వీణవంక, మే 10 : పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలు గెలుస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసానికి శుక్రవారం రాత్రి రాగా, మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నివాసం ఆవరణలో వీణవంక గ్రామస్తులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధించింది, అభివృద్ధి చేసింది కేసీఆర్ మాత్రమేనని, మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని, మరిన్ని మంచి పనులు చేసుకుందామని చెప్పారు.
ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ బాగా పోరాడారని, 2023 ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డిని గెలిపించి కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేంద్రంలో ఉన్న బీజేపీ దేవుళ్ల పేరుచెప్పి ఓట్లు అడుగుతున్నదని, ఎంపీగా బండి సంజయ్ రూపాయి పని చేయలేదని, ప్రజలకు కనీసం ముఖం కూడా చూపెట్టలేదని ధ్వజమెత్తారు. మోదీ ప్రియమైన పీఎం కాదని, పిరమైన పీఎం అని, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, మళ్లీ ఏవో కట్టుకథలు చెప్పి ఓట్లు అడగడానికి వస్తున్నారని జాగ్రత్తగా ఆలోచన చేసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని, 12 ఎంపీ స్థానాలు గెలిచి, వచ్చే ఆరు నెలల్లో కేసీఆర్‌నే మళ్లీ సీఎంను చేద్దామని అన్నారు. వీణవంక గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్, బీఆర్ఎస్పై ఉన్న ప్రేమతో వచ్చిన మహిళలకు, యువతీయువకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఇంట్లో బస చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎంపీపీ రేణుక-తిరుపతిరెడ్డి, వైస్‌ఎంపీపీ లత-శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.