పెద్దపల్లి, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ) : కేరళలోని శబరిమలకు రైల్వేశాఖ అధికారులు రెండు ప్రత్యేక రైళ్లను కేటాయించారు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లను కేటాయించిన రైల్వే శాఖ, ఉత్తర తెలంగాణపై వివక్ష చూపుతున్నదని పేర్కొంటూ ‘శబరిమలకు ప్రత్యేక రైళ్లేవి?’ శీర్షికన గత నెల 30న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితం కాగా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. రెండు రైళ్ల ను కేటాయిస్తున్నామని, ఈ నెల 13, 24 తేదీల్లో నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ శ్రీధర్ ఈ నెల 2న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెండు రైళ్లకు పెద్దపల్లి రైల్వే జంక్షన్లో హాల్టింగ్ కల్పించారు.
కాగా, ఈ నెల 13న ఉదయం 10 గంటలకు సిర్పూర్ కాగజ్ నగ ర్ నుంచి కొల్లాంకు రైలు (నంబర్ 07117) బయలుదేరనున్నది. బెల్లంపల్లి, మంచిర్యాల మీదుగా రామగుండం, పెద్దపల్లి జంక్షన్, జమ్మికుంట, వరంగల్, విజయవాడ, గూడూరు, తిరుపతి, కాట్పాడి, ఈరోడ్, కోయంబత్తూర్, పాలకాడ్, ఏర్నాకుళం, కొట్టాయం మీదుగా కొల్లాంకు మరుసటి రోజురాత్రి 7గంటలకు చేరుకోనున్నది. మరో రైలు ఈ నెల 24న తెల్లవారుజామున 4:25 గంటలకు నాందేడ్ నుంచి బయలు దేరి నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్ మీదుగా శబరిమలకు చేరుకోనున్నది. ఈ రెండు ప్రత్యేక రైళ్లతో ఉత్తర తెలంగాణ ప్రాంత అయ్యప్ప స్వాములకు ప్రయాణం సులభతరం కానుండగా, స్వాములు నమస్తే తెలంగాణ పత్రికకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.