కరీంనగర్ తెలంగాణచౌక్/ వేములవాడ రూరల్, నవంబర్ 19 : వరంగల్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి సభకు కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల నుంచి 156 పల్లెవెలుగు బస్సులు కేటాయించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సమాఖ్య మహిళలను తరలించడం కోసం సంబంధిత శాఖ డీఆర్డీఏ విజ్ఞిప్తి మేరకు వీటిని సభకు కేటాయించారు. దీంతో ఆయా బస్టాండ్లలో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో బస్సులు లేక ఆరు గంటలపాటు బస్టాండ్లో వేచి చూశారు. కార్తీక మాసం కావడం, బద్ది పోచమ్మకు బోనాలు సమర్పించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కానీ, ఆర్టీసీ అధికారులు ముందస్తుగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. కనీసం ప్రయాణికులకు బస్సులు ఎప్పుడు వస్తాయో చెప్పలేకపోయారు. గంటల తరబడి వేచి ఉన్నా బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేశారు. తిప్పాపూర్ బ్రిడ్జిపై వాహనాలు నిలిచిపోయి దాదాపు గంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు చెల్లాచెదురు చేయడడంతో ప్రయాణికులు ఎదురుతిరిగారు. ఓటు వేసి గెలిపిస్తే రేవంత్రెడ్డి తమకు బస్సులు లేకుండా చేసి ఇబ్బంది చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం మీటింగ్లకు బస్సులను వాడుకొని ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు.
ఇటు కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్, మంచిర్యాల, గోదావరిఖని, ధర్మపురి, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, బెజ్జంకి, సిద్దిపేట, సిరిసిల్ల రూట్లలోని గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దీంతో కొందరు తమ గ్రామాల్లో ఎక్స్ప్రెస్ బస్సులను ఆపాలని డ్రైవర్లను బతిమిలాడుకొని ఆ బస్సుల్లో వెళ్లారు. ఎక్స్ప్రెస్ వెళ్లని రూట్లలో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. సీఎం సభకు బస్సులను కేటాయించే సమాచారాన్ని ఆర్టీసీ అధికారులు ఒక రోజు ముందు సమాచారం తెలిపితే తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం, లేదా మరో మార్గం ద్వారా గమ్యస్థానాలకు చేరుకునేవారమని ప్రయాణికులు వాపోయారు.