మెట్పల్లి టౌన్, డిసెంబర్ 3 : ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌కు ఎలాంటి సోయిలేదని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు, రైతులకు ఎలాంటి మేలు జరగలేదని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విమర్శించారు. బీఆర్ఎస్తోనే అభివద్ధి, సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు. కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటున్నది గులాబీ పార్టేనని చెప్పారు. మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం కొండ్రికర్ల గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్‌తో పాటు బ్తెరా హరీశ్ బీజేపీ నుంచి సొంత గూటికి చేరగా, ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్లతో కలిసి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచామని గర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పాలనలో రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మాట్లాడుతూ, కాంగ్రెస్ దొంగ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ దొంగ మాటలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అభివృద్ధి జరగాలన్నా.. సంక్షేమం అందాలన్నా బీఆర్ఎస్తోనే సాధ్యమనే విషయం ప్రజలకు తెలిసిపోయిందని చెప్పారు. పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని, బీఆర్ఎస్ మద్దతుదారులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు గడ్డం రాజరెడ్డి, మెండే రమేశ్, గడ్డం నర్సయ్య, గంట మల్లేశ్, బద్దం రత్నాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.