కలెక్టరేట్/ చిగురుమామిడి, నవంబర్ 6: కులగణన సర్వే నేటి నుంచి ప్రారంభమైంది. మూడు రోజులపాటు చేపట్టే ఇండ్ల జాబితా నమోదు (హౌస్లిస్టింగ్) కార్యక్రమం బుధవారం మొదలైంది. ఈ సర్వేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయగా, మొదటి రోజు ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు.
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్, చిగురుమామిడి మండలం రేకొండ పరిధిలోని పెద్దమ్మపల్లెలో.. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ కొడిమ్యాలతోపాటు పూడూర్, మల్యాల మండలం రామన్నపేటలో.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో సర్వేను పరిశీలించారు. మూడు రోజుల పాటు హౌస్లిస్టింగ్ సర్వే చేస్తారని, ఈ నెల 9 నుంచి ప్రభుత్వం ముద్రించిన ఫార్మాట్లో కుటుంబ వివరాలను ఎన్యుమరేటర్లు సేకరించి నమోదు చేస్తారని చెప్పారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎటువంటి అపోహలు లేకుం డా వివరాలు అందించాలని సూచించారు.