beedi workers | కోరుట్ల, ఆగస్టు 20: బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు అన్నారు. బుధవారం పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ అందించేందుకు ఆన్లైన్ ద్వారా కేంద్ర బీడీ కార్మిక సంక్షేమ బోర్డు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలల క్రితం పిఎఫ్ పొందిన బీడీ కార్మికురాలు వార్షిక ఆదాయం రూ. లక్ష 20 వేలు కలిగి ఉండాలన్నారు.
ఒకటవ తరగతి నుంచి నాలుగవ తరగతి చదివే పిల్లలకు వెయ్యి రూపాయలు, ఐదు 8వ తరగతి వరకు పదిహేను వందలు, 9 నుంచి 10 వరకు రూ.2000 వేలు, టర్మీడియట్ విద్యార్థులకు రూ.3000, డిగ్రీ పీజీ డిప్లొమా కోర్సులకు రూ. 6000, ఐటిఐ పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 8000, ప్రొఫెషనల్ డిగ్రీ చదివే విద్యార్థులకు రూ. 25000 వేల రూపాయల స్కాలర్ షిప్ అందుతుందన్నారు.
ఒకటి నుంచి పది తరగతి చదివే విద్యార్థులు ఆగస్టు 31 లోపు దరఖాస్తులు చేసుకోవాలని, ఇంటర్ ఆపై చదివే విద్యార్థులు అక్టోబర్ 31 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఈ ఉపకార వేతనం కోసం ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. సమావేశంలో బీడీ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.