కార్పొరేషన్/కరీంనగర్ రూరల్/ కొత్తపల్లి/ హుజూరాబాద్‌టౌన్/ వీణవంక/ఇల్లందకుంట/సైదాపూర్/ తిమ్మాపూర్/ తిమ్మాపూర్ రూరల్/ గన్నేరువరం/ మానకొండూర్/మానకొండూర్ రూరల్/ శంకరపట్నం/ చిగురుమామిడి/ చొప్పదండి/గంగాధర, మే 13 : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు 55.82 శాతం పోలింగ్ నమోదైంది. నగరంలోని సప్తగిరికాలనీలో బ్రిలియంట్ స్కూల్లో అరగంట పాటు ఈవీఎం మొరాయించగా.. అధికారులు వెంటనే సరి చేయించారు. సప్తగిరి స్కూల్, రాంనగర్, కోతిరాంపూర్, రేకుర్తి, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, కిసాన్‌నగర్‌లోని పలు పోలింగ్ బూత్‌ల్లో, కార్ఖానాగడ్డ ప్రాంతంలో ఉదయం 10 గంటల తర్వాత ఓట్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ మందకొడిగానే సాగింది. ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకే సుమారు 50 శాతం మేరకు పోలింగ్ కావడం గమనార్హం.
నగరంలోని ముకరంపుర ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ బూత్‌తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 8 గంటల వరకే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ స్థానిక సాధన స్కూల్లోని పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు స్థానిక శ్రేయస్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రేయస్ జూనియర్ కళాశాలలో ఓటు వేశారు. నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు కుటుంబ సభ్యులు భగత్‌నగర్‌లో, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్ కుటుంబ సభ్యులతో కలిసి రాంనగర్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు నగర కమిషనర్ శ్రీనివాస్, జిల్లా ముఖ్య అధికారులు, సిబ్బంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కరీంనగర్ మండలంలోని 25 పోలింగ్ కేంద్రాల్లో 71.18 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. గుంటూర్పల్లి, నగునూర్ గ్రామాల్లోని మహిళా ఆదర్శ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చిన మహిళలను కుంకుమ బొట్టు పెట్టి స్వాగతించారు. తహసీల్దార్ నవీన్‌కుమార్, ఎంపీడీవో సంజీవరావు, ఎంపీవో జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. కాగా, మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకున్న యువ ఓటర్లు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
కొత్తపల్లి మండలం చింతకుంటలో 23వ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో కొంతసేపు ఓటింగ్ నిలిచిపోయింది. అధికారులు మరమ్మతులు చేయడంతో 20 నిమిషాల తర్వాత ఓటింగ్ ప్రారంభమైంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో 72.69 శాతం పోలింగ్ నమోదైంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాలతోపాటు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌జీ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. సీపీ అభిషేక్ మొహంతి పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అన్ని మండలాల్లో పర్యటిస్తూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కాగా, హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తన సతీమణి వీ సుధాశ్రీతో కలిసి ఓటు హకును వినియోగించుకున్నారు. ప్రభుత్వ హైస్కూల్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, జడ్పీహెచ్ఎస్లో వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మలాశ్రీనివాస్ ఓటు వేశారు.
వీణవంక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి-శాలినిరెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు, హిమ్మత్‌నగర్‌లో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్-శ్వేత దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) లక్ష్మీనారాయణ వీణవంకలో పోలింగ్ సరళిని పరిశీలించారు.
ఇల్లందకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయాగణపతి ఓటు వేశారు. తహసీల్దార్ రాణి, తదితర అధికారులు పోలింగ్‌ను పరిశీలించారు.
సైదాపూర్ మండలంలో 78.54శాతం పోలింగ్ నమోదైంది. దుద్దనపల్లి, వెన్కేపల్లి గ్రామాల్లో పోలింగ్ సరళిని మంత్రి పొన్నం ప్రభాకర్, వెన్కేపల్లి-సైదాపూర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ పరిశీలించారు. వెన్నంపల్లిలో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పోలింగ్ సరళిని తెలుసుకున్నారు.
మానకొండూర్ నియోజకవర్గం వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తిమ్మాపూర్ మండలం అలుగునూర్లోని 137వ పోలింగ్ బూత్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వినోద్‌కుమార్ భారీ మెజార్టీతో గెలవనున్నారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తిమ్మాపూర్‌లో ఎంపీపీ కేతిరెడ్డి వనితాదేవేందర్ రెడ్డి, కొత్తపల్లిలో జడ్పీటీసీ ఇనుకొండ జితేందర్ రెడ్డి, నుస్తులాపూర్‌లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గన్నేరువరం మండలంలో 80.63 శాతం పోలింగ్ నమోదైంది.
మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామం మానకొండూర్ మండలం పచ్చునూర్లో ఓటు వేశారు. మానకొండూర్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
శంకరపట్నం మండలంలో సాయంత్రం 6 గంటల వరకు 70 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మొలంగూర్ పోలింగ్ కేంద్రంలోని 116వ పోలింగ్ బూత్‌లో 45 నిమిషాల పాటు ఈవీఎం మొరాయించగా ఎట్టకేలకు సరి చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అనుచరులతో పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఓటింగ్ సరళిని పరిశీలించారు. మానకొండూర్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏసీపీ కాషయ్య ఆముదాలపల్లి తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
చిగురుమామిడి మండలంలో 77.45 శాతం ఓటింగ్ నమోదైంది. ములనూర్, సుందరగిరి, ముదిమాణిక్యం, సీతారాంపూర్ తదితర గ్రామాల్లో కొంత సేపు ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ నిలిచిపోయింది. సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి స్వగ్రామం రేకొండలో ఓటు హకును వినియోగించుకున్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పన్యాల భూపతి రెడ్డి, ఎంపీపీ కొత్త వినీతా, జడ్పీటీసీ గీకురు రవీందర్, జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి ఓటు వేశారు. ఓటింగ్ సరళిపై హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ మండల కేంద్రంలో నాయకులతో సమీక్షించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు నాయకులను ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకులను ఓటింగ్ సరళి అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీఐ కోటేశ్వర్, ఎస్ఐ బండి రాజేశ్ బందోబస్తు నిర్వహించారు. చిగురుమామిడి పోలింగ్ కేంద్రాన్ని డీసీపీ (లా అండ్ ఆర్డర్) లక్ష్మీనారాయణ పరిశీలించారు.
చొప్పదండి మండలంలోని పోలింగ్ కేంద్రాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు వేర్వేరుగా సందర్శించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. మండలంలోని రాగంపేటలో ఏర్పాటు చేసిన 123 పోలింగ్ స్టేషన్లో ఈవీఎం మొరాయించడంతో గంటన్నర పోలింగ్ ఆలస్యమైంది. రామడుగు మండలంలో వెలిచాలలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సింగిల్‌విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్రావు, మాజీ జడ్పీటీసీ వీర్ల కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ఎస్ఐ ఉపేంద్రాచారి పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు.
గంగాధర మండలం మధురానగర్‌లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, చెర్లపల్లి(ఆర్)లో జడ్పీటీసీ పుల్కం అనురాధానర్సయ్య, కురిక్యాలలో సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్‌రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచులు, తాజా మాజీ ఉప సర్పంచులు, నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒద్యారంలో పోలింగ్ స్టేషన్‌ను సెంట్రల్ అబ్జర్వర్ అమిత్ కటారియా పరిశీలించారు.