ముకరంపుర, జూలై 13 : కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లె రైల్వేట్రాక్ వద్ద సీఐఆర్ఎఫ్ ఫండ్ కింద కేటాయించిన రూ.154 కోట్లతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి గురువారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ విజయ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ సునీల్‌రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి భూమి పూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ లో కరీంనగర్ జిల్లా, నగరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు.
కరీంనగర్లో ఉన్న రైల్వే ట్రాక్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆర్వోబీ పనులు వేగంగా జరగాలని సీఎం కేసీఆర్‌ను కలిసి వివరించినట్లు తెలిపారు. దీంతో ఆయన సీఐఆర్ఎఫ్ కింద రూ.154 కోట్లతో ఆర్వోబీ నిర్మాణానికి అనుమతిచ్చారన్నారు. ఇది ప్రజల ఫండ్ అని, ఎవరూ రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. ఆర్వోబీ మొత్తం ఖర్చు రూ.154 కోట్లని తెలిపారు. ఇందులో కాంట్రా క్టు వాల్యూ రూ.74కోట్లు కాగా,మిగతా రూ.80 కోట్లు ఆర్వోబీ నిర్మాణం కోసం అవసరమైన భూమిని సేకరించేందుకు కేటాయించారని వివరించారు. ఆర్వోబీ పొడవు 750 మీటర్లు ఉం టుందన్నారు. బ్రిడ్జి 162 మీటర్లు ఉంటుందన్నారు. రైల్వే లైన్ మాత్రం 21మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారని వివరించారు. అగ్రిమెంట్ అయిన మూడు రోజుల్లోనే పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ఏడాదిలోగా ఆర్వోబీ నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభించామని, రోడ్డుపై ఉన్న స్తంభా లు కూడా తొలగిస్తామన్నారు. ట్రాఫిక్ డైవర్షన్‌పై కలెక్టర్, రైల్వే, ఇతర విభాగాల అధికారుల బృందంతో జాయింట్ సర్వే నిర్వహిస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో ట్రాఫిక్ డైవర్షన్ ప్రక్రియ కూడా పూర్తవుతుందన్నారు. స్థానికుల అభ్యర్థన మేరకు సర్వీసు రోడ్లు కూడా నిర్మిస్తామన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణం గా, రాబోయే 40ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బందు లూ లేకుండా ఆర్వోబీ నిర్మాణం ఉంటుందన్నా రు. నిర్మాణ పనులతో రైల్వే వ్యాగన్లకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ మాట్లాడుతూ…రైల్వే ట్రాక్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నందున ఆర్వోబీని నాలుగు లైన్లతో నిర్మిస్తున్నామని చెప్పారు. అతి త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఆర్వోబీపై రాజకీయ పార్టీలు సమస్యలు లేవనెత్తి, పరిషారం కోసం మాట్లాడవచ్చని సూచించారు. గతంలో తాను ఎంపీగా గెలిచిన వెంటనే నియోజకవర్గంలోని ఉప్పల్, బిజిగిరి షరీఫ్, కరీంనగర్ ఆర్వోబీల విషయమై రైల్వేకు లేఖ రాయగా, అప్పుడున్న పరిస్థితుల్లో రైళ్ల రాకపోకలు అంతగా లేవంటూ లిఖిత పూర్వకంగా తెలిపారని చెప్పారు. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ లింకు అందుబాటులోకి రావడంతో రద్దీ పెరిగిందన్నారు. మహారాష్ట్ర వైపు వెళ్లే బొగ్గు, సిమెంటు, డీజిల్, పెట్రోల్, గూడ్స్ రైళ్ల రాకపోకలకు కరీంనగర్ లైన్ దగ్గరి మార్గంగా మారిందన్నారు. రైళ్ల రద్దీతో కరీంనగర్-చొప్పదండి మార్గంలో వాహనదారులు ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ చేయలేదని పలు రాజకీయ పార్టీల నాయకులు ఆరోపించడం వాస్తవం కాదన్నారు.
మొదట సింగిల్ ఆర్వోబీ ఇస్తామని చెప్పగా, ఫోర్ లేన్ ఆర్వోబీ కోసం ఆర్అండ్బీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని వివరించారు. సీఐఆర్ఎఫ్ కింద ఆర్అండ్బీ మంత్రి రాష్ట్రంలో 20ఆర్వోబీలకు ప్రతిపాదనలు పం పించగా ఐదు మాత్రమే కేటాయించారని చెప్పా రు. అందులో కరీంనగర్ ఒకటని వివరించారు. కేంద్ర, రాష్ట్ర వాటాలు లేకుండా సీఐఆర్ఎఫ్ కింద ఆర్వోబీ పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఇది ప్రజల సొమ్మేనని, రైల్వే శాఖ ఒక రూపా యి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇదీ మోర్త్ ఇచ్చిన ఫండ్ అని తెలిపారు. మిగిలిన ఆర్వోబీలు నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ నగరాలకు సంబంధించినవని వివరించారు. ప్రజల అభ్యున్నతి, అభివృద్ధి కోసమే గులాబీ(బీఆర్ఎస్) పార్టీ పుట్టిందన్నారు. అంతకుముందు స్థానిక నాయకులు డప్పు చప్పుళ్లతో అతిథులకు స్వాగతం పలికి, క్రేన్‌తో భారీ గజమాలను వేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, సత్యనారాయణ గౌడ్, కార్పొరేటర్లు కాశెట్టి లావణ్య, కొలగాని శ్రీనివాస్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పలు మండలాల నుంచి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.