కార్పొరేషన్, ఫిబ్రవరి 9 : కులగణన తప్పుల తడకని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీసీలకు అన్యాయం చేయద్దని, మళ్లీ శాస్త్రీయంగా రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం ఎమ్మెల్యే ముఠాగోపాల్ అధ్యక్షతన ‘స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు ఎలా..?’ అనే అంశంపై బీసీ ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో జిల్లాకు చెందిన బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన 42శాతం రిజర్వేషన్ల హామీని తుంగలో తొక్కారని, కులగణనలో బలహీన వర్గాలను తక్కువ చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు.