Peddapally | పెద్దపల్లి కమాన్, జూన్ 18 : విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధమవుతున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్వీ నాయకులను గురువారం ఉదయం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
బీఆర్ఎస్వీ జిల్లా మాజీ అధ్యక్షుడు కొయ్యడ సతీష్ గౌడ్, దేవేందర్, ఉప్పు శివకుమార్ ను పెద్దపల్లి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కొయ్యడ సతీష్ గౌడ్ మాట్లాడుతూ అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాలను ఆపలేరని, కాంగ్రెస్ సర్కార్ ఎంత అణగదొక్కినా తమ పోరాటం ఆగదన్నారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరంతరం ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.