కలెక్టరేట్, ఫిబ్రవరి 23 : దేశంలో ఏటేటా అమ్మాయిల సంఖ్య తగ్గుతుండటంతో అబ్బాయిలతో సమాన నిష్పత్తిలో ఆడపిల్లల శాతాన్ని పెంచేందుకు కేంద్రం కొత్త ప్రయత్నానికి తెరతీసింది. అమ్మాయి జన్మిస్తే ఆ కుటుంబ సభ్యులచే ఐదు మొక్కలు(Plants,) నాటిస్తూ అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గ్రామాల్లో పలు కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు కూడా రూపొందించి సెర్ఫ్ కు పంపినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి సీఈవో ద్వారాడీఆర్డీవో కార్యాలయానికి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఆడపిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా మూఢ నమ్మకాలు, అనేక ఇతరత్రా కారణాలతో బ్రూణహత్యలు సాధారణమయ్యాయి.
ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖకు అందిన ఉత్తర్వుల్లో స్పష్టమైన సూచనలిచ్చినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈకార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేసేందుకు ఆయా మండలాల్లోని ఏపీవోలు, మండలపరిషత్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు సిబ్బంది తెల్పుతున్నారు. ఆమ్మాయి పుట్టిన కుటుంబాలకు సమీపంలో గల ఖాళీ స్థలాల్లో ఈ మొక్కలను నాటించేలా చర్యలు తీసుకోవాలని సూచనలివ్వగా, ఇందుకవసరమయ్యే ఖర్చుకు అవసరమైన నిధులు ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేయనున్నట్లు డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి.