ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచీ హుజూరాబాద్ గడ్డపై ఎనలేని ప్రేమను చూపుతున్నారు. రాష్ట్రం అవతరించిన తొమ్మిదేళ్లలో 1,980 కోట్ల నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ప్రగతినే కాదు, మరోవైపు సంక్షేమాన్ని గడపగడపకూ చేర్చారు. దేశానికి దిక్సూచిగా మారిన పథకాలకు ఇక్కడి నుంచే అంకురార్పణ చేశారు. 2018 మే 10న శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా రైతుబంధు, రైతుబీమాను ప్రారంభించారు. అవి రెండూ విజయవంతం కావడంతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపే బృహత్తర పథకం దళితబంధుకు కూడా ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. 2021 ఆగస్టు 16న ఈ పథకాన్ని ప్రారంభించి దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఆనాడు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, 18,021 కుటుంబాలకు శాశ్వత ఉపాధికి బాటలు వేశారు. మరోవైపు విద్యా వైద్యంపైనా ప్రత్యేక దృష్టి సారించి, సర్కారు పాఠశాలలు, దవాఖానలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు.
హుజూరాబాద్, మార్చి 20 : ఉమ్మడి రాష్ట్రంలో హుజూరాబాద్ నియోజకవర్గం అన్నింటా వెనుకబడింది. స్వరాష్టంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ప్రగతికి కేరాఫ్‌లా నిలుస్తున్నది. రాష్ట్రం వచ్చిన తొమ్మిదేళ్లలోనే 1,980 కోట్ల నిధులతో అభివృద్ధి పరుగులు పెట్టింది. ఉమ్మడి కరీంనగర్‌పై ఎనలేని ప్రేమను చూపిన సీఎం కేసీఆర్, ఈ హుజూరాబాద్ గడ్డ నుంచే పలు విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. ఏటా సీజన్ సమయంలో ఆగమవుతున్న రైతుకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు 2019 మే10న శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా రైతుబంధు, అలాగే రైతుబీమా పథకాలను ప్రారంభించారు. అవి ఇప్పుడు దేశానికే దిక్సూచిలా నిలుస్తుండగా, 2021 ఆగస్టు 16న అక్కడి నుంచే దళితబంధుకు అంకురార్పణ చేశారు. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసి, వందశాతం అమలు చేశారు. మరోవైపు రాష్ట్ర సర్కారు మిషన్ కాకతీయ కింద 120.03 కోట్లు ఖర్చుచేసి అనేక చెరువులు, కుంటలను పునరుద్ధరించింది. 365 కోట్లతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ రోడ్లను అభివృద్ధి చేసింది. 220 కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నది. విద్య, వైద్య రంగాలను కూడా సమూలంగా మార్చి ప్రజలకు చేరువ చేసింది. ఒక వైపు అభివృద్ధి పనులు చేపడుతూనే మరో వైపు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నది.
ప్రగతి బాటలో పల్లెలు
పల్లె ప్రగతి కార్యక్రమంతో నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. 12 కోట్లతో నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో వైకుంఠధామాల నిర్మాణం చేపట్టగా, 99 శాతం పూర్తయ్యాయి. 5 కోట్లతో సెగ్రిగేషన్ షెడ్లు, డంప్ యార్డులు ఏర్పాటు చేశారు. 12.60 కోట్లతో ప్రభుత్వం కొత్త జీపీ భవనాలు నిర్మించింది. రైతుల కోసం 5.06 కోట్లతో రైతు వేదికలు, 30 కోట్లతో కుల సంఘాలు, మహిళా సంఘాల భవనాలు, క్రీడా ప్రాంగణాలు, కల్వర్టులు నిర్మించింది. 32 కోట్లతో ఇతర అభివృద్ధి పనులు చేపట్టింది. అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట రామాలయానికి 2 కోట్లు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపట్టింది.
34 కోట్లతో వంతెనల నిర్మాణం
హుజూరాబాద్ సమీపంలో ఇప్పల్ నర్సింగాపూర్ వెళ్లేదారిలో చిలుకవాగుపై 3.5 కోట్లు, నడిగూడ, శంభునిపల్లి మధ్యలో కమలాపూర్, వంగపల్లి, అంబాల వద్ద గల వాగులపై 15 కోట్లతో, వీణవంక, రామకృష్ణాపూర్ గ్రామాల మధ్య 6 కోట్లతో, వీణవంక, బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య 2 కోట్లతో వంతెనలు నిర్మించారు. వీణవంక, కనపర్తి మధ్య 2.5 కోట్లతో, కనపర్తి, బేతిగల్ మధ్య 2 కోట్లతో మరిన్ని వంతెనలు నిర్మించనున్నారు.
ఇంటింటికీ సంక్షేమ ఫలాలు
నియోజకవర్గంలో ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలను ఇంటింటికీ అందిస్తోంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఏడు వేలకు పైగా మందికి 63.10 కోట్ల లబ్ధి చేకూరింది. గొల్ల, కుర్మల కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం 8,700 గొర్రెల యూనిట్లు అందించింది. ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీ ద్వారా 52 కోట్లు ఇచ్చింది. ఆసరా పింఛన్ల కింద 39,295 మందికి ప్రతి నెలా 8.65 కోట్లు ఇస్తున్నది. 61,538 మంది రైతులకు రైతుబంధు ద్వారా ప్రతి పసలుకు 57.65 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్నది. ఇప్పటి వరకు వివిధ కారణాలతో 81 మంది రైతులు చనిపోగా వారి కుటుంబాలకు రైతు బీమా ద్వారా 4.05 కోట్ల పరిహారం అందించింది.
తీరిన సాగు నీటి సమస్య
మిషన్ కాకతీయ పథకం ద్వారా 71 కోట్లతో దాదాపు 150 చెరువులు, కుంటల కట్టలకు మరమ్మతులు, చేయడంతో పాటు ఫీడర్ చానళ్లు, మత్తళ్లు నిర్మించారు. మానేరు, చిలుక, వీణవంక, కమలాపూర్, అంబాల వాగులపై పలు చోట్ల 30 కోట్లతో చెక్‌డ్యాంలు నిర్మించడంతో నీటి వృధాకు అడ్డుకట్ట పడడమే కాకుండా, ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. శిథిలావస్థలో ఉన్న కాకతీయ కాలువ లైనింగ్, కాలువ కట్టల మరమ్మతు కోసం 121 కోట్లు ఖర్చుపెట్టడంతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందుతున్నాయి. నీటి కొరత తీరడంతో నియోజకవర్గం సస్యశ్యామలమైంది.
మున్సిపాలిటీలకు నిధులు
ఉమ్మడి రాష్ట్రంలో నియోజకవర్గ కేంద్రమైన హుజూరాబాద్, వ్యాపార కేంద్రమైన జమ్మికుంట నగర పంచాయతీలుగా ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రెండు మున్సిపాలిటీలుగా ఏర్పడడంతో పాటు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. హుజూరాబాద్‌లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, మిషన్ భగీరథ, సెంట్రల్ లైటింగ్, ఇతర పనులకోసం 272 కోట్ల నిధులను ప్రభుత్వం ఖర్చు చేసింది. పట్టణంలో 3 కోట్లతో మోడల్ శ్మశాన వాటికను ప్రభుత్వం నిర్మించింది. జమ్మికుంటలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, మిషన్ భగీరథ, సెంట్రల్ లైటింగ్, ఇతర పనులకోసం 302 కోట్ల నిధులను వెచ్చించింది. పట్టణంలో 1.5 కోట్లతో ఉద్యానవనాన్ని తలపించే విధంగా శ్మశాన వాటికను నిర్మించింది.
Mulugu
జాతీయ రహదారుల్లా రోడ్లు
స్వరాష్ట్రంలో హుజూరాబాద్-జమ్మికుంట రోడ్డుకు 40 కోట్లు, హుజూరాబాద్-పరకాల రోడ్డుకు 100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం నాలుగు లేన్ల రహదారులుగా విస్తరించింది. జమ్మికుంట-పచ్చునూరు, జమ్మికుంట-కమలాపూర్, జమ్మికుంట-వావిలాల రోడ్లను 145 కోట్లు వెచ్చించించి డబుల్ రోడ్లుగా మార్చేసింది. హుజూరాబాద్ నుంచి సిర్సపల్లి మీదుగా ఆముదాలపల్లి వరకు గతంలో రోడ్లు సరిగ్గా లేక ప్రజలు నానా ఇబ్బందులు పడేవాళ్లు. కేసీ క్యాంపు నుంచి ములుకనూరు రహదారి బీటలు వారి ఉండేది. మొలంగూర్ నుంచి వీణవంక వరకు ఉన్న సింగిల్ రోడ్డుపై ప్రయాణం అంటేనే ప్రజలు జంకేవాళ్లు. 50 కోట్లు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం వీటి స్వరూపాన్నే మార్చేసింది. ఇతర ఆర్అండ్బీ, పీఆర్ రోడ్ల కోసం 30 కోట్లు ఖర్చుపెట్టింది. ఇటీవల పలు ఆర్అండ్బీ, పీఆర్ రోడ్ల కోసం మరో 20.5 కోట్లు ప్రభుత్వం కేటాయించగా టెండర్ దశలో ఉన్నాయి.
దళిత బంధు సక్సెస్
సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించిన తర్వాత పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. 2021 ఆగస్టు 16న ఈ పథకాన్ని శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ప్రారంభించారు. ఇక్కడి 18,021 దళిత కుటుంబాలకు 1,784.79 కోట్లు వెచ్చించి ఉపాధి చూపారు. ఈ పథకం కింద ఇల్లందకుంటలో 2,116, హుజూరాబాద్ మండలంలో 2,720, హుజూరాబాద్ మున్సిపాలిటీలో 1,623, జమ్మికుంట మండలంలో 2,358, జమ్మికుంట మున్సిపాలిటీలో 2,264, వీణవంకలో 3,009, కమలాపూర్‌లో 3,931 మందికి 9.90 లక్షల చొప్పున ఆర్థికసాయం అందింది. ఈ పథకంతో వేలాది దళిత కుటుంబాలు ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నాయి.
అనిల్‌కు మరో బేకరీ వచ్చేసింది
ఇదిగో ఈ బేకరీ కౌంటర్‌పై ఎంతో హుందాగా కనిపిస్తున్న ఈ కుర్రాడి పేరు బైరిమల్ల అనిల్. ఇల్లందకుంట మండలం బూజునూర్కు చెందిన అనిల్ జమ్మికుంటలోని పలు బేకరీల్లో నెలకు 12 వేల జీతంతో బతికేవాడు. తన చిన్నతనం నుంచి బేకరీల్లోనే జీతం ఉంటూ వచ్చిన అనిల్‌కు తన పెద్దక్క ఇదే పట్టణంలోని కొత్తపల్లి ఏరియాలో ఒక బేకరీ పెట్టించింది. పది నెలల కింద దళిత బంధు పథకం ఆఫర్ రావడంతో తన తల్లి శారద పేరిట మొదటి విడుతలో 5 లక్షలు మంజూరయ్యాయి. ఇప్పటికే బేకరీలో అనుభవం ఉండి, మంచి ఆదాయం వస్తుండడంతో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయంతో ఇదే జమ్మికుంటలోని కొండూరి కాంప్లెక్స్‌లో మరో బేకరీ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు రెండు బేకరీలను నిర్వహించుకుంటున్న అనిల్ తన లాంటి మరో నలుగురు కుర్రాళ్లకు ఉపాధి కల్పిస్తున్నాడు. బాయ్స్ వేతనాలు, ఖర్చులు పోను ఒక్కో బేకరీపై తనకు నెలకు 20 వేల దాకా మిగులుతున్నాయని అనిల్ ఎంతో సంతోషంగా చెబుతున్నాడు. నిరుద్యోగులెందరికో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం మార్గదర్శిగా నిలిచిందని చెప్పడానికి అనిలే మంచి ఉదాహరణ.
మెరుగైన వైద్య సేవలు
హుజూరాబాద్‌లో శిథిలావస్థకు చేరుకున్న దవాఖాన భవనాన్ని కూల్చి అదేస్థానంలో 5 కోట్లతో సకల సదుపాయాలతో కొత్త భవనం నిర్మించి 30 పడకల నుంచి 100 పడకల దవాఖానగా మార్చారు. 6 కోట్లతో జమ్మికుంట, కమలాపూర్‌లో 30 పడకల దవాఖానలను అభివృద్ధి చేశారు. వీణవంక మండల కేంద్రంలో 30 లక్షలతో పీహెచ్సీ నిర్మించారు. చెల్పూర్, చల్లూర్ వంటి పీహెచ్‌సీల్లో సౌకర్యాలు మెరుగు పర్చారు. హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయి. హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్‌లో దవాఖానల్లో కలిపి నిత్యం 15కి మించి ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రతి మండలంలో ఒక 108 అంబులెన్స్ ఉండగా, హుజూరాబాద్ దవాఖానలో అదనంగా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా పల్లె దవాఖానలతో మెరుగైన సేవలు అందుతున్నాయి.
ప్రైవేట్ టీచర్‌కు కలిసి వచ్చిన లక్కు
నెలకు ఐదారు వేలకు ప్రైవేట్ స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్ మారముల్ల తిరుపతి ఇప్పుడు దళిత బంధు ఇచ్చిన ఆసరాతో ప్రతి నెలా 50 వేలకు పైగనే సంపాదిస్తున్నాడు. దళిత బంధు కింద గతేడాది ఏప్రిల్‌లో అందిన 5 లక్షల ఆర్థిక సాయంతో జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల ఏరియాలో భాగ్యలక్ష్మి సూపర్ బజార్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. మంచి ఏరియా కావడంతో గిరాకీ కూడా బాగానే అవుతోంది అనుకునే సమయంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు సోషల్ వెల్ఫేర్ అధికారులు స్థానికంగా ఉన్న ఒక రెసిడెన్షియల్ స్కూల్‌కు ఫుడ్ ప్రొవిజన్స్ కాంట్రాక్టు అప్పగించారు. అప్పటి నుంచి తిరుపతికి మరింత లక్కు కలిసి వచ్చింది. ఇటు సూపర్ బజార్ ద్వారా 20 వేలు, రెసిడెన్షియల్ స్కూల్‌కు ఆహార పదార్ధాలు సరఫరా చేయడం ద్వారా మరో 30 వేల చొప్పున నెలకు 50 దాకా సంపాదించుకుంటున్నానని తిరుపతి ఎంతో ధీమాగా చెబుతున్నాడు. తన జీవితంలో ఇదంతా మిరాకిల్‌గా జరిగిపోయిందని, ఇలాంటి గొప్ప మార్పు వస్తుందని తానెన్నడూ ఊహించ లేదని సంతోషపడుతున్నాడు. దళిత బంధు ఇచ్చిన భరోసాతో తన పిల్లలను గొప్ప చదువులు చదివిస్తానని ధైర్యంగా చెబుతున్నాడు.
విద్యకు అత్యంత ప్రాధాన్యత
నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కమలాపూర్‌లో 40 కోట్లతో ఎంజేపీ (బాలుర, బాలికలు) గురుకుల పాఠశాలకు అధునాతన భవనాలు నిర్మించింది. 8 కోట్లతో ప్రభుత్వ కళాశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనాలు నిర్మించింది. హుజూరాబాద్‌లో 2 కోట్లతో డిగ్రీ కళాశాల, 3.35 కోట్లతో ఇల్లందకుంటలో కస్తూర్బా గాంధీ విద్యాలయ భవనాన్ని పూర్తి చేసింది. 3 కోట్లతో జమ్మికుంటలో డిగ్రీ కళాశాల, 1.50 కోట్లతో ప్రభుత్వ పాఠశాల నిర్మించింది. ‘మన ఊరు – మన బడి, మన బస్తీ-మన బడి’ కింద ఇల్లందకుంట మండలంలోని 18 పాఠశాలలకు 2.35 కోట్లు, వీణవంకలోని 18 పాఠశాలల కోసం 2.75 కోట్లు, హుజూరాబాద్‌లోని 8 పాఠశాలలకు 80 లక్షలు, జమ్మికుంటలోని 12 పాఠశాలలకు 90 లక్షలు, కమలాపూర్‌లోని 14 పాఠశాలలకు 1 20 కోట్లు మంజూరు చేశారు. ఈ పాఠశాలల అభివృద్ధి పనులు శరవేగంగా నడుస్తున్నాయి.
విద్యుత్తు రంగంలో ప్రగతి
విద్యుత్‌ను మెరుగు పర్చడంలో భాగంగా హుజూరాబాద్ మండలం పెద్ద పాపయయ్యపల్లి, కందుగుల, జమ్మికుంట, వీణవంకలో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే, కేసీ క్యాంపులో 220/132 కేవీ ఉప కేంద్రం ఏర్పాటు చేయడంతో నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు పరిష్కారమయ్యాయి. గతంలో వ్యవసాయానికి కేవలం 7 గంటలే ఇచ్చారు. ఇందులోనూ లోవోల్టేజీ సమస్యలతో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు పదేపదే కాలిపోయేవి. ఇప్పుడు వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
సైదాపూర్ అభివృద్ధి
ఎలాబోతరం నుంచి అమ్మనగుర్తి వరకు 5 కోట్ల 27 లక్షలతో బీటీ రోడ్డు, సైదాపూర్ నుంచి ఘనపూర్ వరకు 5 కోట్ల 44లక్షలతో బీటీ రోడ్డు, సోమారం నుంచి సైదాపూర్ వరకు 2.40 కోట్లతో బీటీ రోడ్డు, ఆరెపల్లి క్రాస్ ఆరెపల్లి గ్రామం వరకు 1.20 కోట్లతో బీటీ రోడ్డు నిర్మించారు.
15 కోట్లతో 84 చెరువులను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేశారు.
11 కోట్లతో పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగుకాలువలు నిర్మించారు.
సైదాపూర్ మండలంలో మొత్తం ఆసరా పింఛన్లు 3,005 ఉండగా, ప్రతి నెలా కోటీ 59 లక్షలు ఇస్తున్నారు. 13,161 మంది రైతులకు ప్రతి పసలుకు 13 కోట్ల11 లక్షల పెట్టుబడి సాయం అందుతున్నది. 23 బాధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రైతు బీమా అందింది.
ప్రతి ఒక్కరూ సంతోషిస్తున్నరు
ప్రత్యేక రాష్ట్రంలో మన నిధులు మనమే ఖర్చు పెట్టుకుంటున్నాం కనుకే ఎనలేని అభివృద్ధి జరిగింది. జరుగుతున్నది. గతంలో ఇక్కడి నుంచి వచ్చే రాబడి వేరే ప్రాంతాలకు వెళ్లడంతో అభివృద్ధి కుంటుపడింది. రోడ్ల నిర్మాణం, చెరువులకు మహర్దశ, దవాఖానల నిర్మాణం ఇలా అన్ని రంగాల్ల్లో ప్రస్తుతం అభివృద్ధి జరిగినట్లు కంటికి కనిసిస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక పోతే తెలంగాణ సొమ్ము ఇప్పటికీ ఆంధ్రోళ్లు దోచుకునేటోళ్లు. రైతులకు 24 గంటల కరెంట్, కాళేశ్వరంతో సాగునీరు కేవలం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంతోనే సాధ్యమైందనేది వాస్తవం. ఏన్నో ఏండ్ల సమస్యలు పరిష్కారమయ్యాయి. ఇందుకు ప్రతి ఒక్కరూ సంతోషిస్తున్నరు.
– బెల్లి రాజయ్య రిటైర్డ్ టీచర్ (కందుగుల)
రైతుల పాలిట దేవుడు
సీఎం కేసీఆర్ సారు రైతుల పాలిట దేవుడు. ఆయన చేయవట్టే రైతులు రందీ లేకుంట ఉన్నరు. తెలంగాణ రాక ముందు ఎవుసం చేద్దామంటే దుఃఖమచ్చేది. రాష్ట్రమచ్చినంక రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నరు. కేసీఆర్ సర్కారుతోని చానా మేలు జరుగుతంది. పొద్దంతా కరెంటు, అప్పు మాఫీ, పుష్కలంగా నీళ్లు, పంటకు పెట్టువడి.. ఇంకేంగావాలె ఎవుసం చేసెటోనికి. రైతుబంధు పైసలతోని ఎరువులు, ఇత్తనాలు కొన్కుక్కుంటున్నం. కడమ పైసలు కూలీలకు అక్కరైతన్నయ్. మళ్లోసారీ ఈ సర్కారే రావల్నని రైతులందరూ కోరుకుంటన్రు.
– పుట్టపాక కొంరయ్య, ఇప్పల్ నర్సింగాపూర్ రైతు
అంతా కండ్ల ముందటనే కనవడ్తంది
తెలంగాణ రాకముందు మా మండలం అధ్వాన్నం. తెలంగాణ వచ్చిన 8 ఏండ్లళ్ల 50 ఏండ్ల పనులు కనవడ్తన్నయ్. గతంల సరైన రోడ్లు లేవు.. మంచినీళ్లు లేవు.. ఎన్కట కట్టిన బడి, కిరాయి ఇంట్ల దవాఖాన.. పాణం మంచిగ లేక దవాఖానకువోతే నలుగురు కూసోనీకి జాగ ఉండేదిగాదు. ఒకలిద్దరే సిబ్బంది ఉండేది. వానకాలమస్తే రామకృష్ణాపూర్, బ్రాహ్మణపల్లికి పోయెతానికి వాగు తగ్గక వారం పట్టేది. మట్టి రోడ్లతో వానకాలం బురద, ఎండకాలం దుమ్ముతోని నానా అవస్థలు పడెటోళ్లం. ఎండ కాలం తాగడానికి మంచి నీళ్లు లేక గోసగోసుండేది. తెలంగాణ వచ్చినంక మా కష్టాలన్నీ తీరినయ్. సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీలు, తాగడానికి మిషన్ భగీరథ నీళ్లు, చెక్ డ్యాంలతోని ఎవుసానికి నీళ్లు, కోట్ల రూపాలతోని బడి, దవాఖాన్ల బిల్డింగ్లు అయినయ్. నా అనుభవంల ఒక 50 ఏండ్ల అభివృద్ధి ఈ 8 ఏండ్లలోనే జరిగింది. అంతా కండ్ల ముందటనే కనవడ్తంది.
– ఆనందం రాజమల్లు, వీణవంక