్యాలె..
– సిరిసిల్ల శ్రీనివాస్, మరమగ్గాల కార్మికుడు