చేతికి వచ్చిన పంట రాళ్లపాలైంది. కోతకచ్చిన పొలంలోనే నేలవాలింది. మామిడి దెబ్బతిన్నది. రైతుల శ్రమంతా నీళ్లపాలైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే దయనీయ పరిస్థితి. అకాల వర్షాలు, వడగండ్లు రైతన్నకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఇప్పటికే నాలుగు సార్లు ప్రతాపం చూపి కోలుకోకుండా చేశాయి. ప్రకృతి ప్రకోపానికి కకావికలమైన రైతాంగాన్ని ఆదుకునేందుకు ముందుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. ఇప్పటికే మార్చిలో జరిగిన నష్టానికి సంబంధించిన పరిహారం నిధులు విడుదల చేసింది. ఈ నెలలో జరిగిన నష్టంపై అధికార యంత్రాంగం ప్రాథమిక అంచనా వేసింది. శర వేగంగా పూర్తి స్థాయి సర్వే చేపట్టిన వ్యవసాయ శాఖ త్వరలోనే ప్రభుత్వానికి నివేదికలు పంపించే పనిలో ఉన్నది. కాగా, బాధిత రైతులను ఆదుకుంటామని మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ధైర్యం చెప్పారు. ఇటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భరోసా కల్పిస్తున్నారు.
– కరీంనగర్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ)
కౌలు, పెట్టువళ్లు మీదవడ్డయ్..
నాకు సొంతంగా ఐదెకరాల భూమి ఉన్నది. ఇంకో 25 ఎకరాలు కౌలుకు పట్టుకుని ఎవుసం చేస్తున్న. ఒక్క రెండెకరాలు కోసుకున్న. మొత్తం 28 ఎకరాలు నాశనం పదారువాళ్లయ్యింది. ఎట్ల బతుకుడో అర్థమైతలేదు. ఎకురానికి రూ.12 వేలు కౌలు గట్టిన. రెండు లచ్చల యాభైవేల దాకా పెట్టువళ్లు అయినయ్. అన్ని మీద వడ్డయి. మళ్ల పంటలు ఎప్పుడు వండాలె. మా అప్పులు ఎప్పుడు తీరాలె. గౌవుర్నమెంటే ఆదుకోవాలె (అని విలపించాడు)
– పూరెళ్ల లక్ష్మయ్య, తాహెర్ కొండాపూర్ రైతు
గతంలో ఎన్నడూ కనీవినని రీతిలో జిల్లాలో రాళ్లవాన పడుతున్నది. మార్చిలో మొదలైన ప్రకృతి ప్రకోపం ఇప్పటి వరకు చల్లార లేదు. ఇప్పటికే నాలుగుసార్లు పడడంతో రైతన్నకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు ధైర్యం చెబుతున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలో మార్చి 17న కురిసిన రాళ్ల వానతో రామడుగు, చొప్పదండి, గంగాధర, కరీంనగర్ రూరల్, వీణవంక తదితర మండలాల్లో ఎక్కువ నష్టం జరిగింది. మార్చి 23న సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎకరానికి రూ. 10 వేల పరిహారం చెల్లిస్తామని ప్రకటించి వెళ్లిన రెండు రోజులకే అదే నెల 25న మళ్లీ వడగండ్లు కురిశాయి. ఫలితంగా జిల్లాలో 9,445 మంది రైతులకు చెందిన 8,116.11 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో ఎక్కువగా వరి పంటనే దెబ్బతిన్నది. కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగానే ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.8.16 కోట్ల పరిహారాన్ని విడుదల చేశారు. ఈ నెలలోనూ అకాల వర్షం, వడగండ్లు కురిసి రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ నెల 22, 24న జిల్లాపై రాళ్ల వాన కురిసింది. దీని ప్రభావంతో ఊళ్లకు ఊళ్లే పంటలు కోల్పోయాయి. ముఖ్యంగా చేతికి వచ్చిన వరి పంట అక్కరకు రాకుండా పోయింది.
కోతలు ముగిసిన ధాన్యం కుప్పలు తడిసి రైతులకు నష్టం జరిగింది. ఈ నెల 22న కురిసిన వడగండ్లు గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం 22న కురిసిన వడగండ్ల కారణంగా జిల్లాలోని 17,197 మంది రైతులకు చెందిన 23,709 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. ఇందులో 22,120 ఎకరాలు వరి పంటనే దెబ్బతిన్నది. అనేక గ్రామాల్లో చేతికి రాకుండా పోయింది. 24 కురిసిన అకాల వర్షం కారణంగా 15,251 మంది రైతులకు చెందిన 19,568 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులోనూ 17,963 ఎకరాల్లో వరి పంటే దెబ్బతిన్నది. పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. కాలికి తగిలిన గాయం మానకముందే చేతి కర్ర, స్టాండ్ సహాయంతో ఆయన రైతులను పరామర్శించేందుకు క్షేత్ర స్థాయికి వెళ్లారు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. అంతే కాకుండా వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేసి జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని తక్షణమే ప్రాథమిక సర్వే చేయించి ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం పూర్తి స్థాయి సర్వే నిర్వహించాలని ఆదేశించడంతో వ్యవసాయ అధికారులు క్షణం తీరిక లేకుండా సర్వే చేస్తున్నారు.
మొత్తం తుడిచి పెట్టుకుపోయింది
రాళ్ల వాన ప్రభావం చూపిన కరీంనగర్ మండలంలోని చెర్లభూత్కూర్, గుజ్జులపల్లి, తాహెర్‌కొండాపూర్, తదితర గ్రామాలు, చొప్పదండి మండలంలోని వెదురుగట్ట, చొప్పదండి, రామడుగు, మానకొండూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో పంటలు చేతికి రాకుండా తుడిచి పెట్టుకుపోయాయి. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్ శివారులోని గుజ్జులపల్లిలో వరి పొలాల్లో ఆశ లేకుటా పోయింది. ఈ గ్రామంలో 1,830 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 70 శాతానికిపైగా పంటలు దెబ్బతినడంతో రైతులు ఆశలు వదులుకున్నారు. తాహెర్ కొండాపూర్‌లో అయితే నూటికి నూరుశాతం పంటలు రాళ్లపాలయ్యాయి. చిన్నదైన ఈ గ్రామంలో 570 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. కోతలు నిర్వహించాల్సిన ఈ సమయంలో రైతులు పనులు లేక ఇండ్లలోనే పస్తులు గడుపుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితిని తామెన్నడూ చూడలేదని దిగాలు చెందుతున్నారు.
ఆశ లేకుంట వోయింది
గింత ఆశ లేకుంట వోయింది. రైతులువడ్డ కట్టమంతా రాళ్లపాలైంది. ఇసోంటి రాళ్లు నేనెప్పుడు చూడలే. నేను నాలుగెకరాలు పొలం ఏసిన. నాలుగొద్దులైతే కోసెటోళ్లం. ఇంతల్నే ఇట్లయ్యింది. చానా నష్టం జరిగింది. గడ్డికి వదులుడే. కోస్తే కూలీ దండుగ అయితది.
ఇసోంటి కట్టం రైతులకు రావద్దు.
– దాసరి మల్లారెడ్డి, గుజ్జులపల్లి
ఎనిమిదెకురాలు ఏంలేకుంటైంది
మా ఊరి మీద ఇప్పటికి రెండు మాట్ల రాళ్ల వాన దంచి కొట్టింది. ఇద్దరు కొడుకులు కలిసి పదెకరాలు ఏసిన్రు. పెద్దోడు రెండెకురాలు కోసుకున్నడు. గదే మిగిలింది. పెద్దోని మూడెకురాలు, చిన్నోని ఐదెకురాలు ఆశ లేకుంటవోయింది. ఒక్క చేండ్లకువోయి సూత్తె ఒక్క ఇత్తు లేకుంట రాలింది.
– గుజ్జుల లక్ష్మారెడ్డి, గుజ్జులపల్లి
ఇసోంటి రాళ్లు ఎప్పుడూ సూడలే..
ఠనాకు అరవై ఏండ్లుంటయ్. నేను పుట్టికాన్నుంచి ఇసోంటి రాళ్ల వాన సూడలే. రాళ్లువడ్డ మరుసటి రోజు పోయి చూసినం. వరి చేండ్లళ్ల కరగకుండా అట్లనే ఉన్నయ్. ఆ రోజు ఊరంత ఇగం పెట్టినట్టు సల్లగ అనిపిచ్చింది. చెడగొట్టు వానలు మస్తు సూసినం కానీ, ఇసోంటి రాళ్ల వాననైతే నా జీవితంల సూడలే. ఊరు మొత్తం ఆశ లేకుంట అన్ని పంటలు దెబ్బతిన్నయ్. ఇప్పుడు వర్ల కోతలల్ల తీరిక లేకుంట ఉండెటోళ్లం.
పని లేక చెట్ల కింద కూసున్నం.
– ఆకుల శంకరయ్య, తాహెర్ కొండాపూర్ రైతు
వరి, మిర్చి, టమాట అన్నీ దెబ్బతిన్నయ్ నేను ఐదెకరాల్లో వరి, మిర్చి, టమాట, కాకర పంటలు సాగు చేస్తున్న. బలంగా వీచిన సుడిగాలులు, అకాల వర్షానికి అన్ని పంటలు దెబ్బతిన్నయ్. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నయ్. ఎంతో కష్టపడి సాగు చేస్తున్న. కానీ, ప్రకృతి విధ్వంసం చేసి తీవ్రంగా నష్టపరిచింది.
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
– సింగిరెడ్డి ఇంద్రసేనారెడ్డి, రైతు (ఎలిగేడు)
సెస్‌కు 80 లక్షల నష్టం
ఈదురు గాలులు, భారీ వర్షానికి సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ (సెస్)కు80 లక్షల వరకు నష్టం జరిగింది. అనేక మండలాల్లో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో స్తంభాలు కూలిపోయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అన్ని గ్రామాల్లో 100 మంది సిబ్బంది రాత్రి భారీ వర్షంలోనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా పునురుద్ధ్దరించారు. అటవీ ప్రాంతాల్లో విద్యుత్ తీగలపై పడ్డ చెట్లను రాత్రి తొలగించడం సాధ్యం కానందున కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. నష్టానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు రావాల్సి ఉన్నది. – చైర్మన్ చిక్కాల రామారావు