సిరిసిల్ల రూరల్/ సిరిసిల్ల టౌన్, మార్చి 2 : ‘నా మీద కోపం పేదోళ్ల మీద తీసుడేంది? బీదోళ్లపై అక్రమ కేసులు పెట్టి జైళ్లో పెట్టుడేంది? ఇంత కక్షపూరితమా..? ఇసోంటి చెండాలమైన ప్రభుత్వాన్ని నేనెక్కడా చూడలేదు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. అయినా మీరెవరూ బాధపడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటానని ధైర్యమిచ్చారు. ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని, మీ వెంట నిలిచి మిమ్మల్ని కాపాడుకుంటానని భరోసానిచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల్లలో అక్రమ కేసులో జైలుకు వెళ్లిన రైతు రాజిరెడ్డిని పరామర్శించారు. ఆయన ఇంటికి వెళ్లి, ఆప్యాయంగా పలుకరించి ఓదార్చారు. అక్కడి నుంచి ఇందిరమ్మకాలనీకి వెళ్లారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చిలుక రఘువర్మ ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి 2లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.
ఆ తర్వాత సిరిసిల్ల క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇటీవల ట్రేడ్ లైసెన్సు లేదంటూ మున్సిపల్ అధికారులు తొలగించిన టీ స్టాల్ నిర్వాహకుడికి ధైర్యం చెప్పారు. చివరగా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండాలో రైతు దంపతులు భూక్యా మహేశ్, సంగీత వేసిన వరి పొలాన్ని పరిశీలించారు. ఆరు ఎకరాల్లో ఎండిపోయిన పంటను చూసి ఆవేదన చెందారు. ఆ తర్వాత ముస్తాబాద్ మండలంలోనూ పర్యటించారు. పోతుగల్లో జెల్ల దేవయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా, ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా నిచ్చారు. పార్టీ ద్వారా రెండు లక్షల ఆర్థిక అందజేశారు. ఆయాచోట్ల కేటీఆర్ మాట్లాడారు. ప్రజా సమస్యల కోసం కొట్లాడుతామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకూ ప్రజల పక్షాన ప్రభుత్వాని నిలదీస్తామని హెచ్చరించారు. ఆయాచోట్ల ఆయన వెంట నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ కేసీఆర్ సారే రావాలి
జిల్లెల్ల రైతు రాజిరెడ్డిని పరామర్శించిన తర్వాత అక్కడే వేచి చూస్తున్న వృద్ధులు, రైతులతో కేటీఆర్ ఆప్యాయంగా మాట్లాడారు. యోగ క్షేమాలు తెలుసుకున్నారు. పింఛన్ ఎంత వస్తుందని అడగడంతో ఈ సర్కార్ నాలుగువేలు ఇవ్వకుండా మోసం చేస్తున్నదని వాపోయారు. సాగు నీళ్లు కూడా ఇస్తలేదని, మా ఊరు చెరువు నింపుతలేరని మీరే పట్టించుకోవాలని రైతులు కోరారు. దీంతో కేటీఆర్ మన సారు ఇప్పుడు సీఎం కాదు కదా అనడంతో ‘మళ్లీ మన కేసీఆర్ సారే వస్తడు, రావాలి’ అంటూ వృద్ధులు ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం కుంగిందని సాకులు చెప్పి నీళ్లు రాకుండా చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఒక్క ఓటు వేసినందుకు ఐదేళ్ల శిక్ష తప్పదు కదా వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ద్వారా మిడ్‌మానేరు, రంగనాయకసాగర్లు నింపి కాలువల ద్వారా రైతులకు నీళ్లు అందించామని గుర్తు చేశారు. ఇప్పుడు తంగళ్లపల్లిలో మానేరు వాగు వంతెన కింద నీళ్లు లేవని, నాడు మండుటెండల్లోనూ వాగులు, చెరువులు నిండుకుండలా ఉన్నాయన్నారు. మళ్లీ కేసీఆర్ సారు వస్తేనే చెరువులు, కాలువలు నింపుకుని పండుగలా వ్యవసాయం చేసుకుందామన్నారు.
కేటీఆర్‌తో వృద్ధులు, రైతులు పంట పొలాలకు నీళ్లిప్పియ్యండి
తమ పంట పొలాలకు కాలువల ద్వారా నీళ్లు వస్తలేవని, చెరువులు నింపుతలేరని తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, నేరెళ్ల, చిన్నలింగపూర్, రాంచంద్రాపూర్, ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామాల రైతులు కేటీఆర్‌ను కలిసి మొర పెట్టుకున్నారు. గతంలో రంగనాయకసాగర్ ద్వారా చెరువుల్లో నీళ్లు నింపారని, ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఆయన, వెంటనే ఇరిగేషన్ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడారు. రైతులు ఆందోళనలో ఉన్నారని, కాలువలను పరిశీలించి వెంటనే నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక్కడ మూడెకరాలకు సంబంధించిన పరిహారం రైతులకు రావాల్సి ఉందని, వెంటనే అందించాలన్నారు. దీంతో సోమవారం సందర్శించి చర్యలు తీసుకుంటామని ఎస్ఈ తెలిపారు. తర్వాత రైతులతో కేటీఆర్ మాట్లాడుతూ భూ పరిహారం అందించేలా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడుతానని చెప్పారు. అవసరమైతే రైతులతో కలిసి ఎస్ఈ కార్యాలయం వద్దే ఆందోళనకు దిగుతామన్నారు. పరిహారం ఇవ్వకుంటే తన సొంత డబ్బులు చెల్లించి సాగునీరు అందించేలా కృషి చేస్తానన్నారు.
పంట పొలాలకు నీళ్లిప్పియ్యండి
తమ పంట పొలాలకు కాలువల ద్వారా నీళ్లు వస్తలేవని, చెరువులు నింపుతలేరని తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, నేరెళ్ల, చిన్నలింగపూర్, రాంచంద్రాపూర్, ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామాల రైతులు కేటీఆర్‌ను కలిసి మొర పెట్టుకున్నారు. గతంలో రంగనాయకసాగర్ ద్వారా చెరువుల్లో నీళ్లు నింపారని, ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఆయన, వెంటనే ఇరిగేషన్ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడారు. రైతులు ఆందోళనలో ఉన్నారని, కాలువలను పరిశీలించి వెంటనే నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక్కడ మూడెకరాలకు సంబంధించిన పరిహారం రైతులకు రావాల్సి ఉందని, వెంటనే అందించాలన్నారు. దీంతో సోమవారం సందర్శించి చర్యలు తీసుకుంటామని ఎస్ఈ తెలిపారు. తర్వాత రైతులతో కేటీఆర్ మాట్లాడుతూ భూ పరిహారం అందించేలా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడుతానని చెప్పారు. అవసరమైతే రైతులతో కలిసి ఎస్ఈ కార్యాలయం వద్దే ఆందోళనకు దిగుతామన్నారు. పరిహారం ఇవ్వకుంటే తన సొంత డబ్బులు చెల్లించి సాగునీరు అందించేలా కృషి చేస్తానన్నారు.
శ్రీనివాస్ అధైర్యపడద్దు .. శాశ్వత ఉపాధి చూపిస్తా
అధైర్య పడొద్దు.. అండగా ఉంటానని సిరిసిల్లకు చెందిన టీ స్టాల్ నిర్వాహకుడు శ్రీనివాస్‌కు కేటీఆర్ భరోసా కల్పించారు. సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ను శ్రీనివాస్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ‘సార్ నేనెవరికీ ఏ అన్యాయం చేయలె. నాలుగేండ్లుగా కేటీఆర్ టీ స్టాల్ పేరుతో మీ ఫొటో పెట్టుకుని హోటల్ నడుపుకుంటున్న. నాపనేందో నేను చేసుకుంటున్న. ఎవరో పెద్ద సారంట బతుకమ్మ ఘాట్‌కు వచ్చినప్పుడు హోటల్‌పై మీ ఫొటో చూసి నా హోటల్‌ను బంద్ పెట్టించిండు’ అంటూ వాపోయాడు. ఎందుకు మూసేయాలని అడిగితే ట్రేడ్ లైసెన్సు లేదని సాకు చెప్పారని తెలిపాడు. ఆ తర్వాత రెండు రోజులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే సామగ్రితో సహా హోటల్ డబ్బాను ట్రాక్టర్లో మున్సిపల్ అధికారులు దొంగల మాదిరిగా ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో కేటీఆర్ ధైర్యం చెప్పారు. అన్ని రకాల అనుమతులతో 10 లక్షలు ఖర్చయినా సరే మంచి టిఫిన్ సెంటర్ పెట్టిస్తానని హామీ ఇచ్చారు. నెలకు 30 వేల నుంచి 40వేలు సంపాదించుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ‘స్థానిక నాయకులు చెప్పిన చోట దుకాణం ఏర్పాటు చేసుకో. నా మీద కోపం నీ మీద పడకుండా లైసెన్సు, అడ్డా అన్ని సరిగా చూసుకో’ అని సూచించారు. వారం పది రోజుల్లో హోటల్‌ను తానే వచ్చి ప్రారంభిస్తానని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే
ఎల్లారెడ్డిపేట, మార్చి 2: రాబోయే 48 గంటల్లో నీళ్లు విడుదల చేసి పంటలకు సాగునీరందించకుంటే మంత్రి ఉత్తమ్‌కుమార్ కార్యాలయం చాంబర్ ఎదుట ధర్నా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. పంటలు ఎండి పోవడానికి రేవంత్ సర్కారే కారణమని ధ్వజమెత్తారు. పంటలు ఎండి పోవడానికి కాలం తెచ్చిన కరువు ఎంత మాత్రం కాదని, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువేనని విమర్శించారు. కేసీఆర్‌పై కోపం ఉంటే రాజకీయంగా తలపడాలని, రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనేశ్వరం అని రైతులంటున్నారని, కాంగ్రెస్ వచ్చినంక కాలం కూడా అయితలేదని చెబుతున్నారని తెలిపారు. మల్కపేట కాలువ నీళ్లు రాకపోవడంతో దేవునిగుట్టతండాలో ఎండిపోయిన పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు.
జరిగిన నష్టాన్ని చూసి చలించిపోయారు. రైతు దంపతులు భూక్యా మహేశ్, సంగీతతో మాట్లాడి, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ సార్ కట్టిచ్చిన కాళేశ్వరం నుంచి మల్కపేట రిజర్వాయర్ ద్వారా నీళ్లు వస్తయని ఆశతో దేవునిగుట్టతండాకు చెందిన సంగీత అనే రైతు ఆరెకరాల్లో నాటేస్తే ఇప్పుడు పంటలెండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదనగా తనకు చెబుతున్నదని తెలిపారు. ఆమెకు రుణమాఫీ కాలేదని, రైతు భరోసా, బోనస్ రాలేదని చెప్పారు. గతంలో ఎర్రటి ఎండల్లో మిడ్‌మానేర్, అప్పర్‌మానేర్, చెరువులను నింపి రైతులను కాపాడుకున్నామని గుర్తు చేశారు.
తాను పంటను పరిశీలించేందుకు వచ్చేటప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఈఎన్సీ అనిల్‌కుమార్‌తో మాట్లాడానని చెప్పారు. వందల ఎకరాలు పంటలు ఎండుతుంటే చూస్తూ ఊరుకోబోమని, కేసీఆర్ మీద కోపముంటే తమతో కొట్లాడాలని రైతులను చావగొట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవుపలికారు. మిడ్‌మానేర్ నుంచి రంగనాయక్ సాగర్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తంగళ్లపల్లిలో రైతులు వచ్చి కలిశారని, జిల్లెల్ల, నేరెల్ల, రామచంద్రాపూర్, దాచారం, మాటిండ్ల రైతులు అడుగుతున్నారని చెప్పారు. మిడ్‌మానేర్‌లో 16 టీఎంసీలు ఉన్నాయని, అందులో మల్కపేటకు అడిగేదే ఒక టీఎంసీ మాత్రమేనని, తాగునీటి కోసం 3 టీంఎంసీలు సరిపోతాయని అన్నారు. ఇంకా 13 టీఎంసీలు ఉంటాయని, వెంటనే సాగునీరు విడుదల చేయాలని కోరారు. లేకుంటే రైతులను కూడగట్టుకుని పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.
సారీ రాజన్నా.. నా మీద కోపం నీ మీద తీసిన్రు
‘సారీ రాజన్నా.. నా మీద కోపం నీ మీద తీసిన్రు. కలెక్టర్ నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిండు. ధైర్యం కోల్పోవద్దు. మీకే కాదు ఎవరికి అన్యాయం జరిగినా కాపాడుకుంట’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు రాజిరెడ్డికి భరోసా కల్పించారు. అసైన్డ్ భూమి అనేది పేదలకు ఇచ్చేదే కదా? నిజంగా అసైన్డ్ భూమి ఉంటే తప్పేందని ప్రశ్నించారు. మళ్లీ మంచి రోజులు వస్తాయని, మీరంతా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఎలాంటి అవసరం ఉన్నా తనతో కానీ, తన పార్టీ నేతలతో కానీ చెప్పాలని సూచించారు. పార్టీ నేతలు అందుబాటులో ఉండి కావాల్సిన అవసరాలు తీరుస్తారని చెప్పారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో తాము కక్షలు చేయలేదని, కక్ష పూరితంగా వ్యవహరిస్తే వీళ్లంతా ఉండేవారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము పని చేసుకుంటూ ప్రజలకు అండగా ఉన్నట్టు గుర్తు చేశారు. కాంగ్రెసోళ్లు వచ్చినా.. బీజేపోళ్లు వచ్చినా వాళ్లకు లాభం చేశామని, ఏనాడూ నష్టం చేసే పనులు చేయలేదన్నారు. ఒక పేదోడు టీ స్టాల్ పెట్టుకుంటే దాన్ని కూడా తీసేసిన దరిద్రపు ప్రభుత్వం కాంగ్రెస్ అని మండిపడ్డారు. అనంతరం రైతు రాజిరెడ్డి కేటీఆర్‌కు తాను జన్మాంతం రుణపడి ఉంటానని చెప్పారు. తర్వాత అక్కడే ఉన్న రాజిరెడ్డి మనువడిని కేటీఆర్ అక్కున చేర్చుకుని సరదాగా సంభాషించారు. ‘డైపర్ వేశారా.. లేదా.. ఇంకా శుభకార్యాలకు వెళ్లేది ఉంది’ అంటూ నవ్వించారు. తర్వాత వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు.
ఏసిన పంటంతా ఎండింది
మాకు ఆరు ఎకరాల భూమి ఉంటే మొత్తం వరి పంట ఏసినం. మొన్నటి దాక మల్కపేట కాల్వ నీళ్లు వస్తయని ఆశ ఉండె. నీళ్లు గూడ బందై మొత్తం పొలం ఎండిపోయింది. 1.80లక్షలు పెట్టుబడి పెడితే మొత్తం నీళ్లు పోసినట్టయింది. ఈ ప్రభుత్వంలో రైతుభరోసా గూడ రాలేదు. బ్యాంకులో రూ.1.60 లక్షల రుణం ఉన్నది. రూ.2లక్షల రుణమాఫీ అన్నరు అదికూడా కాలేదు. కండ్లముందట పొలమెండుతుంటె సూడలేక పశువులను మేతకు ఇడిసిపెట్టినం.
-భూక్యా సంగీత, రైతు, దేవునిగుట్టతండా (ఎల్లారెడ్డిపేట)