CITU | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 22 : మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, ఎనిమిది గంటల పనివేళలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షల ఎక్స్గ్రేషియా, పదవీ విరమణ పొందిన వారికి రూ.30 వేల పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో విధులు నిర్వహిస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, కార్మికులపై పనిభారం తగ్గించాలని సూచించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు పట్టణాల పరిశుభ్రతకు కీలకంగా పనిచేస్తున్నప్పటికీ సరైన వేతనాలు, సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సీఐటీయూ నాయకులు కోడం రమణ, ఎగమంటే ఎల్లారెడ్డి, అన్నదాస్ గణేష్, మున్సిపల్ కార్మికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.