న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరికొన్ని గంటల్లో న్యూఢిల్లీ చేరుకోనున్నారు. భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పర్యటన చోటుచేసుకోవడం గమనార్హం. 2021లో పుతిన్ చివరిసారి ఇండియాను విజిట్ చేశారు. పుతిన్ రాక సందర్భంగా రక్షణ, అంతరిక్ష, ఆర్థిక రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారం జరగనున్నది. సుమారు 100 బిలియన్ల వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
డిఫెన్స్ రంగం అత్యంత కీలకంగా మారనున్నది. సుఖోయ్-57( Sukhoi Su-57) యుద్ధ విమానం ఉత్పత్తిపై రెండు దేశాల ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. సంయుక్తంగా ఆ యుద్ధ విమానాన్ని ఉత్పత్తి చేసే అవకాశాలుఉన్నాయి. పుతిన్ ఎజెండాలో ఈ అంశమే టాప్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. నేవీ, ఎయిర్, మిస్సైల్ రంగాల్లో సైనిక సహకారం, టెక్నాలజీ బదిలీ చర్చించనున్నారు. ఇవాళ రాత్రికి ప్రధాని మోదీతో కలిసి పుతిన్ డిన్నర్ చేయనున్నారు. రష్యా దిగువ సభ దుమా కూడా సైనిక ఒప్పందానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గతంలోనూ రష్యా డిఫెన్స్ కంపెనీలతో కలిసి భారత కంపెనీలు పని చేశాయి. ఫిఫ్త్ జనరేషన్ సుఖోయ్-57 యుద్ధ విమానాల ఉత్పత్తిపై కీలక ఒప్పందం జరిగే అవకాశం ఉన్నట్లు రష్యా అంబాసిడర్ డెన్నిస్ అలిపోవ్ తెలిపారు.
అంతరిక్ష రంగంలోనూ రష్యా సహకారాన్ని భారత్ తీసుకోనున్నది. రాకెట్ల ఇంజిన్ నిర్మాణం, రాకెట్ ఫ్యూయల్, పైలట్ స్పేస్ఫ్లయిట్, ఆర్బిటాస్ స్టేషన్స్ అంశంలోనూ రష్యా అంతరిక్ష సంస్థ రాస్కోస్మాస్ నుంచి ఇండియా డీల్ కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. 1960 నుంచే ఢిల్లీ, మాస్కో మధ్య స్పేస్ రంగంలో రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే. భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని విస్తరించాలని పుతిన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ పేమెంట్ సిస్టమ్స్‌ను లింక్ చేసేందుకు ప్లాన్ చేశారు. మిర్, రూపే సిస్టమ్స్‌ను మిళితం చేయనున్నారు. రష్యాకు చెందిన ఎస్బీపీ తో పాటు భారత్‌కు చెందిన యూపీఐ పేమెంట్ వ్యవస్థలు ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు దేశాలు రూపీ, రుబల్తో వాణిజ్యం చేస్తున్నాయి.