రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించి సత్తా చాటుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇది ఏ ఒక్కరి కోసమో జరుగుతున్న ఎన్నిక కాదని, ప్రతి బీఆర్ఎస్ నాయకుడు తనుకు తానుగా కథనాయకులై వారి పరిధిలో మెజార్టీ తేవాలని సూచించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ప్రతిమ హోటల్లో గురువారం నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు ఈ నెల 12న కదనభేరి విజయవంతంపై దిశానిర్దేశం చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులను ఉత్తేజ పరుస్తూనే.. మరోవైపు రేవంత్‌రెడ్డితోపాటు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు.
కార్పొరేషన్, మార్చి 7 : పార్లమెంట్లో మన కరీంనగర్ నియోజకవర్గ గొంతు వినపడాలంటే.. వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేస్తే గెలుపు సునాయాసం అవుతుందని, అందుకోసం ఎవరికీ వారే కథానాయకులు కావాలని సూచించారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న బండి సంజయ్ పిచ్చి మాటలు తప్ప.. నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వందరోజుల్లోగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సాగునీరు అందక పంటలు పోండిపోతున్నాయని, వెంటనే పరిహారం చెల్లించాలన్నారు. ఈ సీజన్ నుంచే రైతులకు రూ.500ల బోనస్‌ను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల12న కరీంనగర్లో కదనభేరి విజయవంతం కోసం గురువారం స్థానిక ప్రతిమ హోటల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు అధ్యక్షత వహించగా, ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితల సతీశ్కుమార్తోపాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై, కదనభేరి పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యేలు లేరని, అక్కడి నాయకులకు అండగా నిలవాలంటే.. వినోద్‌కుమార్ గెలువాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.
ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని ఎన్నో హామీలు ఇచ్చి, ప్రజలను భ్రమలో పెట్టి గద్దనెక్కిన కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండ గట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి పోరాడడమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రథమ లక్ష్యమనే విషయాన్ని ఎవరూ మచిరిపోవద్దని సూచించారు. వంద రోజుల్లో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తూనే.. ఇప్పటి వరకు అమలుకు నోచని హామీలపై ప్రశ్నించాలన్నారు.
మరో పది రోజులైతే వంద రోజులు అవుతుందని, ఇచ్చిన 420 హామీలు అమలు చేస్తుందా? అని ప్రశ్నించారు. మోడీకి రేవంత్‌రెడ్డి గులాం చేస్తున్నారని, ముంగిట పార్లమెంట్ ఎన్నికలు పెట్టుకొని ‘మోదీ పెద్దన్న’ అంటూ చెప్పడమే కాకుండా.. భవిష్యత్‌లోనూ మీ ఆశీస్సులు ఉండాలని కోరుతున్నారంటే.. దేశంలో కాంగ్రెస్ గెలువదని రేవంత్‌రెడ్డి ముందుగానే నిర్ణయానికి వచ్చారని అర్థమవుతుందన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది మురుగు కాలువలో వేసినట్టే అవుతుందన్న విషయాన్ని ఆలోచించుకోవాలని సూచించారు.
అతిరథ మహారథులు ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ ఎలా గెలిచారో అర్థం కాని పరిస్థితి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నిజంగా గడిచిన ఐదేళ్లలో ఆయన నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లుగా దేశ ప్రధానిగా మోడీ ఉన్నారని, అందులో ఐదేళ్లు ఎంపీగా వినోద్‌కుమార్, మరో ఐదేళ్లు సంజయ్ ఉన్నారని చెప్పారు. ఐదేళ్లలో వినోద్‌కుమార్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నామని, మరి బండి సాధించిన ప్రగతి ఏంటో చెప్పడానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. ‘కరీంనగర్ నడి ఒడ్డున ఉన్న కమాన్ వద్ద చర్చ పెట్టుకుందాం. టైం నువ్వే ఫిక్స్ చెయ్. మా పార్టీ నుంచి వినోద్‌కుమార్ వస్తరు.
మీ పార్టీ నుంచి నువ్వు వచ్చే దమ్ముందా?’ చెప్పాలని డిమాండ్ చేశారు. సంజయ్ మాట్లాడితే.. ఎవరికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు. ఏనాడూ ఆయన ఈ అభివృద్ధి చేస్తానని చెప్పరని, ధర్మం కోసం పనిచేస్తామని నమ్మబలుకుతారని, అదే నిజమైతే ఒక మఠం పెట్టుకొని పని చేసుకోవచ్చు కదా.. ? ఎంపీ పదవెందుకు అంటూ ప్రశ్నించారు. చివరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పట్టుకొని నీవు నీ తల్లికే పుట్టావని గ్యారంటీ ఏంటి? అంటూ సంజయ్ మాట్లాడుతున్నారంటే.. ఆయన ఏ స్థాయికి దిగజారారో అర్థం చేసుకోవాలని సూచించారు. అలాంటి వ్యక్తి ఎంపీగా కొనసాగేందుకు అర్హుడా? అని ప్రజలు ఆలోచించాలని కోరారు. వినోద్‌కుమార్ వంటి మంచి మనిషిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో రాష్ట్ర నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు, తుల ఉమ, జడ్పీ అధ్యక్షులు కనుమల్ల విజయ, దావ వసంత, ఆరుణ-రాఘవారెడ్డి, సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నాయకులు సర్దార్ రవీందర్‌సింగ్, అనిల్ కుర్మాచలం, బండ శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్, ప్రవీణ్‌రెడ్డి, రూప్సింగ్, కర్నె ప్రభాకర్, గూడూరి ప్రవీణ్, కర్ర శ్రీహరి, లోక బాపురెడ్డి, రూప్సింగ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనిల్, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.
కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తెలంగాణ అభివృద్ధి మరింత సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ ఓడిపోలేదు. కాంగ్రెస్ అబద్ధాలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఆ పార్టీ డబ్బా కొడుతున్నది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పథకాలను సైతం కాంగ్రెస్ తమవని చెప్పుకోవడం సిగ్గుచేటు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణపై ప్రేమ ఉన్న వారితోనే అభివృద్ధి సాధ్యమైతది. పచ్చి అబద్ధాలు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినోళ్లతో కాదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులు ఇవ్వాలని లోక్‌సభలో గళమెత్తిన.
మిషన్ భగీరథ, జాతీయ రహదారులకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేసిన. కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ ఇవ్వాలని కొట్లాడిన. హైదరాబాద్ రామగుండం దారిలోని రక్షణ శాఖ భూములు ఇవ్వాలని ఐదుగురు ఎంపీలతో కలిసి వెళ్లి అడిగిన. సిరిసిల్లకు రైల్వేలైన్ కోసం కృషి చేసిన. 2024 డిసెంబర్ వరకు ఇది పూర్తయితది. వచ్చే ఏడాది జనవరిలో రైల్వే స్టేషన్ ప్రారంభమవుతుంది. పనిచేసే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే లాభం జరుగుతది.
గత ఎన్నికల్లో ఒడిపోయిన కరీంనగర్‌లోనే ఉన్న. అనునిత్యం బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా నిలిచిన. కానీ, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఐదేళ్ల కాలంలో ఏ రోజైనా పార్లమెంట్లో ప్రజా సమస్యలపై మాట్లాడారా..? అబద్ధాలు చెప్పడం, అభాండాలు వేయడం తప్పా పైసా పనైనా చేశారా..? మతం పేరిట ప్రజలను అయోమయానికి గురి చేయడమే ఆయనకు తెలుసు. ఇలాంటి నాయకుడు మనకు అవసరమా? ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేయకుంటే ప్రజలకు అడిగే హక్కు వస్తుంది. గ్యారెంటీలు అమలు కోసం మేం ప్రజల పక్షాన పోరాడుతం. నేను మీ వెంటే ఉంట. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుత. – కరీంనగర్, సిరిసిల్లలో పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్