Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. పొద్దంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరలో కొనుగోళ్లతో లాభాల్లోకి దూసుకెళ్లాయి. గ్లోబల్ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, రికార్డు స్థాయిలో రూపాయి పతనం నేపథ్యంలో దేశీయ మార్కెట్లు ఉదయం నష్టాల్లో మొదలయ్యాయి. కొద్దిసేపటి తర్వాత మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లగా.. అమ్మకాలతో ఒత్తిడికి గురయ్యాయి. చివరి సెషన్లో కొనుగోళ్లతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి.
ఇంట్రాడేలో 84,949.98 పాయింట్ల కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. గరిష్టంగా 85,487.21 పాయింట్లకు పెరిగింది. చివరకు 158.51 పాయింట్లు పెరిగి.. 85,265.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 47.75 పాయింట్లు పెరిగి 26,033.75 వద్ద స్థిరపడింది. దాదాపు 1,716 షేర్లు లాభపడగా.. మరో 2,237 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో అత్యధికంగా టీసీఎస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, భారత్ ఎలక్ట్రికల్, ట్రెంట్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ లాభపడగా.. మారుతి సుజుకీ, ఎటర్నల్, కొటక్ మహీంద్రా, కొటక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, ఐసీఐసీ బ్యాంక్, ఎస్బీఐ, టాటా స్టీల్ నష్టాల్లో ముగిశాయి.