‘బీడీ, చేనేత కార్మికుల కష్టాలు, కన్నీళ్లు తెలుసు. నేను విద్యార్థిగా ఉన్న టైంలో చేనేత, బీడీ కార్మికుల ఇంట్లో కిరాయికి ఉండి చదువుకున్న. వాళ్ల బాధలు కండ్లారా చూసిన. అందుకే ఎవరూ అడగకున్నా నాకు నేనే బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన. ఇప్పుడు ప్రతి నెలా 2016 ఇస్తున్న. దేశంలో బీడీ కార్మికులు ఉన్న 19 రాష్ర్టాల్లో పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. అయితే వస్తున్న విజ్ఞప్తుల మేరకు ప్రావిడెంట్ ఫండ్‌తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ జీవనభృతి ఇస్తం.
వచ్చే మార్చి నుంచి 3016 అందిస్తం. ఆ తర్వాత 5వేలకు పెంచుతం’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. శుక్రవారం కోరుట్లలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు. నేతన్న సంక్షేమంపైనా మరింత దృష్టి పెడతామని, మరింత బడ్జెట్‌ను కేటాయించుకొని సిరిసిల్ల మాదిరి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పుట్టిన గడ్డకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన కల్వకుంట్ల సంజయ్‌ను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
– జగిత్యాల, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)
జగిత్యాల, నవంబర్ 3, (నమస్తే తెలంగాణ): ప్రావిడెంట్ ఫండ్‌తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ జీవనభృతిని ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కోరుట్ల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కోరుట్ల శివారులోని పెద్దగుండు వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు వేలాదిగా జనం తరలిరాగా, అశేష జనవాహినిగా సభాస్థలి మారిపోయింది. హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు.
తాను విద్యార్థిగా ఉన్న సమయంలో భార్య, భర్తలు చేనేత, బీడీ కార్మికులుగా ఉన్న వారి ఇంట్లో కిరాయికి ఉన్నానని, ఆ సమయంలో బీడీ కార్మికురాలు తనకు అన్నంపెట్టిందన్నారు. బీడీ, చేనేత కార్మికులుగా ఆ దంపతులు అనుభవించిన ఇబ్బందులు తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. తనను ఎవరూ అడుగకుండానే తనకు తానే నేనే బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చానన్నారు. గతంలో రాష్ర్టాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు తమాషాకు పెన్షన్లు ఇచ్చేవారన్నారు. 40 రూపాయల పెన్షన్, రూ.70, రూ.200 పింఛన్లు చూశామని, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతే వెయ్యి రూపాయల పింఛన్ చూసింది, సీఎం కేసీఆర్ హయాంలోనే అన్నారు. 2006 నుంచి కొంత కాలం కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశానని, ఆ సమయంలో బీడీ కార్మికులకు సంబంధించిన సమస్య తన దృష్టికి వచ్చిందన్నారు.
దేశంలో మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, బిహార్, తెలంగాణ ప్రాంతంతో సహా దేశంలో 19 రాష్ర్టాల్లో బీడీ కార్మికులు ఉన్నారన్న విషయం అర్థమైందన్నారు. అయితే ఏ రాష్ట్రంలోనూ అక్కడి ప్రభుత్వాలు బీడీ కార్మికులను ఆదుకునేందుకు, సాయం చేసేందుకు ముందుకు రాలేదన్నారు. ఈ విషయం తనను బాధించిందని, తెలంగాణ సాధన అనంతరం బీడీ కార్మికులను ఆదుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎవరూ కోరకుండానే బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల పింఛన్‌ను జీవనభృతి పేరిట మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో 4.50లక్షల మంది బీడీ కార్మికులకు, జగిత్యాల జిల్లా పరిధిలో లక్షకు పైగా కార్మికులకు పింఛన్లు ఇస్తున్నామన్నారు.
ఇంకా కొందరు బీడీ కార్మికులు పెన్షన్రాకుండా మిగిలిపోయి ఉన్నారని, వారికి సైతం పింఛన్ ఇవ్వాలని, నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, బీంగల్లో ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి, కోరుట్లలో డాక్టర్ సంజయ్ అడుగుతున్నారని, వారందరికీ సైతం మంజూరు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారం స్వీకరించిన తర్వాత, మార్చి 2024లో బీడీ కార్మికులకు పింఛన్ రూ.3016 అందజేస్తామన్నారు. తదుపరి క్రమంగా 5వేలకు చేరుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం లాగే 19 రాష్ర్టాల్లో ఏ ఒక్కరాష్ట్రం బీడీ కార్మికుల పెన్షన్ ఇవ్వడం లేదన్నారు.
సమైఖ్య రాష్ట్రంలో చేనేత కార్మికులు అనేక కష్టాలు పడ్డారన్నారు. సిరిసిల్లా, దుబ్బాక, భూధాన్ పోచంపల్లి లాంటి చోట్ల ఒకొక్క రోజు ఏడెనిమిది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ రోజులు ఉన్నాయన్నారు. భూదాన్ పోచంపల్లి గ్రామంలో ఒక్కరోజే ఏడుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకొంటే తాను స్వయంగా వెళ్లి ఆ కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయాలని అప్పటి ముఖ్యమంత్రికి చేతులు జోడించి విజ్ఞప్తి చేశానని, అయినా కరగలేదని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రం వచ్చాక చేనేత కార్మికులకు 50శాతంపై రంగులు, రసాయనాలు ఇస్తున్నామని, ఇంకా త్రిఫ్ట్ స్కీము తెచ్చామన్నారు. అయినా నాకు తృప్తి లేదన్నారు. సిరిసిల్లలో చేసినట్లుగా రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులందరికీ పనికల్పించాలని మంత్రి కేటీ రామారావుకు సైతం తాను చెప్పానని, ఎమ్మెల్సీ ఎల్.రమణకు సైతం చెబుతున్నానన్నారు. చేనేత కార్మికులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని, దీనికోసం మరింత బడ్జెట్‌ను కేటాయిస్తామన్నారు.
కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాలతో తనకు మొదటి నుంచీ అనుబంధం ఉందని, ఉద్యమకాలంలో సైతం మెట్పల్లి, కోరుట్ల ప్రాంతాల ప్రజలు సహకరించారన్నారు. బండలింగాపూర్ గ్రామంలో తాను స్వయంగా పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నానని, ఆ సమయంలో బండలింగాపూర్ చెరువును తిరిగి చూశానన్నారు. ఆ రోజు బండలింగాపూర్‌ను మండలం చేస్తానని హామీ ఇచ్చానన్నారు. గతేడాది డిసెంబర్లో జగిత్యాలకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఆ విషయాన్ని గుర్తు చేయడంతో బండలింగాపూర్‌ను మండలంగా ప్రకటించామని చెప్పారు.
ఇది ప్రజలకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఒకప్పుడు ఇక్కడ ఉన్న వరద కాలువ ఎలా ఉండేదో..? ఒక్కసారి గుర్తు చేసుకోవాలని, వరద కాలువకు తూము పెట్టాలంటే ప్రాజెక్టు కట్టినట్లు అయ్యేదన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరద కాలువకు తూము పెట్టడంతో ఇప్పుడు వరద కాలువ ఎలా మారిపోయిందో..? అందరు చూస్తున్నారన్నారు. మునుపు కాకతీయ కాలువపై రైతులు పంటల కోసం మోటర్లు పెడితే అధికారులు వచ్చి మోటర్లను కాలువలోకి నూకేసేవారని, ఇప్పుడు కాకతీయ కాలువలపై త్రీహెచ్పీ, ఫైవ్ హెచ్‌పీ మోటర్లు పెట్టినా అడిగే నా కొడుకు ఎవరైనా ఉన్నారా..? అంటూ ప్రజలను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
మునుపు సగం కరెంట్ పొద్దుగాల, సగం కరెంట్ రాత్రిల్లు ఇస్తే.. షాకులు కొట్టి చాలా మంది రైతులు సచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఈ రోజు 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నామన్నారు. ఒకటి కాదు, వ్యవసాయం, పరిశ్రమలు, ఇండ్లు ఏ విభాగమైన, ఏ రంగం వారికి అయినా 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. రైతుల కోసం, వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయడం కోసం అనేక చర్యలు తీసుకున్నామన్నారు. ఉచితంగా విద్యుత్, మిషన్ కాకతీయతో చెరువుల బాగు, రైతుబంధు, రైతుభీమా, సాగునీటి పథకాలు, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియను చేపట్టామన్నారు. అలాగే నీటి తీరువాను సైతం రద్దు చేశామన్నారు.
రైతులు దళారుల చేతి నుంచి విముక్తి కావాలన్న ఉద్దేశంతో ధరిణి పోర్టల్‌ను పెట్టి, దళారి రాజ్యాన్ని తొలగించామన్నారు. ధరిణి పోర్టల్ వల్లనే రైతుబంధు, ధాన్యం కొనుగోలు సవ్యంగా సాగుతున్నయని, కాంగ్రెస్ ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేయాలంటోంది..? వేద్దామా..? అంటూ సీఎం కేసీఆర్ ప్రజలను ప్రశ్నించారు. ప్రజలు ధరణి వద్దంటూ ముక్తకంఠంతో పేర్కొనడంతో విలేకరులు, మీడియా వాళ్లు ప్రజల అభిప్రాయాలను చూపించాలని సీఎం కేసీఆర్ కోరారు. ధరణి ఉండడం వల్లే రైతుబంధు వస్తుందని, సెల్‌ఫోన్‌కు టింగ్టింగ్ మంటూ రైతుబంధు మోగుతుందన్నారు. రాహుల్‌గాంధీ సైతం ధరణిని రద్దు చేయాలంటున్నారని, కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలన్నారు.
ధరణి పోర్టల్ రద్దు అంటే దళారి రాజ్యానికి అవకాశం ఇచ్చినట్లేనని, మూడు గంటల కరెంట్ చాలు అంటున్న కాంగ్రెస్ వైఖరిపై ప్రజలు గ్రామాల్లో చర్చపెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. కచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని, రైతుబంధు రూ.16వేలు అవుతుందన్నారు. 93లక్షల కుటుంబాలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు. కరెంట్ 24 గంటలు అవసరం లేదంటున్నారని, మూడు, ఐదు గంటల కరెంట్ చాలు అంటున్నారని, 24 గంటల కరెంట్ కావాలనే వారు చేతులు ఎత్తాలని సీఎం కేసీఆర్ కోరగా, ప్రజలు చేతులు ఎత్తగా, మీడియా ప్రజల మద్దతును ప్రపంచానికి చూపించాలని కోరారు.
ఇప్పటికే రెండు సార్లు రైతులకు రుణమాఫీ చేశామన్నారు. రెండో దఫాలో ఇంకా కొందరు రైతులకు రుణమాఫీ కాలేదని, త్వరలోనే మిగిలిన రుణమాఫీ అయిపోతుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మైనార్టీ వర్గాల ప్రజలు సైతం ఆలోచన చేయాలన్నారు. కోరుట్ల, మెట్పల్లిలో ఉన్న మైనార్టీలతో తనకు స్నేహం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడికి వచ్చిన సమయంలో ముస్లిం మైనార్టీలు తెలంగాణ ఉద్యమంలో ధర్మం ఉందని, విజయం సాధిస్తామని చెప్పారన్నారు. ‘దేర్ హై మగర్ అందేర్ నహీ’ అంటూ ఆత్మవిశ్వాసం కలిగించిన విషయం తనకు యాదికి ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, తొమ్మిదేండ్లలో మైనార్టీల కోసం రూ.900 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం రూ.12వేల కోట్లు వ్యయం చేసిందన్నారు. మైనార్టీల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ కాలేజీలు, స్కూల్స్ ఏర్పాటు చేశామని, అవి ఎంత మంచిగా పనిచేస్తున్నాయో చూడాలన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారం ఇవ్వాలని కోరుతుందని, వారి మాటలు వింటే తియ్యటి మాటలకు తిమ్మక్క తీర్థం పోదామంటే.. ‘నేను గుడిలో.. నువ్వు చలిలో’ అన్నట్లుగానే ఉంటుందన్నారు. కోరుట్ల నియోజకవర్గానికి ఇన్నాళ్లు ప్రాతినిధ్యం వహించిన విద్యాసాగర్‌రావు ప్రజాసంక్షేమం కోసం, కోరుట్ల మెట్పల్లి అభివృద్ధి, సంక్షేమం కోసం కష్టపడి పనిచేశారని, ఇప్పుడు ఆయన కొడుకు డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాడన్నారు.
డాక్టర్ సంజయ్ వైద్యుడిగా కోట్ల రూపాయల డబ్బును, పేరును సంపాదించుకునే అవకాశం ఉన్నా, పుట్టిన గడ్డకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చాడన్నారు. డాక్టర్ సంజయ్ మంచి వాడని, అభివృద్ధి, సంక్షేమం, ప్రజల మంచి గురించి తపించే వ్యక్తి అన్నారు. 2009లో తాను నిరాహారదీక్ష చేసిన సమయంలో తన వెంటనే ఉండి నిమిషం, నిమిషం తన ఆరోగ్యాన్ని కంటికిరెప్పలా కాపాడాడన్నారు. యువకుడు, విద్యావంతుడు, ప్రజాసంక్షేమం కోసం తపించే వ్యక్తి అయిన డాక్టర్ సంజయ్ తనకు బిడ్డలాంటి వాడని, అతడిని కోరుట్ల నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సభలో రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ స్పీకర్, మధుసూదనాచారి, బీఆర్ఎస్ నాయకుడు బొంతు రాంమోహన్, కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్లు అన్నం లావణ్య, రాణవేని సుజాత పాల్గొన్నారు.